జర్నలిస్టులకు కరోనా పరీక్షలు

0
23 వీక్షకులు
వైద్య పరీక్షల నిర్వహణకు నాయకత్వం వహించిన డాక్టర్ మధుసూధన శర్మతో ఏపీయూడబ్ల్యూజే నేతలు కొండా రాజేశ్వరరావు, నిమ్మరాజు చలపతిరావు, దారం వెంకటేశ్వరరావు, ఎన్. సాంబశివరావు, టి.వి. రమణ
  • 166 మందికి తొలి రోజు పరీక్షలు పూర్తి

విజయవాడ, ఏప్రిల్ 28 (న్యూస్‌టైమ్): నగరంలోని జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నేతృత్వంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) విజయవాడ శాఖ సహకారంతో కరోనా స్క్రీనింగ్ టెస్టులు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్థానిక ఐఎంఏ హాలులో ఏర్పాటుచేసిన పరీక్షలలో తొలిరోజు 166 మంది తమ నమూనాలను అందజేశారు. ఇది ఒక కరోనా స్ర్కీనింగ్ టెస్ట్‌గా ఉపయోగపడుతుందని, అయితే, దీనినే యాంటీ బాడీ టెస్ట్‌గా పిలుస్తామని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మధుసూధన శర్మ అన్నారు.

ఈ రక్త పరీక్ష ఫలితాలు రావడానికి 24 గంటలు పడుతుందన్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే వారి ఫోన్ నెంబరుకు మెసేజ్ ద్వారా తెలియజేస్తామని అన్నారు. నెగిటివ్ వచ్చిన వారికి సమాచారం రాదని చెప్పారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ శర్మ మాట్లాడుతూ ఈ టెస్ట్‌లో నెగిటివ్ వస్తే మరే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చని ఆయన తెలిపారు. ఒక వేళ పాజిటివ్ వస్తే తదుపరి టెస్టులు, వైద్యం కోసం కోవిడ్ అస్పత్రులకు, డీఎంహెచ్వోలకు వారి పేర్లను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ టెస్ట్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్న కారణంగా ప్రతిరోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

మే 3 వరకూ ఈ పరీక్షలను కొనసాగిస్తామని ఆశక్తి గల వారందరూ వచ్చి టెస్టులు చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. మంగళవారం రోజు 180 మంది రక్త పరీక్షలకు తమ పేర్లు నమోదు చేసుకోగా 166 మంది పరీక్షలు చేయించుకున్నారని, మిగిలిన వారు బుధవారం ఉదయం వచ్చి చేయించుకోవాలని ఆయన సూచించారు. పీపీఈ కిట్లు ధరించిన టెక్నీషియన్ల ద్వారా రక్త పరీక్షలు చేస్తున్నామని ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ రషిక్ సంఘవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సాంబశివరావు, ట్రెజరర్ టి.వి. రమణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here