మానవ మృగాలకు ఉరిశిక్షే కరెక్టు: చంద్రబాబు

95

కర్నూలు, డిసెంబర్ 2 (న్యూస్‌టైమ్): మహిళల పట్ల కిరాతకంగా వ్యవహరిస్తున్న మానవ మృగాలకు ఉరిశిక్షే కరెక్టని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం నిర్వహించిన తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు తెలంగాణలోని షాద్‌నగర్‌లో జరిగిన ‘దిశ’ హత్యోదంతంపై మాట్లాడుతూ దారుణానికి పాల్పడ్డ మానవ మృగాలకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేసారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి ఉంటే వైకాపా ఉండేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తెదేపా కార్యకర్తలపై 690 కేసులు పెట్టారని, ఎన్నో దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తెదేపాను కార్యకర్తలే నడిపిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో ఏం పురోగతి సాధించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కూర్చుంటే కేసు, నిలబడితే కేసు పెడుతున్నారని, ఇన్నేళ్లలో ఒక విచిత్రమైన నాయకుడిని చూస్తున్నామని సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని గట్టిగా పట్టుబట్టామని గుర్తుచేశారు. తెదేపా హయాంలో కర్నూలు జిల్లాలో అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది ఎక్కువగా వరదలు వచ్చినా ఒక్క చెరువైనా నింపారా? అని ప్రశ్నించారు. తన ఇల్లు ముంచేందుకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీరు పెట్టి విడుదల చేశారని ఆయన ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు మాఫియాలా మారారని, సచివాలయ ఉద్యోగాల్లో 90 శాతం వైకాపా కార్యకర్తలకే ఇచ్చారన్నారు. కర్నూలు నుంచి ఇసుకను బెంగళూరు, హైదరాబాద్‌కు తరలిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ వైఖరితో రాష్ట్రంలో పెట్టుబడులన్నీ వెనక్కిపోతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.