శ్రీకాళహస్తిలో 11 కొత్త కేసులు

0
6 వీక్షకులు
కొవిడ్-19 నియంత్రణ విధుల్లో ఉన్న అధికారులతో కలిసి సమీక్షిస్తున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. భరత్ నారాయణ్ గుప్తా

చిత్తూరు, ఏప్రిల్ 19 (న్యూస్‌టైమ్): ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కరోనా మరింత విస్తరించింది. ఆదివారం జరిపిన పరీక్షల్లో పదకొండు కొత్త కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో కొవిడ్-19 మహమ్మారితో శైవ సన్నిధి శ్రీకాళహస్తి వణికిపోతోందన్న విషయం మరోసారి రుజువైంది. జిల్లా వ్యాప్తంగా నమోదయిన కేసుల్లో ఇక్కడే అత్యధిక కేసులను గుర్తించారు. ఆదివారం నమోదైన 11 కరోనావైరస్ కొత్త కేసులతో కలిపి పట్టణంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. దీంతో చిత్తూరు జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు 39కి పెరిగాయి. మహమ్మారి లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్సకు చేరిన వారిలో ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు నయమై డిశ్చార్జి అయ్యారు.

శ్రీకాళహస్తిలో తాజాగా నమోదైన 11 కొత్త కేసుల్లో 10 మంది కొవిడ్-19 వారియస్సే కావడం గమనార్హం. వీరంతా పట్టణానికి చెందినవారే. పైగా వీరంతా కోవిడ్ -19 విధుల్లో నిమగ్నమైన ఫ్రంట్‌లైన్ కార్మికులు. వారిలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు రెవెన్యూ శాఖ సిబ్బంది, ఇద్దరు వార్డు కార్యదర్శులు, ఇద్దరు మెడికల్ షాపు యజమానులు ఉండగా, మరొకరు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారితో కలిసిన వారు. ఆదివారం తమ నివేదికలు వచ్చేవరకు వారు పట్టణంలోని రెడ్‌జోన్ ప్రాంతంలో విధులను నిర్వర్తిస్తున్నారు. వీరందరినీ తిరుపతిలోని పద్మావతి కోవిడ్ ఆసుపత్రికి తరలించినట్లు చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. పెంచాలయ్య తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here