ఎల్జీ బాధితులతో సీఎం వీసీ

0
13 వీక్షకులు
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాధిత గ్రామాల ప్రజలకు పరిహారం విడుదల చేస్తున్న సీఎం జగన్
  • గ్రామాల ప్రజలకు పరిహారం విడుదల

అమరావతి, మే 18 (న్యూస్‌టైమ్): విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ (వైజాగ్ గ్యాస్‌ లీక్‌) ఘటనలో ప్రభావితమైన గ్రామాల బాధితులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో విశాఖ కలెక్టరేట్ నుంచి ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల (ఎంపిక చేసిన) ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ బాధిత గ్రామాల ప్రజలకు పరిహారాన్ని విడుదల చేశారు.

‘‘ఎల్జీ పాలిమర్స్‌ ఘటన బాధాకరం. వేగంగా స్పందించిన అధికారులను అభినందిస్తున్నా. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ యూనిట్ నుంచి సుమారు 13 వేల స్టైరీన్‌ను వెనక్కి పంపించాం’’ అని సీఎం వీసీలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించామని చెప్పిన సీఎం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీకేజీ చాలా బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

విశాఖ కలెక్టరేట్ నుంచి వీసీలో గ్యాస్ లీక్ బాధితులతో కలిసి పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్ వినయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన

విశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌కు తమ ప్రభుత్వ హయాంలో ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని, 13 వేల టన్నుల స్టైరీన్‌ను రెండు షిప్పుల ద్వారా వెనక్కి పంపినట్లు తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్ రాజ్, పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, జీవీఎంసీ కమీషనర్ సృజన, జేసీ వేణుగోపాలరెడ్డి, అరుణ్ బాబు, విశాఖ పశ్చిమ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మళ్ల విజయప్రసాద్, బాధితులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘‘ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయారు. ఆ ప్రమాదంలో ప్రమాదంలో సంస్థ రూ. 20 లక్షలు, కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం 2 లక్షలు అందించాయి. ఘటన జరిగినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటామని కంపెనీలకు హెచ్చరిక ఉండేలా ప్రభుత్వాలు స్పందించాలి. ఓఎన్జీసీ ఘటనలో బాధితులకు రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలని కోరాను. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోనూ నాకు అదే గుర్తొచ్చింది. అందుకే ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వం వేగంగా స్పందించింది. కలెక్టర్, కమిషనర్‌తో పాటు 110 అంబులెన్స్‌లు కూడా ఘటనా స్థలికి చేరుకున్నాయి. 2 గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. అధికారులు స్పందించిన తీరును అభినందనీయం’’ అని ప్రశంసించారు.

‘‘మనం అధికారంలోకి వచ్చాక ఎల్జీ పాలిమర్స్‌కు ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. ఆ సంస్థకు అనుమతి గాని, విస్తరణ గాని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. అయినా ఎక్కడా మనం రాజకీయ ఆరోపణలు చేయలేదు. మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలని మాత్రమే ప్రయత్నించాం. 10 రోజుల్లోపే పరిహారంతో పాటు వైద్య సేవలను పూర్తిగా అందించాం. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రజల ఆందోళన చెందకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. ప్రభావిత గ్రామాల్లోని ప్రతి వ్యక్తికి రూ.10 వేలు ఆర్థికసాయం. వెంటిలేటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షలు ఆర్థికసాయం రెండ్రోజులకు పైగా ఆస్పత్రుల్లో ఉన్నవారికి రూ.లక్ష, ప్రాథమిక చికిత్స చేయించుకున్నవారికి రూ.25 వేలు ఆర్థికసాయం అందించాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై అధ్యయనానికి వేసిన కమిటీలు ఇచ్చే నివేదికల ద్వారా తప్పు ఎవరివల్ల జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కంపెనీకి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక శానిటేషన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. బాధితులకు ప్రత్యేక వైద్యసదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాబోయే నెలరోజుల పాటు గ్రామాల్లోనే వైద్యులను, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అంతేగాక తాత్కాలికంగా విలేజ్ క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో వైద్య సేవలందిస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here