తిరుమల మూసివేత కొనసాగింపు?

0
22 వీక్షకులు
దర్శనాల నిలిపివేతతో నిర్మానుష్యంగా మారిన తిరుమలేశుని సన్నిధి

తిరుపతి, ఏప్రిల్ 28 (న్యూస్‌టైమ్): కరోనా వ్యాప్తి, జాతీయ లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసిన టీటీడీ భవిష్యత్ ప్రణాళికపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. మార్చి 20వ తేదీ మధ్యాహ్నం నుంచే భక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసిన అధికారులు తర్వాత ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను అనుసరిస్తూ వచ్చారు. మొదటి రాష్ట్ర ప్రభుత్వం తీపుకున్న నిర్ణయం మేరకు మార్చి నెలాఖరు వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ అమలుచేయడంతో దానికి అనుగుణంగా ఏప్రిల్ 14 వరకు, ఆ తర్వాత ఇప్పుడు మే 3 వరకూ ఆలయంలో యథాస్థితి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ మధ్యలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల, తిరుపతి దేవస్థానం పాలక మండలితో జరిపిన చర్చల్లో భాగంగా జూన్ 30వ తేదీ వరకు ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేయాలని నిర్ణయించిందంటూ సామాజిక మీడియాలో ఉదయం నుంచి ప్రచారం ఎక్కువైంది.

దీంతో ఏమనుకున్నారో ఏమో గానీ, టీటీడీ అధికారులు ఒక్కసారిగా స్పందించి ‘సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం’ అంటూ ఓ ప్రకటన జారీచేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మ కర్తల మండలితో చర్చించి తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 30 వతేదీ దాకా భక్తులకు దర్శనం నిలిపి వేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించే విషయంపై ధర్మకర్తల మండలి తగు నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్యం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది’’ అంటూ టీటీడీ ప్రజాసంబంధాల అధికారి పేరిట అదే సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదలయింది. అయితే, ఈ ప్రకటన అధికారికమైనదో కాదో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది (టీటీడీ అధికారిక వార్తల వెబ్‌సైట్‌ (http://news.tirumala.org)లో ఆ విషయం ఎక్కడా కనిపించలేదు).

అలిపిరి టోల్‌ గేట్ వద్ద కర్ఫ్యూ వాతావరణం

ఇకపోతే, రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల వస్తుంటారు. నేటికి 40 రోజులుగా మూసివేసి ఉండటంతో ఇప్పుడు దర్శనాలకు అనుమతి ఇస్తే లక్షల మంది తిరుమల వచ్చే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా సామాజిక/భౌతిక దూరం నిర్వహించటం అసాధ్యం. క్యూలు, అన్న ప్రసాదాల దగ్గర ఇబ్బందులు తలెత్తుతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జూన్ 30వ తేదీ వరకు తిరుమల కొండపైకి భక్తులకు అనుమతి ఇవ్వకూడదని ప్రాథమికంగా నిర్థారించారు.

తిరుమల ఆలయాన్ని మార్చి 20 సాయంత్రం నుంచి మూసివేశారు. దీంతో భారీగా మిగిలిన స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఉగాది కానుకగా మార్చి 25వ తేదీన దేవస్థాన ఉద్యోగులకు ఉచితంగా పంపిణీ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతాకాదు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు. దీనికి అదనంగా ఎన్నయినా కొనుక్కునే అవకాశం ఉంది. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం నిత్యం లక్షల్లో లడ్డూలను తయారు చేసి నిల్వ ఉంచుతుంది. ఆలయం మూసివేతకు ముందే దాదాపు రెండు లక్షల లడ్డూలను దేవస్థానం సిద్ధం చేసి ఉంచింది.

1892లో రెండు రోజుల పాటు కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే కాదు ఏకంగా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు టీటీడీ రికార్డుల్లో నమోదయి ఉంది. కాగా, తాజాగా దాదాపు 50 రోజులుగా భక్తుల దర్శనాలు రద్దయ్యాయి. అయితే, వందేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని, రాబోయే కాలంలో ఆ లోటును ఏలా పూడ్చుకోవాలనే విషయమై ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో టీటీడీ వ్యయాలు తగ్గించే విషయమై అధికారులు, ఉద్యోగస్తులు, పాలకమండలి సభ్యులు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే చైర్మన్‌గా తాను, పాలకమండలి సభ్యులు వేతనాలు తీసుకోలేదని గుర్తు చేశారు. అయితే, స్వామి వారి కైంకర్యాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి.

ఇదిలావుండగా, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సుదీర్ఘ చ‌రిత్ర ఉంది. బ్రిటీష్ పాల‌న‌లో ఉండ‌గానే 1933లోనే టీటీడీ పాల‌క‌మండ‌లి ఏర్పాట‌య్యింది. అప్ప‌టి నుంచి వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 1944 నాటికి తొలి ఘాట్ రోడ్డు సిద్ధమయ్యింది. సుదీర్ఘ‌కాలం పాటు రాక‌పోక‌ల‌కు అదే రోడ్డు వినియోగించేవారు. ప్ర‌స్తుతం కొండ నుంచి దిగువ‌కు రావ‌డానికి ఆ రోడ్డు ఉప‌యోగ‌ప‌డుతోంది. ఇక కొండ‌పైకి వెళ్లేందుకు రెండో ఘాట్ రోడ్డు ప‌నులు 1978లో ప్రారంభించారు. 1980 చివ‌రి నాటికి పూర్తిగా అందుబాటులోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి నిత్యం వేలాది మంది భ‌క్తులు ద‌ర్శ‌నాల కోసం త‌గ్గ‌ట్టుగా వివిధ ఏర్పాట్లు విస్తృత‌మ‌వుతూ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రపంచంలోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన దేవ‌స్థానాల జాబితాలో అగ్ర‌స్థానంలో టీటీడీ ఉంటుంది. బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో రోజుకి ల‌క్ష మందికి పైగా యాత్రికుల‌కు ద‌ర్శ‌నాలు క‌ల్పించిన చ‌రిత్ర ఉంది. సాధార‌ణ సీజ‌న్‌లో కూడా క‌నీసంగా నిత్యం 60వేల‌కు త‌గ్గ‌కుండా యాత్రికులు వ‌స్తూ ఉంటారు.

కానీ, క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా ఆలయం మూసివేతకు ముందు భ‌క్తుల సంఖ్య అనూహ్యంగా త‌గ్గిపోయింది. గ‌త ఏడాదితో పోలిస్తే 30 శాతం త‌గ్గుద‌ల న‌మోద‌య్యింది. మార్చి 16న 55,827 మంది ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. 17న ఆ సంఖ్య 49,229కి త‌గ్గింది. 18వ తేదీన 48,041 మంది ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. గ‌త ఏడాది ఇదే కాలంలో ద‌ర్శ‌నాలు చేసుకున్న వారి సంఖ్య 65 నుంచి 70 వేల మ‌ధ్యలో ఉంది.

గ‌త ఏడాది మార్చిలో దాదాపు 18 ల‌క్ష‌ల మంది యాత్రికులు తిరుమ‌ల ఆల‌యంలో ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. అయితే ఈసారి వారి సంఖ్య సుమారు 14 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చ‌ని టీటీడీ అధికారులు అంచ‌నాలు వేశారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తిని నివారించే చ‌ర్య‌ల్లో భాగంగా ఆల‌యానికి ద‌ర్శ‌నాల కోసం వ‌చ్చే వారిపై ఆంక్ష‌లు విధించ‌డంతో తిరుమ‌ల పూర్తిగా బోసిపోయింది. మరోవైపు, శ‌తాబ్దాల కాలం నుంచి నిత్యం భ‌క్తుల రాక‌పోక‌లు సాగుతున్నాయి. అయితే గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో తొలిసారిగా వ్యాధులు, వైర‌స్‌లో వ్యాప్తి కార‌ణంగా యాత్రికుల‌ను తిరుమ‌ల‌కు రావ‌ద్ద‌ని చెప్ప‌డం ఇదే తొలిసారి.

గ్ర‌హ‌ణాల సంద‌ర్భంగా కొన్ని గంట‌ల పాటు ఆల‌యాలు మూసివేయ‌డం చాలా సాధార‌ణం. రెండేళ్ల క్రితం సంప్రోక్ష‌ణ పేరుతో బాలాల‌యం కోసం 9 రోజుల పాటు ద‌ర్శ‌నాలు నిలిపివేశారు. బంద్, ఇత‌ర ఆందోళ‌న‌ల కార‌ణంగా కొన్ని రోజుల పాటు భ‌క్తుల రాక‌పోక‌ల‌కు ఆటంకాలు ఏర్ప‌డిన అనుభ‌వాలున్నాయి. స‌మైక్యాంధ్ర ఉద్య‌మం స‌మ‌యంలో కొంత‌కాలం అలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ తొలిసారిగా టీటీడీ అధికారులే భ‌క్తులు రావ‌ద్ద‌ని చెప్ప‌డం విశేష‌మే.

గ‌తంలో ఎన్న‌డూ ఇలా జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు కూడా ఎన్ని రోజుల పాటు ఆల‌యంలో ద‌ర్శ‌నాలు నిలిపివేస్తున్నార‌న్న‌ది స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. దర్శనాల నిలిపివేతతో కేవలం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే తిరుమ‌ల, తిరుప‌తి ప‌రిధిలో రూ. 200 కోట్ల ఆదాయానికి నష్టం వస్తుందని అంచ‌నాలు వేశారు. ఆ విధంగా లెక్కేస్తే టీటీడీ ఎంత ఆదాయాన్ని కోల్పోయిందో ఊహిస్తేనే ఆశ్చర్యమేస్తోంది. తిరుమ‌ల, తిరుప‌తి దేవ‌స్థానాలకు వివిధ రూపాల్లో ఆదాయం ల‌భిస్తుంది. అందులో హుండీ ద్వారా వ‌చ్చే దానితో పాటుగా ద‌ర్శ‌నాల టికెట్లు, ల‌డ్డూ ప్ర‌సాదం, వ‌స‌తి గదులు, క‌ల్యాణ క‌ట్ట స‌హా ప‌లు మార్గాల్లో ఆదాయం వ‌స్తుంది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుమ‌ల పూర్తిగా ఖాళీ కావ‌డంతో ఆదాయ మార్గాలన్నీ నిలిచిపోయాయి.

ప్ర‌స్తుతం తిరుమ‌ల‌కు కేవ‌లం ఉద్యోగులు, తిరుమ‌ల‌లో ఉండే స్థానికుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. రెండు ఘాట్ రోడ్డులు మూసివేశారు. మెట్లు మార్గంలో కూడా ప్ర‌వేశాలు నిలిచిపోయాయి. టీటీడీ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేవ‌లం హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం ల‌భించింది. అంటే నెల‌కు వంద కోట్ల‌కు పైగా ఆదాయం లెక్కన స‌గ‌టున రోజుకి రూ. 3 కోట్ల‌కు త‌గ్గ‌కుండా ఆదాయం వస్తుంది. ఏటా ఫిబ్ర‌వ‌రి, మార్చిలలో భక్తుల సంఖ్య కొంత తగ్గుతుంది. ఏప్రిల్ నుంచి జులై వ‌ర‌కు ఆ సంఖ్య క్ర‌మంగా పెరుగుతుంది.

బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో అత్య‌ధికంగా న‌మోద‌వుతుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆదాయం కూడా ఉంటుంది. దాంతో ఈ సీజన్‌లో క‌నీసంగా హుండీ ద్వారానే రోజుకి స‌గ‌టును రెండున్న‌ర కోట్ల రూపాయాల ఆదాయం రావాల్సి ఉంది. ఈ ఆదాయం మొత్తం కోల్పోతున్నట్లేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం యాత్రికులు రాక‌పోవ‌డంతో టీటీడీకి ఇత‌ర ఆదాయ మార్గాలూ నిలిచిపోయాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది ల‌డ్డూ ప్ర‌సాదం విక్రయం. 2018-19లో ల‌డ్డూ ప్ర‌సాదం విక్రయాలతో రూ. 270 కోట్ల రాబడి వచ్చింది. స‌గ‌టున రోజుకి రూ.80 ల‌క్ష‌లు దీనిపై ఆదాయం వచ్చింది.

శీఘ్ర ద‌ర్శ‌నం, ఇత‌ర ద‌ర్శ‌న టికెట్ల ద్వారా గ‌త ఏడాది రూ.235 కోట్ల ఆదాయం ల‌భించింది. క‌ల్యాణ క‌ట్ట‌లో స‌మ‌ర్పించే త‌ల‌నీలాలు ద్వారా రూ. 100 కోట్లు, క‌ల్యాణ మండ‌పాల అద్దె రూపంలో రూ.105 కోట్లు, ఇత‌ర వ్యాపార‌, వాణిజ్య స‌ముదాయాల అద్దెలతో పాటుగా టోల్ ఫీజు అన్నీ క‌లిపి మ‌రో రూ. 204.85 కోట్ల ఆదాయం వ‌చ్చింది. ఇప్పుడీ ఆదాయ మార్గాలన్నీ నిలిచిపోయాయి. అధికారుల అంచ‌నా ప్ర‌కారం రూ. 50 కోట్లు నేరుగా కోల్పోతోంది టీటీడీ. మార్చి 20వ తేదీన (శుక్ర‌వారం) పాక్షికంగా ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తివ్వ‌డంతో హుండీ ద్వారా రూ. 1.9 కోట్ల ఆదాయం వ‌చ్చింది. అదే స‌మ‌యంలో పోటులో త‌యారైన 4 ల‌క్ష‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో 2.5 ల‌క్ష‌లు మిగిలిపోయాయి.

తిరుమ‌ల‌లో వివిధ వ్యాపారాలు చేసేవారు సుమారుగా 3,000 మంది ఉంటారు. వ్యాపారులు, వాటిపై ఆధార‌ప‌డిన వారందరి ఉపాధిపై ఇప్పుడు ప్రభావం పడింది. ఆట‌బొమ్మ‌లు విక్ర‌యించేవారి దగ్గర నుంచి హోటళ్లు నడిపే వారి వరకూ అందరికీ నష్టమే. హోట‌ళ్ల నిర్వాహ‌కుల‌కు అపార‌న‌ష్టం త‌ప్ప‌ద‌ని కూడా చెబుతున్నారు. తిరుమ‌ల కొండ‌పై టీస్టాళ్లు, ఇత‌ర చిన్న చిన్న దుకాణాలు కాకుండా హోట‌ళ్లు, రెస్టారెంట్లు నిర్వ‌హించే వారు 100 మంది వ‌ర‌కు ఉన్నారు. ఇప్పుడు అవ‌న్నీ మూత‌ప‌డాల్సి వ‌చ్చింది. దాంతో పూర్తిగా ఆదాయం కోల్పోతున్నామ‌ని చెబుతున్నారు.

అద్దెలు, సిబ్బంది వేత‌నాలు త‌ప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ వ్యాపారాలు లేక భారీ నష్టం తప్పేలా లేదని ఓ వ్యాపారి తెలిపారు. హోట‌ల్స్ య‌జ‌మానుల‌కే ఈ లాక్‌డౌన్ కాలంలో దాదాపు 800 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయ నష్టం వస్తుందని అంచనా వేశారు. కాగా, తిరుమ‌ల‌లో ఆదాయం ప‌డిపోతున్న‌ప్ప‌టికీ యాత్రికుల ఆరోగ్య ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని దర్శ‌నాలు నిలిపివేయాల్సి ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌య్యింద‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

అయితే, దేశంలో కరోనావైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఆలయాలన్నీ తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే. ఒకే చోట పదుల సంఖ్యలో జనం గుమిగూడవద్దన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా దేవస్థాన పాలక వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసివేసి మర్చి 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తుల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

అదే విధంగా, ముంబయిలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయాన్ని కూడా మార్చి 17వ తేదీ సాయంత్రం నుంచే మూసివేశారు. మహారాష్ట్రలో వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here