హైదరాబాద్, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా రోజువారీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచాలకుని కార్యాలయం ఆదివారం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం 1078 కొత్త కేసులను గుర్తించారు. అదే విధంగా కోలుకున్న కేసుల (క్యుములేటివ్) సంఖ్య 331కి చేరింది. రాష్ట్రంలో 6 మృతిచెందారు. కేసు మరణాల రేటు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చిచూసినప్పుడు తక్కువగానే ఉన్నప్పటికీ సెకండ్ వేవ్ కూడా ఆందోళనకరంగానే ఉందన్న భావన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 6,900గా అధికారులు వెల్లడించారు.

హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి సంఖ్య 3,116గా ఉంది. కోవిడ్ నిర్ధరణ పరీక్షల విషయానికి వస్తే, గత 24 గంటల్లో 59,705 నమూనాలను పరీక్షించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గీటురాయి ప్రకారం ప్రతి పది లక్షల జనాభాకి ప్రతిరోజు 140 పరీక్షలు చేయాల్సి ఉంటే దాని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజూ 5600 పరీక్షలు మాత్రమే చేయాల్సి ఉంది. కానీ, ఇక్కడ చేసిన పరీక్షల సంఖ్య 10 లక్షల జనాభాకు 2,77,537. రిపోర్టుల కోసం నిరీక్షిస్తున్న నమూనాల సంఖ్య 2129. ఇక, జిల్లాల వారీగా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 283 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, కరోనా కేసులపై తాజా సమాచారంపైన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తుల్ని చేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ రోగుల చికిత్స కోసం నిర్దేశించిన అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. కొద్ది పాటి కోవిడ్ లక్షణాలు లేదా తీవ్రమైన లక్షణాలు కలిగి కోవిడ్ నిర్ధారణ జరిగిన వారు లేదా నిర్ధారణ కాని వారి చికిత్స కోసం ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సరిపడ పడకలు అందుబాటులో ఉంచింది. ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైనన్ని పడకలు అందుబాటులో ఉంచి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోంది.

ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపడా పి.పి.ఇ కిట్లు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కోవిడ్ వ్యాధి గురించి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రిని సంప్రదించి తగు చికిత్స పొందడం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా జాగ్రత్త వహించవచ్చనీ సూచించింది. 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తగు సలహాలు, టెలి మెడిసిన్, వివిధ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చని పేర్కొంది.

ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబోరేటరీల వల్ల కలిగిన వివిధ సమస్యల పరిష్కారం కోసం 9154170960 వాట్సప్ నెంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. త్వరగా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్న వయస్సువారు (10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు) తప్పని సరైతే గాని బయట తిరగకూడదని, వారు ఇంట్లోనే ఉండటం శ్రేయస్కరమనీ సూచించింది. అధికంగా వ్యాధికి గురవుతున్న వారు (20-50 మధ్య వయస్కులు) కోవిడ్ వ్యాధి బారినపడకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడాన్ని అధికారులు ప్రత్యేకించి గుర్తుచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కేటగిరికి చెందిన వారు వీలైనంత వరకు ఇంటి దగ్గరే ఉండటం శ్రేయస్కరమని, వృత్తిరీత్యా, అత్యవసర పని మీద లేదా వివిధ అవసరాల నిమిత్తం తప్పనిసరి బయటకి వెళ్ళవలసి వస్తే ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలని హితవుపలికారు. ఇంటి నుండి బయటకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ ధరించాలని, కోవిడ్-19 నుండి కాపాడుకోవడానికి ఫేస్ మాస్క్ అనేది మొదటి రక్షణ కవచమని తెలిపారు. ఫేస్ మాస్క్ ధరించకపోవడం నేరమని, దీనికి జరిమానా కూడా విధించవచ్చనీ హెచ్చరించారు. తప్పనిసరై బయటకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వ్యక్తుల మధ్య దూరం ఖచ్చితంగా 6 అడుగులు ఉండే విధంగా జాగ్రత్త వహించాలని, వివిధ అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సురక్షితమైన భౌతిక దూరం పాటించాలని సూచించారు.

పని ప్రదేశాలలో సబ్బుతో చేతులు కడుక్కోవడానికి కావల్సిన వసతులు, శానిటైజర్ సౌకర్యం, ఉద్యోగుల మధ్య భౌతిక దూరం ఉండాలని, అలాగే, పౌరులు, ప్రజలు అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని, ప్రయాణాలు అత్యవసరమైనప్పుడు తరచుగా చేతులు కడుక్కోవడం, శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం చేయాలనీ తెలిపారు. కొన్ని సంధర్భాలలో ఫ్లూ, ఇప్లూయెంజా లాంటి లక్షణాలు దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించమని సలహా ఇచ్చారు. అలాగే, ఇతర అనారోగ్య సమస్యలైన రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు, తీవ్ర మూత్రపిండ వ్యాధులు, తీవ్ర శ్వాస సమస్యలు, క్యాన్సర్ లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైన ఆరోగ్య చికిత్సలకు తప్ప ఇతర ప్రయాణాలకు దూరంగా ఉండటం వలన కోవిడ్-19 నుండి రక్షించుకోవచ్చనీ సూచించారు.