కర్నూలు జర్నలిస్టులకు కరోనా మాస్క్‌లు

128
  • ఆరోగ్య బీమా వర్తింపజేయాలి: ఆర్‌డబ్ల్యూజేఎ

కర్నూలు, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వీయ రక్షణకు ఉపయోగపడే మాస్క్‌లను జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు మంగళవారం పంపిణీ చేశారు. రాయలసీమ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు, ఫోటోగ్రాఫర్లకు, టీవీ ఛానల్ వీడియో గ్రాఫర్లకు మాస్క్‌లను, శానిటైజర్లను అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రామ గిడ్డయ్యతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ పాత్రికేయులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేనప్పటికీ కరోనా రక్కసికి వెరవకుండా నిరంతరంగా వార్తలను సేకరిస్తూనే ఉన్నామని, అయినా సమాజం నుంచి ఆదరణ కరువైందన్నారు. కానీ తమకు కూడా కుటుంబాలు ఉన్నాయన్న విషయాన్ని మరిచి మాస్కులు ధరించకుండా సమాజం బాగు కోసం ఎంతో తీవ్రంగా కృషి చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్లతో తరచూ చేతులను శుభ్రపరచుకుని వార్తల సేకరణకు వెళ్లాలని హితవుపలికారు. అదే విధంగా సామాజిక/భౌతిక దూరాన్ని పాటించి వార్తలను సేకరించ వలసిందిగా సూచించారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌లో జర్నలిస్టులను కూడా భాగస్వాములను చేసి, ప్రతి ఒక్క జర్నలిస్టుకు కనీసం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రతి ఒక విలేకరి ఆరోగ్యంగా ఉండాలని, అలాగే సమాజహితం కొరకు నిరంతర వార్తా స్రవంతిలో ఉండే విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు మాస్కులు ధరించి శానిటైజర్లతో తరచూ చేతులను శుభ్రపరుచుకుని తమ కుటుంబాలను సంరక్షించుకోవాలని, కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలన్నారు. ప్రధానంగా వార్తలపై ఆసక్తి మేరకే కాక తమ కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా కరోనా వైరస్‌పై తమకు చేతనైన విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అదే విధంగా ప్రజలు లాక్‌డౌన్ నియమ, నిబంధనలను పాటించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో అన్ని పత్రికల విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, అన్ని టీవీ ఛానళ్ల వీడియో గ్రాఫర్లు, అసోసియేషన్ మెంబర్లు భూపాల్, హుస్సేన్, నాగరాజు, వీడియోగ్రాఫర్ మధు తదితరులు పాల్గొన్నారు.