58 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు…

న్యూఢిల్లీ, నవంబర్ 2 (న్యూస్‌టైమ్): ఢిల్లీలో ఓ వైపు ప్రాణాంతక మహమ్మారి కరోనావైరస్ వణికిస్తుండగా ఇంకో వైపు కాలుష్యం భయపెడుతోంది. వీటికి ఇప్పుడు చలి కూడా తోడైంది. నెమ్మదిగా విజృంభిస్తున్న చలితో దేశ రాజధానివాసులు వణికిపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించాయి. గత 58 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో దేశ రాజధానిలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో గత గురువారం (అక్టోబరు 26వ తేదీ) 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత 26 ఏళ్లలో ఢిల్లీలో అక్టోబరు నెలలో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రత ఇది.

ఢిల్లీలో 1994 సంవత్సరంలో అక్టోబరు 31వ తేదీన 12.3 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, 1962, అక్టోబరు నెలలో 16.9 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, 58 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబరు నెలలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అలాగే, ఢిల్లీలో 1937 ఏడాది అక్టోబర్‌ 31 వ తేదీన ఆల్-టైమ్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని నగరంలో 1937వ సంవత్సరంలో అక్టోబరు 31వ తేదీన 9.4 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో నిన్న ఆదివారం (నవంబరు 1) ఉదయం అసాధారణ రీతిలో 11.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ సీజన్‌లో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రత ఇది. ఇదో సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. ఓ వైపు కరోనా, మరో వైపు కాలుష్యంతో సతమతం అవుతున్న ఢిల్లీ వాసులకు ఇప్పుడు చలి వణుకుపుట్టిస్తోంది. ఇక, ఉష్ణోగ్రతలు పడిపోతే కరోనా కేసులు పెరిగే అవకాశం కూడా ఉందన్న హెచ్చరికలు రాజధాని వాసులను భయపెడుతున్నాయి.