యాడ్స్‌ ఇవ్వకుంటే మెడికల్‌ ఆఫీసర్లతో..

రైడింగ్‌ చేయిస్తామని బరితెగింపు…

పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు…

జతీయ పత్రికా దినోత్సవం నాడే ‘ప్రెస్’ అన్న పదానికి మచ్చతెచ్చేలా ప్రవర్తించారు ఓ యూట్యూబ్ ఛానల్‌కు చెందిన వ్యక్తులు. ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వస్తున్న యూట్యూబ్‌ చానల్స్‌లో పనిచేస్తున్న కొందరు వ్యవహరిస్తున్న తీరు జర్నలిజానికి మాయని మచ్చగా మిగిలిపోతుందన్న ప్రచారాన్ని నిజం చేస్తూ వీరు ఏకంగా బరితెగించి బ్లాక్ మెయిల్‌కు దిగారు. యాడ్స్ ఇవ్వకుండా మెయికల్ ఆఫీసర్లతో రైడింగ్ చేయిస్తామని బెదిరింపులకూ దిగారు. ఇది జర్నలిజం పట్ల నిబద్ధత కలిగి నిజాలను వెలికి తీస్తూ నిజాయతీగా వ్యవహరించే పాత్రికేయులకు తలవంపులుగా మారింది.

దీపావళి పండుగరోజు శనివారం భవానీపురం బ్యాంక్‌ సెంటర్‌లోని సుధాకర్‌ మెడికల్‌ షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తాము ‘వన్‌ టీవీ’ న్యూస్‌ ప్రతినిధులమని, యాడ్‌ ఇవ్వాలని అడిగారు. తమది చిన్న మెడికల్‌ షాపని, యాడ్‌ ఇచ్చే పరిస్థితిలో లేమని, షాప్‌వారు తెలపడంతో తమకు టార్గెట్‌లు ఉంటాయని, కనీసం రూ.5వేల యాడ్‌ అయినా ఇవ్వాలని వారు అడిగారు. ఇవ్వలేమని, తమకు ఆ అవసరం కూడా లేదని నిర్వాహకులు తేల్చి చెబుతూ ఐడీ కార్డు చూపమని అడిగారు. ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రమే తన ఐడీ కార్డ్‌ బయటపెట్టారు. దానిపై మట్టా రవికుమార్, కంట్రిబ్యూటర్, మైలవరం అని ఉంది. రెండవ వ్యక్తి తన ఐడీకార్డు ఆఫీస్‌లో ఉందని చెప్పారు.

తమకు జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్లు తెలుసునని, వారితో చెప్పి మీపై ఏదో ఒక కేసు బనాయిస్తామని బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగారు. దీనిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తుండగా మరో వ్యక్తి సంస్థకు చెందిన లోగో బయటకు తీసి హడావుడి చేశారు. దీంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరి మెడికల్‌ షాపు నిర్వాహకులకు మద్దతుగా నిలబడటంతో వారు నెమ్మదిగా జారుకున్నారు. దీనిపై భవానీపురం ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇదే యూట్యూబ్‌ ఛానల్‌కు చెందిన పి.సురేష్‌ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులను వెంటేసుకుని గత ఏడాది సెప్టెంబర్‌ 13న విజయవాడ ఊర్మిళానగర్‌లో బడ్డీ కొట్టు నడుపుకుంటున్న ఒక దివ్యాంగురాలిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.1000 వసూలు చేశారు.

దీనిపై ఆమె భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ సిటీ ఎస్‌ఐ పేరుతో నకిలీ ఐడీ కార్డు సృష్టించిన గుత్తుల ప్రశాంత్‌ అనే వ్యక్తి కారులో వస్తుండగా ఈ ఏడాది జూన్‌ 25న భవానీపురం పోలీసులు గొల్లపూడిలో పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తాను వీ వన్‌ చానల్‌ రిపోర్టర్‌నని ఐడీ కార్డ్‌ చూపించాడు. కారు నంబర్‌ ప్లేట్లుకూడా మార్చిన అతన్ని విడిపించేందుకు అప్పట్లో కొందరు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేశారని వినికిడి. ఈ తరహా మాయ ఛానళ్లు కోకొల్లలనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాలలో లెక్కకుమించి వెలసిన ఈ యూట్యూబ్ ఛానళ్లు చివరికి బరితెగించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయనడానికి ఇదొక్కటే ఉదాహరణ కాదు. టార్గెట్ల పేరిట నిర్వాహకులు ఐడీ కార్డులు ఇచ్చినప్పుడే వసూళ్ల మొత్తాన్ని నిర్దేశించడం పరిపాటిగా మారింది. అసలు రెగ్యులర్ అప్‌డేట్ లేని యూట్యూబ్ ఛానళ్లు కూడా లోగోల వ్యాపారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తుండడం గమనార్హం.

యూట్యూబ్‌లోనే రెగ్యులర్ అప్‌డేట్లకు దిక్కులేదంటే ఏకంగా తాము కూడా కేబుల్ టీవీ యాక్టు ప్రకారం ప్రసారాలు చేస్తున్నామంటూ ఎంఎస్ఓల నుంచి ధ్రువీకరణ పత్రాలను తెచ్చుకుని సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులకు అక్రిడిటేషన్ల కోసం కోకొల్లలుగా దరఖాస్తులు అందజేశారు. అసలు రెగ్యులర్ అప్‌డేట్ లేని ఛానళ్లకు ధ్రువీకరణ పత్రం ఇస్తున్న కేబుల్ ఆపరేటర్లను, ఎం.ఎస్.ఒ.లను అనాలి. వాళ్లను నియంత్రించే వ్యవస్థ ఉన్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం వల్లే యూట్యూబ్ ఛానళ్ల పేరిట దందాలు రానురాను పెరుగుతున్నాయన్న విమర్శ ఉంది. రోజుకు గరిష్ఠంగా 300 ఖర్చుపెడితే ఏకంగా రెండు బులిటెన్స్ తయారుచేసి ఇచ్చే కుటీర పరిశ్రమలు హైదరాబాద్ కేంద్రంగా విరాజిల్లుతుండడంతో అనుభవం లేని వారు కూడా ఏకంగా తాము ఛానల్ ప్రారంభించేస్తున్నారు.

అందరికీ ఒకటే కంటెంట్ వాడుతూ తయారుచేస్తున్న ఆయా బులిటెన్ల వల్ల యూట్యూబ్‌లో కాపీరైట్ క్లయిమ్ సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కేవలం నెలకు 4 నుంచి 8 వేలు వెచ్చిస్తే న్యూస్ బులిటెన్లు వస్తున్నాయన్న కక్కుర్తితో చాలా మంది ఈ రొంపిలోకి దిగి యూట్యూబ్‌, గూగుల్‌లో తమ సెర్చింజిన్ ర్యాంకింగ్‌ను దిగజార్చుకుంటున్నారు.

ఎంతో శ్రమించి సంపాదించుకున్న ర్యాంకింగ్ ఒకే ఒక్క కాపీరైట్ స్ట్రైక్‌తో నాశనం అవుతుందన్న వాస్తవాన్ని కాసేపు పక్కనపెడితే ఛానల్ నిర్వహణకు వేలకు వేలు ఖర్చుచేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ కింద పనిచేస్తున్న విలేకరుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారూ ఎక్కువగానే కనిపిస్తున్నారు. తమ దందాను నిరాటంకంగా కొనసాగించేందుకు కొందరు అన్ని రకాల లైసెన్స్‌లు, సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్లు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నాయి. నిజానికి చాలా మంది యూట్యూబ్ ఛానల్, కేబుల్ టీవీ ఛానల్ నిర్వాహకుల దగ్గర ఉన్న ధ్రువీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ కాపీలు ఎప్పుడో కాలగర్బంలో కలిసిపోయినవే.

ఆయా పత్రాలు మనుగడలో ఉన్నాయో లేదో, మనగడలో ఉండేందుకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఈ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారనడంలో సందేహం లేదు. కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంస్థ క్రమం తప్పకుండా ఆడిట్ రిపోర్టులు సమర్పిస్తే తప్ప ఆ రిజిస్ట్రేషన్ మనుగడలో ఉండదన్న విషయం ఎంత మందికి తెలుసు?

‘న్యూ మీడియా’ పేరిట గుర్తింపు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై కొంత మంది అక్రమార్కుల దందాల ప్రభావం ఎలా ఉండనుందో?