మహిళలు, చిన్నారుల భద్రతపై బిల్లు

132
  • పక్కా ఆధారాలు ఉంటే 21 రోజుల్లో శిక్ష

  • తెలంగాణ పోలీసులకు జగన్‌ అభినందన

అమరావతి, డిసెంబర్ 9 (న్యూస్‌టైమ్): ‘దిశ’ సామూహిక అత్యాసారం, దారుణ హత్య నేపథ్యంలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసుల తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కొనియాడారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం వెలగపూడిలోని అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ’లో భాగంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలతో పాటు హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ ఉదంతం తన మనసును ఎంతో కలిచివేసిందని, తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలన్న ముఖ్యమంత్రి అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్‌, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ ‘‘మేం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలు నన్ను కలిచివేశాయి. దీన్ని మార్చాలనే తాపత్రయమే ఈ రోజు చట్టసభలో ఏం చేస్తే మార్పులు తీసుకు రాగలుగుతామని ఆలోచనతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. హైదరాబాద్‌లో దిశ ఉదంతం తీసుకుంటే ఇది నిజంగా సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన. ఆ వైద్యురాలు టోల్‌గేట్‌ వద్ద ఉండగా బండికి పంక్చర్‌ చేసి, దాన్ని రిపేర్‌ చేయిస్తామని నమ్మించి అత్యాచారం చేసి, కాల్చేసిన ఘటన మన కళ్ల ముందే కనబడుతుంది. ఇలాంటి దారుణాలపై పోలీసులు, రాజకీయ నాయకులు ఎలా స్పందించాలని ఆలోచన చేస్తే నిజంగా బాధ అనిపించింది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘ఇలాంటి సంఘటనే మన రాష్ట్రంలో జరిగితే, మనం ఎలా స్పందించాలి. ఆ యువతిపై దారుణానికి పాల్పడ్డవారిని కాల్చేసినా కూడా తప్పులేదని అందరూ అనుకున్నారు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నాకు చెల్లెలు ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక తండ్రిగా ఎలా స్పందించాలి. వాళ్లకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో దాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. హ్యాట్సాఫ్‌ టూ కేసీఆర్‌, తెలంగాణ పోలీసులు.

జరగకూడని పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. సినిమాలో అయితే హీరో ఎన్‌కౌంటర్‌ చేస్తే చప్పట్లు కొడతాం. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది. ఇదే నిజ జీవితంలో జరిగితే, జరిగింది తప్పు… ఇలా ఎందుకు చేశారని నిలదీస్తున్నారు. ఏదైనా జరిగితే బాధిత కుటుంబాలకు కావల్సింది వెంటనే ఉపశమనం. అలా తమకు సత్వర న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. ఎవరైనా కూడా చట్టాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకుని కాల్చేయాలని అనుకోరు. జరుగుతున్న జాప్యం చూసినప్పుడు సంవత్సరాలు తరబడి కోర్టులు చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదనే బాధ వారిని కలిచివేస్తోంది.

అందుకనే ఇవాళ చట్టాలు మారాలి. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. దీనికోసం చట్టాలు మరింత గట్టిగా బలపడాలి. ఒక నేరం జరిగినప్పుడు, రెడ్‌ హ్యాండెడ్‌గా నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు… దిశలాంటి కేసుల్లో నేరాన్ని నిర్ధారించే ఆధారాలు ఉన్నట్టుగా… కనిపిస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులను ఏం చేయాలన్నదానిపై మనం చట్ట సభలో ఆలోచనలు చేయాలి. ఇలాంటి ఆధారాలు దొరికినప్పుడు ఏం చేయాలన్నదానిపై ఆధారాలు చేయాలి. కొన్ని కొన్ని దేశాల్లో అయితే కనిపిస్తే కాల్చేస్తారు. మన దేశంలో చట్టాలను సవరించి, అంగీకార యోగ్యమైన పద్ధతిలో బలమైన చట్టాలను తీసుకురావాలి.

సంఘటన జరిగిన వారం రోజుల్లోపు విచారణ పూర్తికావాలి, ఈలోపు డీఎన్‌ఎ రిపోర్టుల్లాంటివి పూర్తికావాలి, 2 వారాల్లోపు విచారణ పూర్తికావాలి, 3 వారాల్లోపు దోషులకు ఉరిశిక్షపడే పరిస్థితిలోకి రావాలి. లేకపోతే ఎవ్వరికీ సంతృప్తి ఉండదు. చాలా వేగంగా కేసుల విచారణ పూర్తి కావాలి. మరణ శిక్ష ఉంటుందనే భయం ఉంటేనే తప్ప వ్యవస్థలో మార్పులు రావు. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో, మహిళలపై నేరాలకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక కోర్టును పెట్టాల్సి ఉంటుంది.

సోషల్‌మీడియాను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పక్షపాత ధోరణితో వేరే వ్యక్తులమీద బుదరజల్లడానికి మనస్సాక్షి అనేది లేకుండా దిగజారిపోయారు. సోషల్‌ మీడియాలో మహిళలను రక్షించే ప్రయత్నంచేయాలి. మహిళల గురించి నెగెటివ్‌గా ఎవరైనా పోస్టింగ్‌ చేస్తే శిక్షపడుతుందనే భయం ఉండాలి. అది ఉంటే తప్ప ఇలాంటివి ఆగిపోవు. ఆదిశగా కూడా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అడుగులు వేస్తున్నాం. 354 (ఇ)ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే ఇప్పటికే జీరో ఎఫ్‌ఐఆర్‌ను ఈ ప్రభుత్వంలో ఇదివరకే తీసుకు వచ్చాం. ఎక్కడైనా సరే కేసును నమోదుచేస్తున్నాం.

అసలు మనిషి ఎప్పుడు రాక్షసుడు అవుతాడు, తన ఇంగితాన్ని ఎప్పుడు కోల్పోతాడని ఆలోచిస్తే.. తాగితే ఈరకంగా తయారవుతాడు. అలాంటిది ఐదారుగురు మనుషులు కూర్చుని తాగితే మృగాలవుతారు. అందుకే పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌ షాపులు రద్దు చేశాం. గ్రామాల్లో 43వేల బెల్టుషాపులను రద్దుచేశామని గర్వంగా చెప్తున్నాం. స్మార్ట్‌ఫోన్ల కారణంగా పోర్నోగ్రఫీ కూడా విపరీతంగా ప్రభావంచూపిస్తున్నాయి. ఎన్ని నిషేధాలు ఉన్నా దీన్ని కట్టడిచేయలేని పరిస్థితి. పోర్న్‌ సైట్లను బ్లాక్‌ చేసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటన్నింటిపైనా ఈ బుధవారం ఈ అసెంబ్లీలో మరో విప్లవాత్మక బిల్లును తీసుకువస్తాం’’ అని తెలిపారు.

ఇందు కోసం ప్రభుత్వం అందరి దగ్గర నుంచి సలహాలు, సూచనలు కోరుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం సలహాలు ఇవ్వడం తప్ప అన్ని విమర్శలు చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్రైమ్‌ రేటు పెరగటంతో పాటు, మహిళలపై అత్యాచారాలు, హత్యకేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని అన్నారు. చంద్రబాబుగారిని సలహా ఇవ్వమని అడిగాం. కానీ సలహా ఇవ్వడం తప్ప ఏ విధంగా విమర్శించాలో అన్ని విమర్శలూ చేశారు. ఉద్దేశాలు ఏమైనా… కూడా వాస్తవాల్లోకి మనం పోవాల్సి ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహిళాంధ్ర ప్రదేశ్‌గా మారాలని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు మహిళల రక్షణకు సంబంధించిన అంశంపై నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ దిశ ఘటన తర్వాత తొలిసారిగా ఏపీలో మహిళా భద్రతపై చర్చ జరుగుతుంటే దేశమంతా ఈ అసెంబ్లీలో ఎలాంటి చట్టాలు చేస్తారు? మనకు ఎలా భద్రత కల్పిస్తారని మహిళలంతా ఎదురు చూస్తున్నారన్నారు. మొన్న ‘దిశ’ను అత్యాచారం చేసి చంపి దహనం చేసిన విధానం చూస్తుంటే మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కన్నీళ్లొస్తాయన్నారు.

రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారనీ, ఆడ పిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొందన్నారు. నిన్న దిశ మొన్న రిషితేశ్వరి, ఆ ముందు నిర్భయ అంతకన్నా ముందుచూస్తే స్వప్నిక, ప్రణీత, రేపు ఈ మృగాళ్లకు బలి కావాల్సింది ఎవరో అన్న భయంతో కంటిపై కునుకు లేకుండా మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళను అడవిలో వదిలేసి వస్తే భద్రంగా బయటకు వచ్చే అవకాశం ఉందేమో గానీ.. పొద్దున్న లేచి బయటకు వెళ్తే మాత్రం ఈ సమాజంలో తిరిగి వస్తుందనే నమ్మకం లేకపోవడం చాలా దురదృష్టకరమని రోజా ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘ఆడ పిల్లల భద్రత పరిస్థితి దిగజారిపోయింది. బాహుబలి-2లో సేనాధిపతి బార్య భుజంపై మరో సేనాధిపతి చేయి వేసి వెకిలిచేష్టలు చేస్తే ఆ హీరో కామాంధుడి తల నరికాడు. నేను థియేటర్‌లో చూశా. ఆ సమయంలో ఆడవాళ్ల కళ్లల్లో ఆనందం పెల్లుబికింది. వారి గుండెల్లో ఎగిసిన అగ్నిపర్వతం చల్లారింది. తప్పుచేసిన వాడికి శిక్ష పడటాన్ని సినిమాలో చూసి తృప్తి చెందే పరిస్థితికి ఆడది దిగజారిపోయిందంటే మనం ఆలోచించుకోవాలి. ఆడ పిల్లకు కష్టం వచ్చేలోపు గన్‌ వచ్చేకంటే ముందే జగన్‌ వచ్చి రక్షిస్తాడనే ఒక నమ్మకం ప్రజలకు కావాలి. ఆడపిల్ల కళ్లల్లో కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఆవిరయ్యేలోపు వారికి శిక్ష వేస్తారన్న నమ్మకాన్ని ఈ అసెంబ్లీ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలు బతికి బట్టకట్టాలంటే సత్వర న్యాయం కావాలి. సత్వర న్యాయం జరగకుండా ఆలస్యమైతే అది అన్యాయంగా మారిపోతుంది. కోర్టులు, చట్టాలు తొందరిగా పనిచేయాలి. తప్పుచేసిన వాడికి శిక్ష పడేంతవరకు బెయిల్‌ కూడా ఇవ్వకూడదని కోరుకుంటున్నా. నిందితులు బెయిల్‌పై బయటకు వస్తే ఉన్నావ్‌ ఘటనలా బాధితులను బతకనివ్వరు. సాక్ష్యాన్ని సజీవంగా దహనం చేస్తారు. న్యాయం జరగడంలేదు గనకే ఎన్‌కౌంటర్‌లకు మద్దతు తెలిపే పరిస్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది’’ అన్నారు.

తేవాలి. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్ల ప్రదేశ్‌గా మారాలి. ఏ రాష్ట్రంలోనైనా ఆడ పిల్లకు భయం వేస్తే ఏపీలో మనకు రక్షణ ఉంటుంది. అక్కడికి వెళ్లి దాక్కోవాలని మన వద్దకు వచ్చే పరిస్థితి జగన్‌ కల్పిస్తారని నమ్ముతున్నా. మానవహక్కుల కమిషన్‌ దిశ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. కానీ, ఆమెను హత్య చేసిన వారిని ఎన్‌కౌంటర్‌ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ పెద్ద ఎత్తున అరుస్తున్నారు. నేరస్థులకు మాత్రమే మానవ హక్కులు ఉంటాయా? ఆడ వాళ్లకు లేవా? పిల్లలకు లేవా?’’ అని రోజా ప్రశ్నించారు.

‘‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చరిత్రలోనే రెండు చోట్ల నుంచి నిలబడి ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సభలో ఉన్నారు. ఆయన ద్వారా పవన్‌కు చెప్పాలనుకుంటున్నా అత్యాచారం చేసిన వారిని ఉరితీయడమేంటి? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అంటున్నారు. గతంలో ఏం జరిగిందని పవన్‌ రివాల్వర్‌ పట్టుకొని రోడ్లపైకి వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. మా అక్కను అవమానిస్తే వారిని చంపాలనిపించిందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పినదాన్నీ మనం విన్నాం’’ అని రోజా అన్నారు. అయితే, ఆమె వ్యాఖ్యలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావన వద్దన్నారు.