ఖ‌రీఫ్ ఇన్‌ఫుట్ స‌బ్సిడీ చెల్లింపునకు నిర్ణయం

అమరావతి, అక్టోబర్ 21 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలోని రైతుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శుభ‌వార్త చెప్పారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో మొట్ట‌మొద‌టి సారిగా రైతుల‌కు ఖ‌రీఫ్‌కు సంబంధించిన ఇన్‌ఫుట్ స‌బ్సిడీ ఇదే సీజ‌న్‌లో ఇచ్చేందుకు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఖ‌రీఫ్‌లోని జూన్‌, జులై, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెల‌ల‌కు సంబంధించిన ఇన్‌ఫుట్ స‌బ్పిడీకి అవ‌స‌ర‌మైన నిధుల‌ను విడుద‌ల చేస్తున్నామ‌ని, రైతుల‌కు ఇన్‌ఫుట్ స‌బ్సిడీ అందించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

ఈ నెల 21న ప్రారంభిస్తున్న వైయ‌స్ఆర్ బీమాపై చ‌ర్చించారు. స్కూళ్లు, ఆసుప‌త్రులు, అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో చేప‌డుతున్న ప‌నుల వివ‌రాల‌పై సీఎం ఆరా తీశారు. స‌చివాల‌యాలు, ఆర్‌బీకే సెంట‌ర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాల ప్ర‌గ‌తిపై స‌మీక్షించారు. ఉచిత విద్యుత్‌- రైతు అకౌంట్లో న‌గ‌దు జ‌మ అంశాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు. 7 ప్రధాన అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాలు, కోవిడ్, ఎన్‌ఆర్‌ఈజిఎస్, నాడునేడు, విలేజీ, వార్డు సెక్రటేరియట్ల తనిఖీలు తదితర అంశాలపై చర్చకు వచ్చాయి.

‘‘వర్షాలకు సంబంధించి కలెక్టర్లుతో ప్రత్యేకంగా ఈ నెల 14న సమీక్ష నిర్వహించాం. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో వారికి వెంటనే సాయం చేయమని ఆదేశాలు జారీచేశాం. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లందరూ 31 అక్టోబరులోగా పంట నష్టానికి సంబంధించి అంచనాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. వెంటనే రోడ్ల మరమ్మత్తులు మొదలుపెట్టమన్నాం. ముఖ్యంగా ఆర్‌ అండ్‌ బి, పంచాయితీరాజ్‌ రోడ్లపై ధ్యాస పెట్టమన్నాం.’’ అని సీఎం తెలిపారు.

కరెంటు పునరుద్ధరణ కలెక్టర్లు వేగంగా చేశారని చెప్పిన జగన్ కలెక్టర్లందరికీ అభినందనలు తెలిపారు. ‘‘కలెక్టర్లకు, జేసీలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. ఈనెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.