ఐదు నెమళ్లు మృతి: అధికారుల అప్రమత్తం…

హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాలను విస్తరించిన ఈ వైరస్ ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్ని కూడా వణికిస్తోంది. కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌లో బర్డ్ ఫ్లూ భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో దీని నుంచి బయట పడడానికి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇటు తెలంగాణలో కూడా ఇప్పుడు ఈ ఫ్లూ కలవరపాటుకు గురి చేస్తోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల పక్షులు, కోళ్లు మృతి చెందుతున్నాయి.

తాజాగా మెదక్‌ జిల్లా పాపన్నపేట శివారు అటవీ ప్రాంతంలో ఐదు నెమళ్లు మత్యువాత పడ్డాయి. కుళ్లిన స్థితిలో ఉన్న వాటి మృతకళేబరాలు పశువుల కాపరి గుర్తించడంతో విషయం వెలుగు చూసింది. దీంతో స్థానికంగా బర్డ్‌ఫ్లూ కలకలం మొదలైంది. కానీ, స్థానిక పశు సంవర్థక అధికారి మాత్రం అజీర్ణంతో చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. వెంకటేశ్వర గుట్ట ప్రాంతంలో చనిపోయి కుళ్లిన స్థితిలో ఉన్న నెమళ్లను గుర్తించిన పశువుల కాపరి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు.

అటు వరంగల్ జిల్లాలో కూడా ఓ రైతుకు చెందిన సుమారు 120 నాటు కోళ్లు మృతి చెందాయి. దీంతో వాటి శాంపిల్స్ సేకరించి అధికారులు పరీక్షలకు పంపారు. మరోవైపు, పౌల్ట్రీ రైతులతోపాటు అందరూ తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కోడి మాంసం, గుడ్లు వాడకంపై వదంతులు వ్యాపించకుండా చూడాలని అన్ని రాష్ట్రాలనూ కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here