ఏపీలో 266కు చేరిన కరోనా కేసులు

117
విజయవాడ జీజీహెచ్‌లో కరోనా అనుమానితునికి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యురాలు

అమరావతి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. వారం కిందటి వరకూ అసలు కొవిడ్-19 కేసులే తెలియని జిల్లాలకు కూడా ఈ మహమ్మారి నేడు విస్తరించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నోడల్ ఆఫీసర్ సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన మీడియా బులెటిన్ (నెం. 105) ప్రకారం కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 266కు చేరుకుంది. రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి సోమవారం ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 14 కేసులను అధికారులు గుర్తించారు.

విశాఖపట్నంలో 5, అనంతపూర్‌లో 3, కర్నూల్‌లో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరిలో 1 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ 14 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 266కు చేరుకుందని, మరోవైపు, కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదుగురు పేషెంట్స్ రికవరీ అయి డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. కాగా, తాజాగా అప్‌డేట్ ప్రకారం జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో 6, చిత్తూరులో 17, తూర్పు గోదావరిలో 11, గుంటూరులో 32, కడపలో 23, కృష్ణలో 28, కర్నూలులో 56, నెల్లూరులో 34, ప్రకాశంలో 23, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరిలో 16 పాజిటివ్ కేసులు నమోదుకాగా, తూర్పు గోదావరి, కృష్ణ, నెల్లూరు, ప్రకాశంలో, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.

అనంతపూర్ జిల్లాకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి మక్కా నుంచి తిరిగి వచ్చాక కరోనా లక్షణాలతో ఏప్రిల్ 1 తెల్లవారుజామున ఒంటి గంటకు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో చికిత్స నిమిత్తం చేరాడు. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఏప్రిల్ 4న ఉదయం 7.30 గంటలకు ప్రాణాలు కోల్పోయాడు. అదే విధంగా, కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నానికి చెందిన 55 ఏళ్ల రోగి ఏప్రిల్ 2వ తేదీ అర్థరాత్రి సమయంలో అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల తరువాత అతనిలో కోవిడ్ వైరస్ లక్షణాలని గుర్తించి 4వ తేదీన విజయవాడ జీజీహెచ్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం పంపించారు. అక్కడ కోవిడ్ పరీక్షకి శాంపిల్ తీసుకొని పంపిన వైద్యులు, తమ తదుపరి పరీక్షల్లో ఆయనకు ఇంతకముందే ఉబ్బసం, బ్రోన్కైటిస్ వైద్య సమస్యలు ఉన్నాయని గుర్తించారు. బాధితుడు ఈ ఏడాది ఫ్రిబ్రవరి 27న వ్యాపార పర్యటనలో భాగంగా ఒరిస్సాలోని బెరంపూర్ వెళ్లి 29న రైలులో తిరిగి వచ్చాడు. మళ్ళీ మార్చి 19న విజయవాడలోని వన్‌టౌన్‌కు వెళ్లారు. కోవిడ్ పరీక్షలో పాజిటివ్ నిర్ధారించిన ఈయన ఏప్రిల్ 4వ తేదీన రాత్రి 8 గంటలకు మరణించాడు.