జనతా కర్ఫ్యూను జయప్రదం చేయండి

0
5 వీక్షకులు

చిత్తూరు, మార్చి 21 (న్యూస్‌టైమ్): కరోనా మహమ్మారి బారి నుండి దేశాన్ని కాపాడుకునేందుకు ఈ నెల 22న ఆదివారం స్వచ్ఛందంగా మనమందరూ ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేద్దామని చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో హోటల్ అసోసియేషన్, పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్, వెజిటబుల్ వెండర్స్ అసోసియేషన్, మాల్స్ అసోసియేషన్, ఫిష్, మటన్ అసోసియేషన్లు, మెడికల్ ఏజెన్సీస్ అసోసియేషన్, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జనతా కర్ఫ్యూకు సంబంధించి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనదేశం కోసం మనందరి ఆరోగ్యం కోసం ఈ నెల 22న మనమందరూ స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడుకుందామని తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని, ఇందుకు ప్రజలతో పాటు వివిధ అసోసియేషన్ల వారు కూడా సహకరించాలని తెలిపారు. గ్రామ/పట్టణ స్థాయిలో ఈ అంశంపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకు రావాలని జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, మెప్మా సిబ్బందికు సూచించారు. స్వచ్ఛందంగా అన్ని హోటల్‌లు, మాల్స్, పెట్రోల్ బంక్‌లు, మటన్, చికెన్ షాప్‌లు మూసివేసేందుకు హోటల్ అసోసియేషన్, పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్, వెజిటబుల్ వెండర్స్ అసోసియేషన్, మాల్స్ అసోసియేషన్, ఫిష్, మటన్ అసోసియేషన్లు సహకరించాలని తెలిపారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు స్పందిస్తూ అన్ని అసోసియేషన్లు జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు సంఘీభావాన్ని కలెక్టర్‌కు తెలిపారు. అత్యవసర సేవల్లో భాగంగా మెడికల్ షాపులను కొంత మంది సిబ్బందితో నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 22 ఆదివారం తరువాత కూడా అన్ని హోటల్‌లు, మాల్స్, కూరగాయలు, మాంసం షాపుల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా రాకుండా సామాజిక దూరం పాటించే విధంగా సంబంధిత నిర్వాహకులు సామాజిక బాధ్యతతో కృషి చేయాలన్నారు. హోటల్‌ల వద్ద మెరుగ్గా పారిశుధ్యాన్ని నిర్వహించాలని తెలిపారు.

గత 45 రోజుల నుండి జిల్లాకు దాదాపు 700 మంది వరకు విదేశీయుల నుండి వచ్చిన వారు కలరని, విదేశాల నుండి వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డ్‌లలో ఉంచి పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని, విదేశాల నుండి వచ్చి హోమ్ ఐసోలేషన్‌లో లేని వారి సమాచారాన్ని జిల్లా సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9849902379కు తెలపవలెనని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీ 2 చంద్రమౌళి, డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పెంచలయ్య, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేశు, వివిధ అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here