న్యూఢిల్లీ, అక్టోబర్ 13 (న్యూస్‌టైమ్): ఫింగర్ ప్రింట్ బ్యూరో-2020 అఖిల భారత డైరెక్టర్ల 21వ సమావేశాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి డిజిటల్ విధానంలో ప్రారంభించారు. అలాగే ఈ సందర్భంగా నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ఏర్పాటు చేసిన ఈ-సైబర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. జి. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నేరాలు, ఉగ్రవాదం పట్ల ఏ మాత్రం సహనం చూపే ప్రసక్తే లేదని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో నేర రహిత భారత్‌ను సృష్టించడమే లక్ష్యం అని ఆయన అన్నారు. నేరం అనేది మానవత్వానికి, శాంతికి వ్యతిరేకం కాబట్టి కులం, వర్గం, మతం లేదా ప్రాంతం దృష్టికోణం నుండి నేరాన్ని చూడడాన్ని ప్రభుత్వం నమ్మదని ఆయన తెలిపారు. మహిళలు, అణగారిన వ్యక్తులపై నేరాలను ప్రభుత్వం ఎప్పటికీ సహించదని కిషన్ రెడ్డి అన్నారు.

బాధితులందరికీ వేగవంతమైన మరియు నిర్ణయాత్మక న్యాయం అందేలా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల పరిథిలోని అంశమే అయినప్పటికీ, నేరాలను పర్యవేక్షించడంలో మరియు గుర్తించడం, పోలీసు బలగాల ఆధునీకరణ, సామర్థ్యాన్ని పెంపొందించడం, పోలీసింగ్‌ను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య పాత్ర ఉందని కిషన్ రెడ్డి అన్నారు. పోలీసు బలగాల ఆధునీకరణ ప్రాముఖ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కిచెప్పారని ఆయన అన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం దేశం అంతటా పోలీసు విభాగాల ఆధునీకరణకు రూ.780 కోట్లు విడుదల చేసిందని ఆయన వెల్లడించారు.

వేలిముద్రల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించిన కిషన్ రెడ్డి, వేలిముద్ర దాని ప్రత్యేకత, శాశ్వతత, వ్యక్తిత్వం, సముపార్జనలో సౌలభ్యం కారణంగా ఒక ముఖ్యమైన సాధనం అయిందని అన్నారు. నేరాలు, నేరస్థులను డాక్యుమెంట్ చేయడంలో, ట్రాక్ చేయడంలో, రికార్డులు-వేలిముద్రల డేటా డిజిటలైజేషన్ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అన్నారు. పూర్తిగా కంప్యూటరీకరించిన నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం (నాఫిస్) త్వరలో క్రియాత్మకంగా మారి పోలీసు బలగాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎన్‌సిఆర్‌బి అత్యంతాధునికమైన ఫోరెన్సిక్ టూల్సుతో ఏర్పాటు చేసిన ఈసైబర్ ల్యాబ్‌ను ప్రారంభించిన కిషన్ రెడ్డి, అక్టోబర్ నెలను జాతీయ సైబర్ సెక్యూరిటీ అవగాహన మాసంగా పాటిస్తున్నారని, సైబర్ నేరాల దర్యాప్తులో ఈసైబర్ ల్యాబ్ వర్చువల్ అనుభవాన్ని అందిస్తుందని అన్నారు. ఎన్‌సిఆర్‌బి భాగస్వామ్యంతో నాఫిస్ పెను మార్పులకు కీలక పాత్ర పోషిస్తుందని ఎన్‌సిఆర్‌బి డైరెక్టర్ రాంఫాల్ పవార్ తెలిపారు. రియల్ టైమ్ ప్రాతిపదికన, వేలిముద్రల ఆధారంగా నేరస్థులను గుర్తించడంలో దర్యాప్తు అధికారులకు నాఫిస్ సహాయం అందిస్తుంది.

వీడియో కాన్ఫరెన్సింగ్‌లో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని ఎన్‌సిఆర్‌బికి చెందిన మూడు శిక్షణా కేంద్రాల అధికారులతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు.