షిన్‌జియాంగ్‌, ఆగస్టు 13 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకేరోజు 100పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వీటిలో కేవలం షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోనే 89 కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు నెలల కాలంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌ 13న ఒకేరోజు 108కేసులు నమోదయ్యాయి. అనంతరం రోజువారి కేసుల సంఖ్య 100 దాటలేదు. గత ఏడునెలల క్రితం మొదలైన వైరస్‌ విజృంభణ చైనాలో చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది.

దీంతో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. కేసులు బయటపడుతున్నచోట కఠిన ఆంక్షలు అమలుచేయడంతో పాటు భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఒక్క బీజింగ్‌లోనే దాదాపు 10 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఇక డాలియన్‌, ఝావోలైన్‌ నగరాల్లోనూ దాదాపు 30 లక్షల కొవిడ్‌ పరీక్షలు చేపట్టినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు చైనాలో 84,060 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కోటి 67లక్షల మందికి వైరస్‌ సోకగా వీరిలో 6లక్షల 60వేల మంది మృత్యువాతపడ్డారు.

మరోవైపు, చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్‌ దెబ్బకు అమెరికా వణుకుతూనే ఉంది. ఈ సమయంలోనే కొన్ని అనుమానాస్పద విత్తనాలు దేశంలోకి వస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం గుర్తించింది. అవి చైనా నుంచి వస్తున్నట్లుగా భావిస్తోన్న అక్కడి వ్యవసాయ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా ఇలాంటి అనుమానాస్పద విత్తనాలు నాటవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కరోనా వైరస్‌కు కారణమైన చైనాపై అగ్రరాజ్యం అమెరికా గుర్రుగా ఉంది. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో దేశంలోకి కొన్ని అనుమానాస్పద విత్తనాలు వస్తున్నట్లు గుర్తించిన అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆర్డరు చేయకున్నా విత్తన పాకెట్లు పార్శిల్‌ రూపంలో ఇంటికి వస్తున్నాయంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. కేవలం ఒక్క ప్రాంతంలోనే కాదు, దాదాపు 12 రాష్ట్రాల్లో ఇలాంటి మిస్టరీ విత్తన ప్యాకెట్లు వస్తున్నాయనే ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

వాటిపై ఉన్న ముద్రణ సమాచారం బట్టి అవి చైనా నుంచే వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఈ అనుమానాస్పద విత్తన ప్యాకెట్లపై వాటి తయారీకి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. ఇక ఫ్లోరిడాలో ఇప్పటివరకు 630 అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు వచ్చినట్లు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ నిక్కీ ఫ్రైడ్‌ వెల్లడించారు. ఇలాంటి కేసులు ఎక్కవ కావడంతో అప్రమత్తమైన అమెరికా, ఈ అనుమానాస్పద విత్తన ప్యాకెట్లపై హెచ్చరికలు జారీచేసింది.

ఇలా వచ్చిన పార్శిల్‌లను తెరవవద్దని సూచించింది. అంతేకాకుండా ఆ విత్తనాలను ఎవ్వరూ నాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను హెచ్చరించింది. ఈ మిస్టరీ విత్తనాల సరఫరా వెలుగుచూడడంతో కస్టమ్స్‌ అధికారులు అవి ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇంకోవైపు, భారతదేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగవంతమైంది. నిత్యం దాదాపు 50వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 52,123 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. 24గంటల్లో 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కొవిడ్‌ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా దాదాపు 700మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడుతున్నారు.

నిన్న మరో 775 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనాసోకి మరణించిన వారిసంఖ్య 34,968 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇంత వరకు 10లక్షల మంది కోలుకున్నారు. మరో 5లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.51శాతం ఉండగా, మరణాల రేటు 2.23శాతంగా ఉంది. దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య కలవరపెడుతోంది.

నిత్యం దాదాపు 700 కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానానికి చేరువైంది. 35,100 మరణాలతో ఇటలీ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌ 34,968 మరణాలతో ప్రస్తుతం ఆరోస్థానంలో ఉంది. కొవిడ్‌ మరణాల్లో అమెరికా, బ్రెజిల్‌, యూకే, మెక్సికో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here