అధికారులను బెదిరిస్తున్న బాబు: ఆర్కే

802

గుంటూరు, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు అధికారులను బెదిరిస్తూ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని గుంటూరు జిల్లా మంగళగిని సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని కూడా లెక్కచేయకుండా చంద్రబాబు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆర్కే ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తన పార్టీకి అనుకూలంగా ఉండే అధికారుల చేత పని చేయించుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం అధికారులపై అడ్డగోలుగా దాడులు చేస్తుంటే ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పైగా బాధిత అధికారులను రాజీ పడమని ఉచిత సలహాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏబీ వెంకటేశ్వరావుపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషనకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసిందని, దీనికి స్పందించిన ఈసీ వెంకటేశ్వరరావును తప్పించిందని, అయితే, ఈసీ ఆదేశాలను సైతం చంద్రబాబు లెక్కచేయలేదన్నారు. చంద్రబాబునాయుడు ఈసీ ఆదేశాలను గౌరవించకుండా కోర్టుకు వెళ్లడం సరికాదన్నారు. వైఎస్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అప్పట్లో వైఎస్సార్ గౌరవించారని, కానీ, చంద్రబాబు లాగ చౌకబారు రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు.

అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి తాజా మాజీ మంత్రి నారా లోకేష్‌ నామినేషన్‌ను ఆమోదింపజేసుకున్నా ప్రజాక్షేత్రంలో మాత్రం ఆయనకు పరాభవం తప్పదన్నారు. దీంతో నామినేషన్‌ ఐదు గంటల పాటు పెండింగ్‌లో పెట్టిన అధికారులకు ఉన్నత స్థాయిలో ఒత్తిడి రావడంతో ఆమోదించక తప్పలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తీవ్రస్థాయిలో స్థానిక ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి లోకేష్‌ నామినేషన్‌ ఆమోదింపజేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ఏం మాట్లాడతాడో తెలియని లోకేష్‌ చివరకు నామినేషన్‌ పత్రాలను సమర్పించడంలోనూ తప్పటడుగులు వేసి మరోసారి తన అసమర్థతను చాటుకున్నారని ఎద్దేవాచేశారు. తమ అభ్యంతరాలపై సమాధానం చెప్పలేని లోకేష్‌ న్యాయవాదులు 24 గంటలు సమయం కోరారని, 24 గంటల సమయం గడవకముందే అధికారులు ఎలా ఆమోదించారని ప్రశ్నించారు.

ఆక్రమించుకుని నివాసం ఉంటున్న లోకేష్, చంద్రబాబు అదే ఇంట్లో కూర్చుని కృష్ణా జిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించుకున్నారని విమర్శించారు. వాస్తవానికి ఉండవల్లిలో నివాసం ఉంటున్నప్పుడు గుంటూరు జిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించుకోవాలని స్పష్టంచేశారు. అప్పుడు కూడా ఇక్కడ ఎవరు నోటరీ చేసేవారు లేకపోతే ప్రత్యేకంగా అనుమతులు తీసుకుని కృష్ణా జిల్లా వారితో నోటరీ చేయించుకోవాలనే నిబంధనలను తుంగలో తొక్కి కృష్ణా జిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించారన్నారు. వాస్తవానికి ఎన్నికల అధికారులు నిబంధనలను అమలు చేస్తే నామినేషన్‌ తిరస్కరించాలని, కానీ ఒత్తిడితోనే ఆమోదించారని ఆరోపించారు. ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా ప్రజాక్షేత్రంలో మంగళగిరి ప్రజల నుంచి తిరస్కరణ తప్పదని జోస్యం చెప్పారు.