భారత్‌లో 292 శాతం పెరిగిన కరోనా కేసులు

0
8 వీక్షకులు

న్యూఢిల్లీ, మే 26 (న్యూస్‌టైమ్): భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారత్‌లో మే నెలలో కరోనా కేసులు 292 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 1,45,348 కేసులు నమోదయ్యాయి.

4,167 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఆగడం లేదు. అమెరికా, రష్యా, బ్రెజిల్ తర్వాత భారత్‌లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, డెత్ రేటు 2.87 శాతం మాత్రమే ఉండటం కొంత ఊరట కల్గించే అంశం. అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

రోజుకు భారత్‌లో 7 వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. 24 గంటల్లో భారత్‌లో 6,535 కేసులు నమోదయ్యాయి. 6,535 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 146 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

ఇదిలావుండగా, ప్రపంచంలో ప్రతి లక్ష మందికి 4.4 మంది కరోనాతో చనిపోతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే భారత దేశంలో అయితే 0.3 శాతం మందే చనిపోతున్నారని చెప్పింది. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ అని తెలిపింది. లాక్‌డౌన్‌ అమలు, కేసులు సమయానికి గుర్తించడం, మెరుగైన నిర్వహణ వల్లనే మనం ఇది సాధించగలిగామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, కట్టుదిట్టమైన చర్యల ద్వారా కరోనా వైరస్‌ను అరికట్టిన దేశాలు ఇప్పుడు ఆ నిబంధనలను వెంటనే సడలిస్తే తక్షణమే రెండోసారి వైరస్ తారస్థాయిని చవిచూడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ప్రపంచం ఇంకా వైరస్‌ మొదటి దశకు మధ్యలోనే ఉందని ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్‌ మైక్‌ ర్యాన్‌ వెల్లడించారు.

కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో తీవ్రత అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంటువ్యాధులు దశల వారీగా దాడి చేస్తాయని, మొదటి దశ తీవ్రత కొద్దిగా తగ్గిన దేశాల్లో సంవత్సరాంతంలో మళ్లీ దాని ప్రభావం కనిపిస్తుందన్నారు. మొదటి దశ కట్టడికి తీసుకున్న చర్యలను వెంటనే నిలిపివేస్తే మరోసారి వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘‘మరోసారి ఎప్పుడైనా ఆ వైరస్‌ దాడి చేయొచ్చనే విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు వైరస్ తగ్గుతుందని, మరోసారి రావడానికి నెలల పాటు సమయం ఉంటుందని మనం అంచనా వేయలేం. ఈ దశలోనే మరోసారి ఎక్కువ కేసులు నమోదు కావొచ్చు’’ అని అన్నారు.

తక్షణమే రెండోసారి వైరస్‌ తారస్థాయికి చేరదని హామీ ఇవ్వడానికి ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలు ప్రజారోగ్యం, నిఘా చర్యలు, పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలను కొనసాగించాలని సూచించారు. ఆర్థికంగా పెను ప్రభావం పడుతుండటంతో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఆ దేశాలు దశలవారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here