చికిత్స అందించి కాపాడిన ‘బసవతారకం’

హైదరాబాద్, అక్టోబర్ 21 (న్యూస్‌టైమ్): అసలే కరోనా విపత్తు, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయం. తీరా వెళ్లాక అక్కడ వైద్యులు చూస్తారో లేదో అన్న సందేహం. అలాంటిది ఒక మహిళ ఏకంగా రొమ్ము క్యాన్సర్‌నే జయించింది. ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఈ క్యాన్సర్‌తో కరోనా వ్యాధి తోడవడంతో ఆ మహిళ పడ్డ కష్టాలు పదాల్లో చెప్పలేనివి. సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారధ్యంలోని ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్’ అండగా నిలిచి ఉండకపోతే ఆమె బతకడమే కష్టమై ఉండేది. ఇక వివరాల్లోకి వెళ్తే… ఒకవైపు తీవ్రమైన క్యాన్సర్ మరోవైపు కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన రోగికి ప్రాణం నిలబెట్టారు ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్’ వైద్యులు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 31 సంవత్సరాల చైతన్య అనే మహిళకు జూలై మాసంలో క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు స్థానికంగా ఉన్న వైద్యులు గుర్తించారు. అటు పిమ్మట స్థానిక వైద్యుల సూచనల మేరకు పేషెంటు సెప్టెంబర్ 9న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకొని వైద్యులను సంప్రదించారు. హాస్పిటల్‌లో రొమ్ము క్యాన్సర్ వైద్య నిపుణులైన డాక్టర్ సికె నాయుడు చైతన్యను పరీక్షించి, రొమ్ములో భారీ గడ్డను (ట్యూమర్‌ను) గుర్తించి ఆమెకు వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుందని సూచించారు.

అయితే, దురదృష్టవశాత్తు చైతన్యకు నిర్వహించిన కోవిడ్ పరీక్షలో పాజిటివ్ రావడం ఆమె పాలిట శాపంగా మారింది. అయితే అధైర్యపడని డాక్టర్ సికె నాయుడు బృందం చైతన్యను ఐసోలేషన్ వార్డులో ఉంచి మూడు వారాల పాటూ కోవిడ్‌కు అటు క్యాన్సర్‌కు చికిత్స అందించడం ప్రారంభించింది. అయితే, ఈ సమయంలో క్యాన్సర్ వ్యాధి ముదిరి కొంత తీవ్రమైంది. మూడు వారాల ఐసోలేషన్‌లో కోవిడ్ నెగిటివ్ వచ్చిన వెంటనే చైతన్యకు అవసరమైన తదుపరి పరీక్షలు నిర్వహించి సికె నాయుడు బృందం శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె రొమ్ములో ఉన్న భారీ ట్యూమర్ (కణితిని) తొలగించి విజయవంతంగా పూర్తి చేశారు. కోలుకున్న చైతన్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి స్వంత ఊరుకు వెళ్లి పూర్తి స్వాంతనే చూకూరిన తర్వాత రెండు వారాల పిమ్మట వైద్యులను కలసి తదుపరి పరీక్షలు నిర్వహించుకొన్నారు.

చికిత్స విజయవంతంగా పూర్తయిన నేపధ్యంలో నేడు హాస్పిటల్ వైద్యుల బృందం, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో చైతన్య విజయగాధను మీడియాకు వివరించారు. ముందుగా శస్త్ర చికిత్స, ఇతర వైద్య బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ సి.కె. నాయుడు చికిత్స వివరాలను తెలిపారు. రోగికి చికిత్స అందించే సమయంలో హాస్పిటల్ అనస్థీషియా వైద్య బృందం విభాగాధిపతి డాక్టర్ బసంత్ కుమార్ నేతృత్వంలో అనస్థీషియా వైద్యులు అందించిన సేవలు ఎంతో కీలకంగా నిలిచాయని వెల్లడించారు. ముఖ్యంగా శస్త్ర చికిత్స తర్వాత పేషెంట్ కోమా స్థితికి చేరిపోయిన తర్వాత బసంత్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం చేసిన కృషితో పేషెంటు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నారని ఆయన వివరించారు.

ఇలా శస్త్ర చికిత్స తదనంతరం సేవలను అందించిన సీకే నాయుడు నేతృత్వంలోని రొమ్ము క్యాన్సర్ వైద్య బృందంతో పాటూ రోగిని కాపాడడంలో బసంత్ కుమార్ నేతృత్వంలో అనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైద్యులు చేసిన కృషి చెప్పుకోదగినదని, వారి కృషి ఫలితంగానే చైతన్య పూర్తిగా కోలుకోగలిగిందని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆర్‌వి ప్రభాకరరావు మీడియాకు వెల్లడించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ చైతన్యకు కోవిడ్ మహమ్మారి లాంటి వ్యతిరేఖ పరిస్థితులలో కూడా ధైర్యంగా శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యుల బృందాన్ని అభినందించారు. పేదరికంగా మగ్గుతున్న కుటుంబానికి చెందిన చైతన్యకు వచ్చిన కష్టం చాలా పెద్దదని, విషయం హాస్పిటల్ దృష్టికి రాగానే కేసును చాలెంజ్‌గా తీసుకొని వైద్యం ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించి ముందుకు వెళ్లినట్లు వెల్లడించారు.

15 లక్షలకు పైగా ఖరీదు చేసే ఈ వైద్యాన్ని పేషెంటుకు పూర్తిగా ఉచితంగా ఏ రకమైన ఖర్చు లేకుండా చేశామని తెలుపుతూ అందరి కృషితో చైతన్య పూర్తి ఆరోగ్యవంతురాలుగా తిరిగిరావడం సంతోషాన్నిస్తుందని తెలిపారు. చైతన్య లాంటి ఎందరో పేదలకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం, వైద్య బృందం కోవిడ్ లాంటి ప్రతి కూల పరిస్థితులలో కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పూర్తి సహాయం అందజేస్తూ అవసరమైన చికిత్స అందజేయడం జరుగుతోందని తెలిపారు. ఇలా ఎందరో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ దేని కోసమైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు కలలు కన్నారో ఆ ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ విజయగాధను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ పేదలకు అవసరమైన సహాయం అందించడంలో సంస్థ ముందుంటుదని హామీ ఇచ్చారు.