రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీతో సీఎం జగన్

అమరావతి, అక్టోబర్ 23 (న్యూస్‌టైమ్): ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో 212వ స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్ల కమిటీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా బ్యాంకర్లతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి వివరించారు.

వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలలో బ్యాంకర్స్‌ సహకారంపై చర్చించారు. కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘‘వ్యవసాయ రంగానికి, మహిళల స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది. అన్ని పథకాలకు బ్యాంకర్లు అండగా నిలవాలి. ‘జగనన్న తోడు’ కింద చిరు వ్యాపారులకు రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలి. కోవిడ్‌ సమయంలో నిధుల కొరత లేకుండా సహకరించినందుకు అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బ్యాంకర్లు మద్దతు ఇవ్వడంతో పాటు సహాయ, సహకారాలు అందించాలి. ప్రధానంగా స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలతో పాటు వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాలకు బ్యాంకర్లు సహాయం చేయాలి’’ అని కోరారు.

రాష్ట్రంలో దాదాపు 62 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడినందున, ఆ రంగం ప్రాధాన్యతను గుర్తించి పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రధానంగా ‘వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌’ పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం కోసం ఏటా రూ.13,500 ఇస్తున్నామన్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలో (జూన్‌లో) రూ.7500, రబీ ప్రారంభంలో (అక్టోబర్‌) రూ.4 వేలు, ఆ తర్వాత పంట చేతికొచ్చే సంక్రాంతి పండుగ సమయంలో రూ.2 వేలు ఇస్తున్నామని వివరించారు. దీని వల్ల 1.25 ఎకరాలు (అర హెక్టారు), అంత కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ మొత్తం పెట్టుబడిగా దాదాపు సరిపోతుందన్నారు. ‘‘ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. మొత్తం 10,641 ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నాం. పరీక్షించిన, నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్డర్‌ చేసిన 48 గంటల్లోనే రైతులకు అందజేస్తున్నాం. రైతులు ఆర్డర్‌ పెట్టేందుకు వీలుగా ఆర్బీకేలలో కియోస్కులు ఏర్పాటు చేశాం. ఈ–క్రాపింగ్‌ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం. గ్రామాల్లో వ్యవసాయ సహాయకుడు, రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్లు అందరూ కలిసి ఈ–క్రాపింగ్‌ చేస్తున్నారు. అందువల్ల బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ రైతు ఈ–క్రాపింగ్‌ సరి్టఫికెట్‌ కలిగి ఉన్నాడా? లేదా అన్నది చూడాలి.’’ అని అన్నారు.

‘‘2020–21 ఖరీఫ్‌లో రూ.75,237 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.62,650 కోట్లు పంపిణీ చేశారు. కోవిడ్‌ సంక్షోభంలోనూ చెప్పుకోదగిన స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. గత ఏడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,200 కోట్లతో పంటలు కొన్నాము. ఈసారి దాదాపు రూ.3,500 కోట్లతో ఆ నిధి ఏర్పాటు చేశాం. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి రోజూ ఆయా పంటల ధరలు, వాటి డిమాండ్‌ను ఈ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో అప్‌డేట్‌ చేస్తారు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరం. ప్రతి గ్రామంలో గోదాములు, జనతా బజార్లు, మండల కేంద్రాల్లో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ ఏర్పడుతుంది. వీటన్నింటికీ మీ సహకారం కావాలి. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. 51కి పైగా మందులతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అందుబాటులో ఉంటారు. ఆరోగ్యశ్రీకి ఈ క్లినిక్‌లు రిఫరల్‌గా ఉంటాయి. వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతోంది. ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలతో వారికి స్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్నాం. ఇందుకు అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, రిలయెన్సు, అల్లానా గ్రూప్‌లతో ఒప్పందాలు చేసుకున్నాం.’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘వైఎస్సార్‌ ఆసరా ద్వారా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం. ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.1,100 కోట్లు అందజేశాం. ఈ కార్యక్రమాలు, పథకాలన్నీ మరింత సమర్థవంతంగా అమలు కావాలంటే బ్యాంకర్లు సహాయ, సహకారాలు అందించాలి.’’ అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు పూర్తి అండగా నిలుస్తామని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రుణాలు అందించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపబోమని బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 212వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞఫ్తికి బ్యాంకర్లు సానుకూలంగా స్పందించారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా చిరు వ్యాపారులు, హస్తకళల కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ దిశగా సహాయం చేయడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి.’’ అని ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు జి.రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు.

‘‘ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలకు పూర్తి అండగా నిలుస్తాము. వైఎస్సార్‌ కడప జిల్లాలో నూటికి నూరు శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. లక్ష్యానికి అనుగుణంగా దాన్ని పూర్తి చేస్తాం.’’ అని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

‘‘కోవిడ్‌ సంక్షోభంలో కూడా సీఎం ఏ ఒక్క పథకాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆర్బీకేల వద్ద బ్యాంక్‌ సేవలు కూడా అందాలి. అదే విధంగా కౌలు రైతుల సమస్యలు కూడా బ్యాంకులు పట్టించుకోవాలి.’’ అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నాబాబు పేర్కొన్నారు.

‘‘కోవిడ్‌ సంక్షోభంలోనూ ఎంఎస్‌ఎంఈలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను సీఎం విడుదల చేశారు. ఆ నిధుల వల్ల ఎంఎస్‌ఎంఈ రంగం నిలదొక్కుకోగలిగింది.’’ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు.

‘‘బ్యాంకుల భాగస్వామ్యం వల్లే అన్ని పథకాలు సఫలీకృతం అవుతున్నాయి. బ్యాంకులు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. కోవిడ్‌ సమస్య ఉన్నప్పటికీ ఆరోగ్య, విద్యా రంగాలలో ఎక్కడా వెనుకబాటు లేదు. అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. పంటల ఈ–క్రాపింగ్‌ కూడా జరుగుతోంది. స్కిల్డ్‌ మ్యాన్‌ పవర్‌ లోటు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.’’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు.