ఏపీ మీడియాలో కరోనా కలకలం

0
14 వీక్షకులు
విజయవాడలో ఐఎంఎ బృందం జర్నలిస్టుల కోసం నిర్వహించిన కరోనా పరీక్షల శిబిరంలోని ఓ దృశ్యం
  • కొవిడ్ బాధిత పాత్రికేయులకు తెలంగాణ సాయం

అమరావతి, మే 2 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ లక్షణాలు రాష్ట్రానికి చెందిన జర్నలిస్టుల్లో వెలుగులోకి వచ్చాయన్న వార్త అటు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇటు మీడియా వర్గాలలో కలకలం రేపుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలోనే ఇప్పటి వరకూ జర్నలిస్టుల్లో కరోనా పాజిటివ్ కేసులు గుర్తించగా తాజాగా ఢిల్లీలో పనిచేస్తున్న ఒక తెలుగు జర్నలిస్టుతో పాటు రాష్ట్రానికి చెందిన ఐదుగురు జర్నలిస్టులకు కరోనా లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు జర్నలిస్టులు క్వారంటైన్‌లో ఉన్నారు.

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన నివేదిక

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య పెరగడంతో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 62 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాకు వారు వీరు అనే తేడా లేదు. ఎవరిని కూడా వదలడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో కరోనా వైరస్ మనుషులకు సోకుతూనే ఉన్నది. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మీడియాలో కరోనా కలకలం రేగింది. విజయవాడలో ఇటీవలే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జర్నలిస్టులకు ప్రత్యేకించి కరోనా (యాంటీ బాడీ) పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఐదుగురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రాధమిక ఫలితంలో వచ్చినట్టుగా తేలింది. ప్రముఖ చానల్స్ రిపోర్టర్, కెమెరామెన్, ఫోటోగ్రాఫర్, ప్రముఖ వెబ్ ఛానల్ రిపోర్టర్ ప్రింట్ మీడియా రిపోర్ట్‌కు కరోనా సోకినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

విజయవాడ నగరంలో ఐఎంఏ, ఏపీయూడబ్ల్యుజె సంయుక్తంగా ఇటీవల జర్నలిస్టులకు ఉచిత కరోనా స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించాయి. ఈ క్యాంపునకు విజయవాడలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు. సుశిక్షితులైన వైద్య సిబ్బంది వీరినుంచి నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్‌కు పంపించడం జరిగింది. టెస్ట్ నివేదికల్లో ఐదుగురికి కరోనా లక్షణాలు కానవచ్చాయని ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్ చెబుతున్నారు. అయితే కరోనా లక్షణాలు కనిపించిన వారికి మరొక పూర్తిస్థాయి పరీక్ష నిర్వహిస్తే కానీ పాజిటివ్ కేసులుగా నిర్ధారించలేమని స్పష్టం చేశారు. అనుమానితుల్లో ప్రముఖ టీవీ ఛానళ్ళ ప్రతినిధులు వున్నారని డాక్టర్ కార్తీక్ వెల్లడించారు. ఇప్పటికే వారికి సమాచారం అందించడం జరుగుతోందన్నారు.

ఒకవేళ వారిలో కరోనా పాజిటివ్‌లుగా తేలితే వారిని ప్రత్యేక చికిత్సకు తరలించడం జరుగుతుందన్నారు. మీడియా మిత్రులెవరూ ఈ విషయంపై భయపడాల్సిన అవసరం లేదని, విజయవాడలో కోవిడ్ రోగులకోసం అద్భుతమైన చికిత్స లభిస్తోందని డాక్టర్ తుమ్మల కార్తీక్ తెలిపారు.

మరోవైపు, తెలంగాణ జర్నలిస్టులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ శనివారం ఒక ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తూనే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు సమాజహితం కోసం పనిచేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలన్నారు. ప్రాణం కన్నా విలువైంది ఏది లేదన్నారు. జర్నలిస్టులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు శానిటైజర్లు ఉపయేగించాలని సూచించారు.

సమాజం కన్నా ముందు మనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నారని, ఈ విషయాన్ని జర్నలిస్టులు గమనించాలని ఆయన సూచించారు. శనివారం ఢిల్లీలో కరోనా భారిన పడిన జర్నలిస్టుల కుటుంబానికి అండగా ఉంటామని, ఈ మేరకు వారితో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు, ఖర్చుల నిమిత్తం వారి బ్యాంకు ఖాతాలకు వెంటనే 20 వేల రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు. గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలలోని క్వారంటైన్‌లో ఉన్న జర్నలిస్టులకు కూడా 10 వేల రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా బారిన పడిన ఢిల్లీ జర్నలిస్ట్ చికిత్సకు 10 టీవీ యాజమాన్యం ఒక లక్ష రూపాయలను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here