వరుసగా 7వ రోజూ 30,000 కంటే ఎక్కువ రికవరీల నమోదు

న్యూఢిల్లీ, జులై 30 (న్యూస్‌టైమ్): 16 రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లో జాతీయ సగటు రికవరీ 64.44 శాతాన్ని మించి కరోనా కేసులు నమోదయ్యింది. 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసు మరణాల రేటు జాతీయ సగటు 2.21 శాతం కన్నా తక్కువగా నమోదయ్యింది. భారతదేశం కోవిడ్-19 నుండి కోలుకున్నవారి విషయంలో 10 లక్షలను మించిన మైలురాయిని సాధించింది. వైద్యులు, నర్సులతో పాటు ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్మికుల విధి, నిస్వార్థ త్యాగానికి, సంపూర్ణ అంకితభావానికి ఇది నిదర్శనం, ఇది కోవిడ్-19 రోగులు ఎక్కువ సంఖ్యలో కోలుకోవాలనే ఆశయానికి వాస్తవరూపాన్నిచ్చింది.

కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్రలు/కేంద్రపాలితప్రాంతాలకు చెందిన ప్రభుత్వాలు కోవిడ్-19 నిర్వహణ వ్యూహాన్ని సమన్వయంతో అమలు చేయడం ద్వారా జూన్ ప్రారంభంలో ఒక లక్షగా ఉన్న రికవరీల సంఖ్య నిరంతరం పెరుగుతూ, ఈ రోజున 10 లక్షలకు పైగా నమోదయ్యింది. సంపూర్ణ ప్రామాణిక సంరక్షణ విధానం ఆధారంగా సమర్థవంతమైన నియంత్రణ వ్యూహం, భారీ సంఖ్యలో పరీక్షలతో పాటు, ప్రామాణిక వైద్య చికిత్సా యాజమాన్య పద్దతులను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా అమలు చేయడంతో వరుసగా ఏడవ రోజున కూడా రోజుకు 30,000 రికవరీలకు మించి స్థిరమైన ధోరణి కొనసాగుతోంది. జూలై మొదటి వారంలో సగటున 15,000 రోజువారీ రికవరీల నుండి గత వారంలో 35,000 సగటు రోజువారీ రికవరీల స్థాయికి నిరంతర పెరుగుదల నమోదయ్యింది. గత 24 గంటల్లో 32,553 మంది రోగులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి కావడంతో, మొత్తం రికవరీలు 10,20,582 కు పెరిగాయి. కోవిడ్-19 రోగులలో ఈ రోజు రికవరీ రేటు 64.44 శాతంగా నమోదయ్యింది.

చికిత్స అనంతరం కోలుకున్న రోగుల సంఖ్య, కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య మధ్య అంతరం ప్రస్తుతం 4,92,340 గా ఉంది. దీంతో, ఆసుపత్రుల్లో వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న (5,28,242 మంది) రోగుల సంఖ్య కంటే, చికిత్స అనంతరం కోలుకున్న రోగుల సంఖ్య 1.9 రెట్లు అధికంగా ఉంది. ఎటువంటి అవరోధాలు లేని వైద్య చికిత్స యాజమాన్యం కోసం సరసమైన ఆసుపత్రి మౌలిక సదుపాయాలను పెంచడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో అనేక చర్యలు తీసుకున్నాయి. జాతీయ సగటు రేటు కంటే 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అధిక రికవరీ రేటు నమోదు కావడం కూడా విజయంగా భావించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రయత్నాలను సమన్వయపరచి భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా కోవిడ్-19 రోగులను ముందస్తుగా గుర్తించడంతో పాటు ప్రాణాంతక పరీక్షలు చేయడం తక్కువ మరణాలకు దారితీసింది.

తీవ్రమైన కేసులు మరియు అధిక-ప్రమాద జనాభాకు సంరక్షణలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యాధిని ముందుగా గుర్తించి, వారిని ఐసోలేషన్‌లో చికిత్సనందిస్తూ, నియంత్రణ వ్యూహంపై దృష్టి పెట్టడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 4 శాతంగా ఉన్న సగటుతో పోలిస్తే, భారతదేశంలో 2.21 శాతంతో అతి తక్కువ కేస్ మరణాల రేట్ (సి.ఎఫ్.ఆర్) నమోదౌతోంది. 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా సి.ఎఫ్.ఆర్. నమోదౌతుండగా, 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సి.ఎఫ్.ఆర్. ఒక శాతం కన్నా తక్కువగా నమోదౌతోంది. అలాగే, కోవిడ్ నివారణ, చికిత్స విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తదేక దృష్టితో తీసుకుంటున్న చర్యలు, దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెంపు ద్వారా తొలిదశలోనే కేసుల గుర్తింపు, పాజిటివ్ కేసులను ఐసొలేషన్‌లో ఉంచటం లాంటి చర్యల కారణంగా సానుకూల ఫలితాలు వస్తున్నాయి.

భారత వైద్య పరిశోధనామండలి చర్యలకారణంగా పరీక్షల విస్తృతి పెరగటం కూడా అందుకు తోడయింది. గడిచిన 24 గంటల్లో 4,46,642 శాంపిల్స్ పరీక్షించారు. వారం వారం సగటు పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. జులై మొదటి వారంలో 2.4 లక్షలు ఉండగా ఆఖరి వారానికల్లా అవి 4.68 లక్షలు పైబడ్డాయి. దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెరగటంలో కీలకమైన పాత్ర పోషించింది పెరుగుతున్న లాబ్‌ల నెట్‌వర్క్ అన్నది నిజం. నేటివరకూ దేశంలో ఉన్న లాబ్‌ల సంఖ్య 1321 కాగా అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 907, ప్రైవేట్ ఆధ్వర్యంలో 414 ఉన్నాయి. పరీక్షల మౌలిక వసతులు పెరగటం వలన జులై 1 నాటికి మొత్తం పరీక్షలు 88 లక్షలు ఉండగా జులై 30 నాటికి ఆ సంఖ్య కోటీ 82 లక్షలకు చేరింది. అందుకు అనుగుణంగానే ప్రతి పది లక్షలకు జరిపిన పరీక్షలు 13,181కి పెరిగాయి. ‘‘పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స చెయ్యి’’ అనే కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగా దేశంలో పరీక్షల సంఖ్య పెంపు కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలతో పాజిటివ్ కేసుల శాతం 10% కంటే తక్కువగా నమోదవుతూ వస్తోంది.

చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతంలో సామాజిక దూరం నిబంధనను అధికశాతం ఉల్లంఘిస్తున్న రద్దీ ప్రాంతాలు, ఇతర మార్కెట్లను గుర్తించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను చండీగఢ్‌ పాలన యంత్రాంగాధిపతి ఆదేశించారు. తదనుగుణంగా అటువంటి వాటిని వారాంతాల్లో మూసివేయడం, బేసి-సరి సూత్రం అమలుసహా కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టడంపై యోచించాలని సూచించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు బస్సుల్లో కోవిడ్‌ విధివిధానాల అమలుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 186 బస్సులలో 3500 మంది ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించనివారు 96 మంది మాత్రమే ఉన్నారని తేలినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మాస్కు ధరించని వ్యక్తులకు అధికారులు జరిమానా విధించారు. మరోవైపు అన్ని బస్ స్టాండ్లలో మాస్కులు, పరిశుభ్రకాలు, చేతి తొడుగులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని రవాణాశాఖ జారీచేసిన ఆదేశాలు అమలులో ఉన్నాయి. హర్యానా రాష్ట్రంలో రాబోయే 10 రోజుల్లో తొమ్మిది కొత్త రోగ నిర్ధారణ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని, దిగ్బంధ విముక్తి-3 సమయంలో మాస్కుల ధారణకు ప్రజలను సమాయత్తం చేయాలని, ఈ దిశగా ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ అధికారులను ఆదేశించారు. మాస్కు ధారణను కఠినంగా అమలుచేయాలని, ఉల్లంఘించినవారికి అక్కడికక్కడే జరిమానా విధించి వసూలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడంతో పరస్పర సమన్వయానికి వీలు కలిగిందని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అన్నారు. ఈ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాదేనని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనడం కోసం రాష్ట్ర, జిల్లా అధికారులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రభుత్వం క్రమంత తప్పకుండా సమావేశాలు నిర్వహించిందని గుర్తుచేశారు. దీంతోపాటు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వాస్తవిక, సాదృశ సమావేశాలు, చర్చాగోష్ఠులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు మరో 3 మరణాలు నమోదవడంతో మృతుల సంఖ్య 71కి చేరింది. కోవిడ్ రోగులకు ఇళ్లలోనే చికిత్సలో తొలిదశగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

ఈ మేరకు ఇకపై వ్యాధి బారినపడిన ఆరోగ్య కార్యకర్తలు తమ ఇళ్లలో చికిత్స పొందవచ్చు. ఇక రాబోయే రోజుల్లో లక్షణరహిత రోగులు ఇంట్లోనే చికిత్స పొందడానికి అనుమతి ఉంటుంది. రాష్ట్రంలో నిన్న 903 కొత్త కేసులు నమోదవగా వీటిలో 739 స్థానికంగా సంక్రమించినవే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,350 మంది చికిత్స పొందుతుండగా 1.47 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ ఒకరు మరణించగా, 122 కొత్త కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసులు 3293కు, మరణాలు 48కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1292గా ఉన్నాయి. కాగా, తమిళనాడులో దిగ్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది; తదనుగుణంగా చెన్నైలో ఉదయం 6నుంచి రాత్రి 7గంటల మధ్య రెస్టారెంట్లు, టీ షాపులలో 50 శాతం సీట్లలో వినియోగదారులను అనుమతిస్తారు.

రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో చిన్న ప్రార్థనా స్థలాలలో ప్రజలు ప్ర్రార్థన చేసేందుకు అనుమతి ఉంటుంది. ఇక రెండు వారాలుగా మదురైలో నమోదైన కేసులలో సగానికిపైగా కోవిడ్-19 రోగులతో పరిచయాలవల్ల సోకినవేనని తేలింది. మదురైలో నిన్న 6426 కొత్త కేసులు, 82 మరణాలు సంభవించగా, 5927 కోలుకున్నారు. ప్రస్తుతం ఈ నగరంలో 2392 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు: 2,34,114; యాక్టివ్‌ కేసులు: 57,490; మరణాలు: 3741; చెన్నైలో యాక్టివ్ కేసులు: 12,735గా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్ సంక్షోభం నడుమ ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఇవాళ ప్రారంభమైంది. సుమారు 1.94 లక్షలమంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

ఇందులో భాగంగా కోవిడ్‌ సంరక్షణ కేంద్రాలలోని విద్యార్థులు సిఇటి రాసేందుకు ఏర్పాట్లతోపాటు పరీక్ష హాళ్లలో పర్యవేక్షకులు పీపీఈ కిట్లు ధరించడంవంటి భద్రత నిబంధనలను పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక రాష్ట్రంలో నిన్న 5503 కొత్త కేసులు, 92 మరణాలు నమోదవగా 2397మంది డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులలో బెంగళూరు నగరానికి చెందినవి 2270గా ఉన్నాయి. మొత్తం కేసులు: 1,12,504; యాక్టివ్‌: 67,448; మరణాలు: 2147గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడానికి కారణం పరీక్షలు ముమ్మరం చేయడమేనని ప్రభుత్వం ప్రకటించింది.

కాగా, రాజ్ భవన్ వద్ద విధుల్లోగల 15 మంది భద్రతా సిబ్బందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణ దిశగా రాష్ట్రంలో 26,778 వైద్య పోస్టుల (మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, సాంకేతిక నిపుణులు) భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ్టినుంచి ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా ఈ నియామక ప్రక్రియను ఆగస్టు 5లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 మరణశాతాన్ని గణనీయంగా తగ్గించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో రెమ్‌డెసివిర్, టోలిసిజుమాబ్ వంటి యాంటీవైరల్ ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 10,093 కొత్త కేసులు, 65 మరణాలు నమోదవగా 2784 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,20,390; యాక్టివ్‌ కేసులు: 63,771; మరణాలు: 1213గా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో సంచార కోవిడ్-19 పరీక్ష కేంద్రా (బస్సు)లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు అంబులెన్సులు, శిక్షణపొందిన సిబ్బంది నియంత్రణ జోన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ సమాచార పత్రం ప్రకారం తెలంగాణ ఆసుపత్రులలో 14,000 కోవిడ్ పడకలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 1811 కొత్త కేసులు, 13 మరణాలు నమోదవగా 821 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 521 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసులు: 60,717; యాక్టివ్‌ కేసులు: 15,640; మరణాలు: 505; డిశ్చార్జి అయినవి: 44,572గా ఉన్నాయి. కోవిడ్‌-19 మహమ్మారిపై మణిపూర్ రాష్ట్ర ప్రతిస్పందనపై బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ శాసనసభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ అధ్యక్షత వహించారు.

కాగా, మణిపూర్‌లో రిమ్స్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు రెసిడెంట్ వైద్యులకు కోవిడ్‌ నిర్ధారణ కాగా, ఇప్పటిదాకా ఈ ఆస్ప్రతిలో వైరస్‌ బారినపడినవారి సంఖ్య 22కు చేరింది. నాగాలాండ్ రాష్ట్రంలో ఇవాళ నిర్ధారణ అయిన 48 కొత్త కేసులకుగాను దిమాపూర్‌లో అత్యధికంగా 32, కోహిమాలో 16 వంతున నమోదయ్యాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో కోవిడ్ కేసులు 4 లక్షలస్థాయిని దాటాయి. తాజాగా 9,211 కొత్త కేసులతో మొత్తం కేసులు 4,00,651కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,46,129కాగా, ఇవాళ మహారాష్ట్రలో 7,478మంది కోలుకోవడంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,39,755కు చేరింది. ఇక రాష్ట్రంలో 298 మరణాలు కూడా నమోదవగా మొత్తం మృతుల సంఖ్య 14,463కు పెరిగింది.

రాష్ట్రంలోని పుణె, సాంగ్లి, నాసిక్, కొల్హాపూర్ తదితర నగరాలు, పట్టణాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31వరకూ దిగ్బంధాన్ని పొడిగించింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళ్ల కర్ఫ్యూ కొనసాగుతుంది. గుజరాత్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,144 కొత్త కేసులు, 24 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 59,126కు, మృతుల సంఖ్య 2,396కు చేరుకున్నాయి. గుజరాత్‌లో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 13,535గా ఉంది. కాగా, వివిధ మతాలకు సంబంధించిన పండుగల వేడుకలను స్వచ్ఛందంగా మానుకోవాలని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పరిస్థితుల కొనసాగితే నవరాత్రి వేడుకలు కూడా రద్దవుతాయని ప్రకటించారు.

ఇక మాస్కు ధరించకపోతే విధించే జరిమానా మొత్తాన్ని ప్రభుత్వం రూ.200 నుంచి రూ.500కు పెంచింది.
రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం 365 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో గరిష్ఠంగా 108 కోటా జిల్లాకు చెందినవి కాగా- అజ్మీర్ (50), అల్వార్ (48) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీంతో రాజస్థాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 40,145కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 10,817 కాగా, ఇప్పటివరకూ 654 మంది మరణించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రధాన నగరాలు ఇండోర్, భోపాల్, ఉజ్జయినిలలో సీరో నిఘా అధ్యయనం చేపట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. భోపాల్‌లోగల ఎయిమ్స్ పర్యవేక్షణలో ఈ సర్వే సాగనుంది. ఉజ్జయినిలో మరణాలు అత్యధికంగా ఉన్నందున ఈ నగరం నుంచే అధ్యయనం మొదలవుతుంది. కాగా, రాష్ట్రంలో బుధవారం 917 కొత్త కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here