లాక్‌డౌన్‌కు సహకరించాలి: మంత్రి రాథోడ్

0
5 వీక్షకులు

మహబూబాబాద్, ఏప్రిల్ 16 (న్యూస్‌టైమ్): ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని, ఈ సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతలు కూడా తోడవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఈరోజు మహబూబాబాద్‌లోని వలస కూలీలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు ఆమె పంపిణీ చేశారు. కిట్టీ పార్టీ చేసుకునే మహిళలు, వారి పార్టీ చేసుకునే వ్యయాన్ని వలస కూలీల కోసం నేడు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు సామాజిక బాధ్యతలో ముందుకు రావాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రేషన్ కార్డున్న నిరుపేదలకు 12 కిలోల రేషన్, 1500 రూపాయలు ఇస్తుంటే రేషన్ కార్డు లేని నిరుపేదలకు 12 కిలోల రేషన్, 500 రూపాయలను ఇస్తోందని చెప్పారు. దీనికి తోడు అనేక మంది దాతలు కూడా నేడు ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. నేడు మెప్మావాళ్లు కూడా మాస్క్‌లు పంపిణీ చేసి ప్రజల భద్రతకు సహకరించడం అభినందనీయమన్నారు. లాక్‌డౌన్ మే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో అందరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తూ ఇళ్లలోనే ఉంటూ సహకరించాలని కోరారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు వీలైనంత సాయం చేయాలని మహబూబాబాద్ మహిళా నాయకులు సిరి కిట్టి పార్టీ చేసుకోవడానికి బదులు రేషన్ కార్డు లేని వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినందుకు మంత్రి అభినందించారు. ఇలాగే ఇంకా దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here