పవన్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన బీజేపీ?

1696

అమరావతి, అక్టోబర్ 31 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు ఉపాధి కరువై బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ కేంద్రంగా తలపెట్టిన నిరసనలో పాల్గొనరాదని భారతీయ జనతా పార్టీ ప్రాధమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ సందేశాన్ని పోస్టుచేశారు. వరదల కారణంగా ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇసుక కొరతతో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైంది. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణమని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాజాగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇసుక కొరతను నిరసిస్తూ నవంబర్ 3వ తేదీన విశాఖలో లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పలు పార్టీలను పవన్ కోరారు. ఇటు బీజేపీని కూడా ఆయన అభ్యర్ధించారు.

అయితే పవన్ కల్యాణ్ సభలో పాల్గొనడానికి బీజేపీ అయిష్టత కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొనాల్సిన అవసరం లేదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అందులో ‘‘ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పవన్ సభలో పాల్గోనాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఇసుక సమస్యపై మొదటి నుండి పోరాడుతుంది బీజేపీ. ముఖ్యమంత్రికి లేఖ రాసింది మొదట బీజేపీనే. ఇసుక సమస్యపై గవర్నర్‌ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది బీజేపీ. బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ 4న విజయవాడలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుతన పెద్దఎత్తున మరోసారి ఆందోళన చేపడతాము’’ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.