ప్రాణాలు కోల్పోయిన రాజమండ్రి ఆంధ్రభమి సీనియర్ సబ్ ఎడిటర్ చిరంజీవి  రామచంద్రరాజు, నాగలక్ష్మి దంపతులు

‘మరణాలు కలచివేస్తున్నాయి’

కుటుంబాలను ఆదుకోవాలి: ఎన్.ఎ.ఆర్.ఎ. వినతి

హైదరాబాద్, అమరావతి, ఆగస్టు 15 (న్యూస్‌టైమ్): కరోనావైరస్ మహమ్మారి జర్నలిస్టుల పాలిట శాపంగా మారింది. ఏరోజు ఎవరి మరణవార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళనతో వర్కింగ్ జర్నలిస్టులు జీవితాలను వెల్లదీయాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల పదుల సంఖ్యలో పాత్రికేయులు మృత్యువాతపడుతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకువస్తున్న జర్నలిస్టులు ఖరీదైన కరోనా వైద్యాన్ని పూర్తిస్థాయిలో పొందలేక అవస్థలుపడుతున్నారు.

రోజుకు కనీసం నలుగురు జర్నలిస్టులు కరోనా లక్షణాలతో ఆసుపత్రుల చుట్టూ తిరగడమో లేక స్వీయ నియంత్రణ (హోం క్వారంటైన్‌)లో ఉండడమో చోటుచేసుకుంటోందంటే పరిస్థితి ఎలా చేయిదాటిపోతోందో అర్ధమవుతుంది. ఈరోజు (ఆగస్టు 15న) తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. రేయింబవళ్లూ వృత్తే ధ్యేయంగా పనిచేసే కలం వీరులకు ఇది చాలా తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. గత మూడు రోజుల నుంచి వరుసగా సీనియర్ జర్నలిస్టులు (కరోనాతో కాకపోయినా, గుండెపోటుతోనో లేక ఇతర అనారోగ్య కారణాలతోనో) మృత్యువాతపడుతూ వస్తూనే ఉన్నారు. లాక్‌డౌన్ సడలింపుతో స్వేచ్ఛగా విధులు నిర్వహించుకోవచ్చని బయటతిరుగుతున్న మీడియా మిత్రులకు ఈ పరిణామాలు బతుకుమీద ఆశలు సన్నగిల్లేలా చేస్తున్నాయి.

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సీనియర్ జర్నలిస్టు, ‘నవ తెలంగాణ’ దినపత్రిక రిపోర్టర్ అనంతుల నర్సయ్య అకాలమరణం చెందారు. అలాగే, రాజమహేంద్రవరం ఆంధ్రభూమి సీనియర్ సబ్ ఎడిటర్‌ చిరంజీవి  రామచంద్రరాజు, నాగలక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు తెల్లవారుజామున 3.20 గంటల సమంయంలో భార్య మరణవార్త విన్న భర్త రామచంద్రరాజు ఆ షాక్‌తో కుప్పకూలిపోయి 4.35 నిమిషాలకు స్వర్గస్తులైనారు. ఇదే నెలలో విశాఖలో వార్త విలేకరి ఎం. ప్రసాదరావు, సీనియర్ జర్నలిస్టు రాజేంద్ర, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో గవిని చక్రపాణి(67), నెల్లూరు జర్నలిస్టుల క్రికెట్ టీం మేనేజర్ మూర్తి, సాక్షి రీజనల్ డెస్కు సీనియర్ సబ్ ఎడిటర్ పట్నాయకుని వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎన్‌టీవీ రిపోర్టర్ నాగేశ్వరరావు (అడ్డతీగల) (42) తదితరులు ప్రాణాలు కోల్పోయారు.

నర్సయ్య కుటుంబానికి ఎన్.ఎ.ఆర్.ఎ. తక్షణ సాయం

అనంతుల నర్సయ్య పార్ధివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఎన్.ఎ.ఆర్.ఎ. ప్రతినిధులు, కుటుంబ సభ్యులు

జగిత్యాల నవ తెలంగాణ విలేకరి నర్సయ్య మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్సు అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) స్థానిక శాఖ నాయకులు శనివారం కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఎన్.ఎ.ఆర్.ఎ. అధ్యక్షుడు బండి సురేంద్రబాబు ఆదేశాల మేరకు యూనియన్ తరపున తక్షణ సాయంగా నర్సయ్య కుటుంబానికి కొంత ఆర్ధిక సహాయాన్ని కూడా అందించారు. తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ఇతర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నర్సయ్య కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని ఎన్.ఎ.ఆర్.ఎ. నాయకులు హామీ ఇచ్చారు.

కాగా, తెలంగాణలో కూడా ఇంకొందరు మృత్యువాతపడ్డారు. వీరిలో కొందరు కరోనాతోను, మరికొందరు గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలతోనూ మృతిచెందారు. ఇక, కరోనాపై పూర్తి అవగాహన ఉన్న వైద్యులకూ ఈ వ్యాధి సోకుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఒక్క నిమ్సులోనే 30 మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఉస్మానియా, గాంధీ, పేట్లబురుజు, చెస్ట్ హాస్పిటల్ వైద్యులతో సహా ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లు, వార్తలు అందిస్తున్న జర్నలిస్టులు కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులకు వైరస్ సోకడం గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న కేసులను బట్టి అర్థమవుతోంది. వైరస్ గురించి అవగాహన ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు సమావేశాల సమయంలో మాస్కులు సరిగా ధరించకపోవడం, సామాజిక దూరాన్ని పాటించక పోవడం వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశాలుంటాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో వైరస్ మరింత తీవ్రంగా ఉండే అవకాశాలున్నందున ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం సామాజిక బాధ్యతగా భావించాలని అంటున్నారు. మాస్కు అసౌకర్యంగా అనిపించినా కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే ధరించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కు ధరించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

బండి సురేంద్రబాబు

‘‘మన విధి నిర్వహణలో తీవ్రమయిన ఒత్తిడితో సతమతమవుతూ మన ఆరోగ్యాన్ని అలక్ష్యం చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా కరోనాతో మన జీవితాలు ఇంకా ప్రమాదకరంలో పడ్డాయి. అనారోగ్య సమస్యలతో ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది జర్నలిస్టులను పోగొట్టుకున్నాము. జర్నలిస్టు సోదరులారా ఇప్పటికైనా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన కుటుంబానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని నమో వల్లభ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు బండి సురేంద్రబాబు అన్నారు. ‘‘ఈరోజు నా పుట్టినరోజు. అయినా తోటి జర్నలిస్టుల మరణాలు, ఇబ్బందుల నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉన్నాను. నాకు ఎలాంటి శుభాకాంక్షలు తెలియ చేయవద్దని కోరుకుంటూ, మీకు చేతనైన సహాయం మన తోటి జర్నలిస్టులకు చేయడానికి ముందుకు వస్తే, నావంతుగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్సు అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) నుంచి కొంత చేయూతను అందించడానికి కషిచేస్తాను’’ అని అన్నారు.

జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.. జర జాగ్రత్త!

వీవీ రమణమూర్తి

‘‘మిత్రులారా, కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మార్చి 22వ తేదీ నుంచి కరోనా భీతావహం కొనసాగుతున్న విషయం మీకు తెలుసు. అయితే నేను పలువురు డాక్టర్లతో మాట్లాడిన తరువాత ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. ఆగష్టు నెలలో, అంటే ఇప్పుడు నడుస్తున్న నెలలో కరోనా వైరస్ అతి భయంకరంగా మారింది. చనిపోయే వారి సంఖ్య ఘోరంగా పెరిగింది. ఈ విషయాన్ని మీరు కూడా గమనించే వుంటారు. మనకు తెలిసిన వారే ఎంతో మంది చనిపోయారు. వైరస్ ఇప్పుడు అతి ప్రమాదకరంగా మారిపోయింది. తగిన జాగ్రత్తలో లేకపోతే ఊపిరి తిత్తులు అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతున్నాయి. ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయలేకపోతున్నారు. అందువల్ల మిత్రులందరకూ మనవి. ఇళ్లలోనే ఉండడం వల్లే మనకు మనం రక్షించుకోగలము. ఇంతవరకూ ఎలాగోలా బయటపడ్డాము. ఈ ఒక్క నెల జాగ్రత్తగా నెట్టుకొస్తే కరోనాను చాలా వరకు జయించవచ్చు. దయచేసి ఇంటినుంచి బయటకు రాకండి. బతికి ఉంటే ఎలాగయినా జీవించవచ్చు. ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి ఆలోచించవద్దు. ఇంట్లోనే వుండండి. ప్రాణాలు కాపాడుకోండి. ఈ పరిణామాన్ని అందరికీ తెలియజేయండి.’’ అని సీనియర్ జర్నలిస్టు, రచయిత, ‘లీడర్’ మీడియా గ్రూప్ అధినేత వివి. రమణమూర్తి సూచించారు.

పాత్రికేయులు లేని ప్రపంచాన్ని ఊహించలేం…

ప్రచురణ రంగం కావచ్చు, ప్రసార రంగం కావచ్చు… మీడియా లేని లోకాన్ని ఎవరూ ఊహించలేరు. కరోనావైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మీడియా పడుతున్న కష్టాలు పదాల్లో చెప్పలేము. వైరస్ గురించి సమాజానికి సమాచారాన్ని చేరవేయడంలోను, ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలూ మహమ్మారిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను, పాటించాల్సిన స్వీయ నియంత్రణలనూ ప్రచారం చేయడంలో మీడియా తనవంతు పాత్ర పోషించి ఫ్రంట్ లైన్ వారియర్లలో కీలకంగా మారింది. అయినా, ఈ రంగానికి (అటు యాజమాన్యాలకు, ఇటు పనిచేసేవాళ్లకూ) దక్కాల్సిన ఫలితం, ప్రతిఫలం దక్కలేదనుకోండి. మీడియా కవరేజీ లేకపోతే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు.. ‘ప్రెస్ కవరేజ్’ లేకపోతే పోలీసులు ఎవరు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు? అనేది కూడా ఎవరికీ తెలియదు.. విలేకరి ప్రచారం చేయకపోతే ఏ ఎమ్మెల్యే, మంత్రి ఎక్కడెక్కడ ఏమి చేస్తున్నారో అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇక, జిల్లా అధికారులను, పోలీస్ సిబ్బందిని, పోలీస్ అధికారులను, ఇక్కమాటలో చెప్పాలంటే ఇటు ప్రజలను అటు ప్రభుత్వాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారి వారి డ్యూటీ విధానాలను సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారా? లేదా? అని ప్రెస్ కవరేజీతో యోధుల్లా పనిచేస్తుంది జర్నలిస్టులే అనడం అతిశయోక్తి కాదు.

జర్నలిస్టులు నిరంతరం శ్రమిస్తూ అటు ప్రభుత్వాల పనితీరును, జిల్లా అధికారుల పనితీరును, పోలీసు వారి పనితీరును, ప్రజలకు తెలియజేస్తుంది జర్నలిస్టులే. జర్నలిస్టులు లేకపోతే నేటి కరోనావిపత్తు కవరేజీ సాధ్యమేనా? చివరికి మహమ్మారి నియంత్రణోద్యంలో సమిధలుగా మారిన జర్నలిస్టులకు మిగిలింది మరణమేనా? వ్యాధి వ్యాపించకుండా ఇలా చేయాలి, అలా ఉండాలి, స్వీయ నియంత్రణ చర్యలివీ అని నిరంతరం తమ తమ పత్రికలు, ఛానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తున్న పాత్రికేయుల సంక్షేమానికి ఇది కాదా సరైన సమయం? కష్టాల్లో ఉన్న కలం యోధులను ఆర్ధికంగా ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందుకురావడం లేదు. మీడియా మనుగడే ప్రశ్నార్ధకంగా మారిన కరోనా పరిస్థితుల నేపథ్యంలో కనీసం తాత్కాలిక భృతిగా అయినా ప్రభుత్వం కొంత సాయం అందిస్తే వచ్చిన నష్టం ఏమిటి? పరిస్థితులు అదుపులోకి వచ్చి అంతా బాగానే ఉందనుకున్నప్పుడు ఎవరూ ఇలాంటి చేయూతను అడగరు. ప్రజలకు అన్ని విధాలా అన్నీ ఇస్తున్న ప్రభుత్వాలలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. పోటీపడి మరీ వివిధ వర్గాల సంక్షేమానికి, వారి జీవన పరిస్థితుల మెరుగుదలకూ ఇతోధికంగా ఆర్ధిక సహాయం అందిస్తూ వస్తున్నారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.

జర్నలిస్టులను కూడా ఏదో ఒక వర్గంగా గుర్తించి కరోనా కష్టాల నేపథ్యంలోనైనా ఆదుకుంటే మంచిదన్న సీనియర్ జర్నలిస్టుల సూచనను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుంటే ముఖ్యంగా బీపీఎల్ కుటుంబాలకు చెందిన మీడియా ప్రతినిధులకు ఎంతో మేలు చేసినట్లవుతుంది.