చంద్రయాన్-2 పనితీరును కళ్లకు కట్టిన ఇస్రో

152

శ్రీహరికోట(నెల్లూరు), జులై 14 (న్యూస్‌టైమ్): చంద్రయాన్-2 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఓ యానిమేషన్ వీడియోని విడుదల చేసింది. చంద్రయాన్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రయోగం ఎలా మొదలవుతుంది? రాకెట్ నుంచి వేరుపడిన తర్వాత ఉపగ్రహం జాబిల్లి చుట్టూ ఎలా తిరుగుతుంది? ఎలా చంద్రునిపై ల్యాండ్ అవుతుంది? అనే విశేషాలు ఈ వీడియోలో కనిపిస్తాయి.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ ఎంకే-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీని ద్వారా చంద్రగ్రహంపైకి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ల్యాండర్‌కు ‘విక్రమ్’ అని, రోవర్‌కు ‘ప్రగ్యాన్’ అని పేర్లు పెట్టారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్ర నుంచి సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించారు. 2019 సెప్టెంబర్ 6న చంద్రయాన్-2 రోవర్ చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 13 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భారత్‌కు చెందిన 6, యూరోప్‌కు చెందిన 3, అమెరికాకు చెందిన 2 పేలోడ్స్ ఉన్నాయి. చంద్రయాన్-2 మొత్తం బరువు 3.8 టన్నులు. ఇస్రో 2009లో చంద్రయాన్-1ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.