ఆర్కే బీచ్‌లో కంటైనర్ రెస్టారెంట్

200
విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాటుచేసిన కంటైనర్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో నిర్వాహకులు

విశాఖపట్నం, నవంబర్ 25 (న్యూస్‌టైమ్): విశాఖ సాగర్ తీరం రామకృష్ణా (ఆర్‌కే) బీచ‌్‌లో పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటుచేసిన కంటైనర్ రెస్టారెంట్ ‘విండీస్’ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

సహజసిద్ధ సాగరతీర అందాలకు నెలైన ఆర్కే బీచ్‌‌లో ఇప్పటి వరకూ సంప్రదాయకరమైన ఫుడ్ స్టాల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటికి భిన్నంగా సందర్శకులను మరింత ఆకట్టుకునేలా రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కొత్త తరహా రెస్టారెంట్లను ప్రోత్సహిస్తూ ఇటీవల చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ‘విండీస్’ పేరిట తొలి ఫ్యామిలీ రెస్టారెంట్‌ ఇక్కడ ఏర్పాటైంది. ధరలు సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి ఉన్నప్పటికీ కేవలం ధనార్జనే ధ్యేయంగా నిర్వాహకులు ఈ రెస్టారెంట్‌ ఏర్పాటుచేశారన్న విషయం అర్ధమవుతోంది.

పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఏ మాత్రం అందుబాటులో లేని వస్తువులను మాత్రమే ఈ రెస్టారెంట్‌లో విక్రయిస్తున్నారు. ప్రారంభోత్సవం నాడు మంత్రి పర్యవేక్షణలో కూడా ఈ విషయం కొట్టొచ్చినట్లు కనిపించింది. అయితే, ఆయన బయటకు చెప్పలేనప్పటికీ సామాన్యులకు కూడా అందుబాటు ధరలకు ఆహార పదార్ధాలు విక్రయాలు చేపట్టాలని ఓ ఉచిత సలహా మాత్రం ఇచ్చినట్లు సమాచారం. అయితే, కేవలం ఆదాయమే ఆశయంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించిన నిర్వాహకులు మంత్రి మాటను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది ప్రశ్నార్ధకమే.