ఏపీలో కరోనా వ్యాప్తి ఆందోళనకరం

0
12 వీక్షకులు
కరోనా టెస్ట్ కిట్

అమరావతి, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): కరోనా తీవ్రత రోజురోజుకూ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితిని రేకెత్తిస్తోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్ స్పస్టంచేస్తోంది. గుంటూరులో 3, కర్నూలులో 4, కృష్ణాలో 52, కడపలో 3, అనంతపురంలో 2, తూర్పుగోదావరిలో 2, ప్రకాశంలో 3, పశ్చిమగోదావరిలో 12 కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 1097కి చేరింది. 231 మంది కోలుకుని డిశ్చార్జి కాగా 31 మంది మృతి చెందారు. ప్రస్తుతం 835 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 52 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6768 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 279 కేసులు, గుంటూరులో 214, కృష్ణా జిల్లాలో 177 కేసులు నమోదయ్యాయి.

ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన నివేదికలోని లెక్కలు

మరోవైపు, విజయవాడ నగరంలో మూడు రోజుల్లో అనూహ్యంగా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తయ్యారు. కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్ వల్ల పాజిటీవ్ కేసులు పెరిగాయి. నిన్నటివరకు 18 కేసులు నమోదయ్యాయని, ఆదివారం ఒక్కరోజే 20 కేసులు నమోదయ్యాయి. దీంతో కృష్ణలంకను రెడ్ జోన్‌ ప్రాంతంగా ప్రకటించారు. కృష్ణా జిల్లా కలెక్టర్, సీపీ ద్వారకా తిరుమలరావు అధికారులతో చర్చలు జరిపారు. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఆయనతో కాంటాక్ట్ అయిన 18 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. విజయవాడ కృష్ణ లంక నుండి 300 మంది క్వారంటైన్‌కి తరలించారు. దీంతో పోలీసులు ఆ డ్రైవర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

కృష్ణలంక ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకా తిరుమలరావు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. పోలీసులు వాహనాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ విజయవాడలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయని, ఎన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నా ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. కృష్ణలంక, కార్మిక నగర్, ఖుద్దూస్ నగర్ ప్రాంతాలలో కేసులు ఎక్కువుగా నమోదయ్యాయన్నారు. ఈ ప్రాంతాలలో సామూహిక సమావేశాలు పెట్టడం వల్లే కరోనా వ్యాప్తిచెందిందని, ఒక్కోక్క వ్యక్తి ద్వారా 20 మందికి సోకినట్లు సమాచారం అందిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. జిల్లాలో 7,500 మందికి పరీక్షలు చేస్తే 170 మందికి పాజిటీవ్ వచ్చిందన్నారు.

ప్రజలు నిర్లక్ష్యంతో ఉంటే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృధానే అవుతుందని సీపీ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో ఇప్పటి వరకు 150కి పైగా పాజిటీవ్ కేసులు‌ వచ్చాయని, ఎవరూ కరోనాను తేలికగా తీసుకోవద్దని కోరుతున్నామన్నారు. పోలీసులు, రెవెన్యూ, వాలంటీర్లు, వైద్యులు, నర్సులు విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారని, వారికి హ్యాట్సాఫ్ చెప్పాలన్నారు. వారికి వ్యాప్తి చెందితే సానుభూతి చూపి, బాసటగా ఉండాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి, మరో లారీ డ్రైవర్ ద్వారా కేసులు భారీగా పెరిగాయని, బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన వారిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు.

లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో ఎవరూ బయటకు రాకూడదని, ఇష్టం వచ్చినట్లు వస్తే ఇక ఊరుకునేది లేదన్నారు. కొంతమంది పోలీసులు చర్యలను ప్రశ్నిస్తున్నారని, కానీ, తమకు ప్రజల ప్రాణాలు ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కృష్ణలంక ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టి ప్రజల రాకపోకలపై పర్యవేక్షణ ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. అంతర్గత మార్గాలలో ప్రజల రవాణాపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెడతామన్నారు. కరోనా కేసులు పెరిగే కొద్దీ పోలీసుల చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయని స్పష్టంచేశారు. ఏపీఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించామని సీపీ వెల్లడించారు.

లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని, అతిక్రమణ చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. కోల్‌కత్తా నుంచి వచ్చిన లారీ డ్రైవర్ ఇంట్లో గెట్ టు కెదర్ లాంటిది పెట్టుకున్నారని, దానివల్ల కరోనా స్ప్రెడ్ అయిందని తెలిపారు. ఆ డ్రైవర్‌తో కాంటాక్ట్ అయినవారందరిని పరీక్షించి క్వారంటైన్‌కు పంపడం జరుగుతుందని చెప్పారు. ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఒక్కసారిగా కేసులు పెరిగాయని పోలీసులు తెలిపారు. అలాగే కార్మికనగర్‌లో లాక్‌డౌన్ నిబంధనలు పాటించకపోవడంతో రెండు కేసులు నమోదయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ప్రజల నిర్లక్ష్యంవల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

కాగా, కొవిడ్-19 నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన పంటలను మార్కెటింగ్ చేసే వ్యాపారులకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జూన్ నెలాఖరు వరకు ఈ-రవాణా పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోనేందుకు‌ గడువు పొడిగించారు. పంటల క్రయ విక్రయాలు జరుపుతున్న వ్యాపారులు వ్యవసాయ మార్కెటింగ్ చెక్ పోస్టుల్లో సెస్ చెల్లింపునకు అనువుగా ఉత్తర్వులు ఇచ్చారు. వ్యాపారులు ఈ సదుపాయంను వినియోగించుకోవాలని ఏపీ మార్కెటింగ్ శాఖ అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here