సెంచరీ దాటిన కరోనా మరణాలు

0
7 వీక్షకులు
తమిళనాడులో కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం
  • భారత్‌లో 4067కు చేరిన కేసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): అటు ప్రపంచాన్ని, ఇటు దేశాన్నీ కరోనా మహమ్మారి భయాందోళనకు గురిచేస్తోంది. లాక్‌డౌన్ రూపంలో దేశం మొత్తాన్ని నిర్బంధించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికీ కొవిడ్-19 వ్యాప్తిని మాత్రం ఆశించినంతగా అరికట్టలేకపోయారు. దేశంలో కరోనావైరస్ మహమ్మారికి బలైన వారి సంఖ్య సెంచరీకి (109కి) చేరింది. కరోనావైరస్‌ను నియంత్రించేందుకు సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించడానికి సిద్ధమైన తరుణంలోనూ మహమ్మారి అంటువ్యాధి మరింత విస్తరిస్తోంది. సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4067కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక బులిటెన్‌లో వెల్లడించింది.

వీరిలో 109 మంది మరణించగా 3666 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 292 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారని తెలిపింది. గత వారం రోజులుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉంది. దేశంలోనే అత్యధికంగా 45 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 690కి చేరింది. గుజరాత్‌లో కొవిడ్‌-19 మృతుల సంఖ్య 11కు చేరింది. మధ్యప్రదేశ్‌లో వైరస్‌ తీవ్రత పెరిగింది. మరణాల సంఖ్య తొమ్మిదికి చేరగా 165పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతోంది. కరోనా కారణంగా ఇక్కడ మొత్తం ఏడుగురు మృతిచెందారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 503కు చేరింది. పంజాబ్‌లో 68కేసులు నమోదుకాగా ఆరుగురు మరణించారు. తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు మరణించగా 571 మందికి కరోనా సోకింది. కర్ణాటకలో కొవిడ్‌-19 కారణంగా నలుగురు, పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు మృతి చెందారు. కేరళలో కొవిడ్‌ కేసుల సంఖ్య 314కు చేరగా ఇద్దరు మరణించారు. జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్లో 227 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు.

చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో కరోనా చికిత్సలను పరిశీలిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి

ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 62 కరోనా కేసులు నిర్ధారణ కాగా మొత్తం 323 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 258కి చేరింది. వీరిలో ముగ్గురు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో తబ్లిఘి జమాత్ సంఘటనకు సంబంధించి 1000 పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. కొవిడ్-19 రోగులలో 83% 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంతలో, క్లస్టర్ జోన్లు, భారీ సమావేశాలు, తరలింపు కేంద్రాలలో వేగంగా యాంటీబాడీ ఆధారిత రక్త పరీక్షలను ప్రారంభించాలని ఐసీఎంఆర్ కేంద్రానికి సూచించింది.

కాగా, ప్రపంచవ్యాప్తంగా, 11,36,851 మందికి పైగా కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. 62,955 మందికి పైగా ఇప్పటికే మృత్యువాతపడ్డారని నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 2,73,808 కేసులను కలిగి ఉంది. యుఎస్‌లో 7,000 మందికి పైగా మరణించారు. స్పెయిన్లో తాజాగా 809 మంది మరణించారు. మొత్తం 11,744 మంది మరణించారు. ఇదిలావుండగా, కరోనా వైరస్‌ ఇప్పటి వరకు 208 దేశాలకు విస్తరించింది. ప్రపంచ దేశాల్లో 12,73,990 కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,60,247 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక మృతుల సంఖ్య 70 వేలకు చేరువవ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కొవిడ్-19 వైరస్ తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో ఆదివారం కొత్తగా 39 కేసులు నమోదయ్యాయి. వీటిలో 38 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. మరోవైపు, రాజధాని బీజింగ్‌లో వైరస్‌ కట్టడి చర్యలు సుదీర్ఘకాలం కొనసాగుతాయని వెల్లడించారు. కొత్తగా ఒకరు చనిపోవడంతో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 3,331కి చేరింది. ఇక బాధితుల సంఖ్య 81,708కి పెరిగింది. ఫ్రాన్స్‌లో ఆదివారం మరణాల సంఖ్య తగ్గడం ఆ దేశవాసులకు ఊరట కలిగించింది. 24 గంటల వ్యవధిలో 357 మరణాలు సంభవించాయి. వారం రోజుల్లో ఇదే తక్కువ కావడం గమనార్హం. ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి 8,078 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో 2,189 మంది వృద్ధాశ్రమాలు, ఇతర వైద్య కేంద్రాల్లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 28,891 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రోజు కొత్తగా 748 మంది వైరస్‌ బారినపడ్డట్లు గుర్తించారు. నిన్న ఒక్కరోజే 140 మంది ఐసీయూలో చేరడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

స్పెయిన్‌లో వరుసగా మూడో రోజు మరణాల సంఖ్య తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం మరో 674 మంది మృతిచెందడంతో మరణాల సంఖ్య 12,418కి చేరింది. ఇక వైరస్‌ బారినపడ్డవారి సంఖ్య 4.8 శాతం పెరిగింది. దీంతో బాధితుల సంఖ్య 1,30,759కి పెరిగింది. ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వారిలో 11 శాతం మంది కోలుకున్నారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీలోనూ ఆదివారం మరణాల సంఖ్య తగ్గింది. నిన్న 525 మంది మృత్యువాతపడ్డారు. మార్చి 19 తర్వాత నమోదైన మరణాల్లో ఇదే అత్యల్పం. దేశంలో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పడిపోతుందని ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌లో మగ్గిపోతున్న జనాలకు ఊరట కల్పించే దిశగా యోచిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆంక్షల నుంచి కాస్త సడలింపునిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

దేశంలో ఇప్పటి వరకు 15,887 మంది మరణించగా 1,28,948 మంది వైరస్‌ బారినపడ్డారు. సింగపూర్‌లో ఆదివారం ఒక్కసారిగా వైరస్‌ తీవ్రత పెరిగిపోయింది. నిన్న ఒక్కరోజే 120 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దేశంలో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఆ దేశంలో ఇప్పటి వరకు 1309 కేసుల్ని గుర్తించారు. వీరిలో ఆరుగురు మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here