అవినీతిమయం పోలవరం!

2795
  • మెయిన్ డాం లేకుండా నీళ్లా?

  • సీబీఐ విచారణకు జేసీవీ డిమాండు

రాజమహేంద్రవరం, మే 16 (న్యూస్‌టైమ్): ‘‘పోలవరం ప్రాజెక్ట్ ఇదిగో పూర్తవుతోంది.. అడిగి పూర్తవుతోందని ఇన్నాళ్లూ ప్రజల్ని మభ్యపెట్టారు. నిజానికి ప్రాజెక్ట్ సంపూర్ణంగా పూర్తి కావాలంటే కనీసం ఏడేళ్లు పడుతుంది. ఇక ప్రాజెక్ట్‌లో అవినీతి దారుణంగా చోటుచేసుకుంది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి’’ అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్‌రెడ్డి అన్నారు.

ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై జేసీవీ ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు రాచమల్లు ప్రభాకర రెడ్డి, కె.శంకర రెడ్డి, రిటైర్డ్ ఎస్ఈ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాళ్ల సుబ్బారావు, వ్యాపారవేత్త అశోక్ కుమార్ జైన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన లక్ష్మణ్‌రెడ్డి అనంతరం రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.

‘‘ఉన్న 10 లక్షల ఆయకట్టుని స్థిరీకరిస్తూ అదనంగా ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి కనీసం ఒక్క ఎకరానికి కూడా సర్వే చేయించలేదు. లేనిది ఉన్నట్లు ప్రజల్ని మభ్యపెట్టారు. కేంద్రం చేపట్టాల్సిన జాతీయ ప్రాజెక్ట్‌ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడమే పెద్ద తప్పిదం. అసలు ఈ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర లేదు. ప్రచారం కోసం టార్గెట్స్ పెట్టడం ఇంకా దారుణం. పదికాలాల పాటు ఉండే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మెయిన్ డాం పనులు ఇంకా మొదలు పెట్టకుండానే గ్రేవిటీ ద్వారా నీళ్లు ఇచ్చేస్తామనడం శోచనీయం. మెయిన్ డాంకి ఇబ్బంది లేకుండా నిరించి కాపర్ డాం ద్వారా నీళ్లు ఇచ్చినా మూన్నాళ్ళ ముచ్చటే. వరద వస్తే కొట్టుకుపోతే పరిస్థితి ఏమిటి? ఎన్నో లోపాలు గల ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా పరిశీలన జరిపి 15 రోజుల్లో కొత్త ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం’’ అని అన్నారు.

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం గురించి 1940లోనే ప్రతిపాదన వస్తే, 1980లో ఆనాటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేసారని, 2005లో అన్ని అనుమతులు తీసుకొచ్చి ఐదారువేల కోట్లు వెచ్చించి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుడి ఎడమ కలువల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని కేంద్రం చేపట్టాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం పొరపాటని ఆయన పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో సగం సొమ్ము వివిధ స్థాయిల్లో స్వాహా చేసారని ఆయన ఆరోపించారు.

మెయిన్ డాం పని అసలు మొదలు పెట్టకుండా కాపర్ డాం పనులు చేస్తూ ఇదిగో నీళ్లు ఇచ్చేస్తాం అదిగో ఇచ్చేస్తాం అని చెప్పడం శోచనీయమన్నారు. గతంలో 9 ఏళ్ళు సీఎంగా ఉండగా ఈ ప్రాజెక్ట్ గురించి ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు పాత్ర ఇప్పుడు కూడా పెద్దగా లేదన్నారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ జూన్‌లో వరదలు వస్తే ప్రెజెక్ట్ పనులు ముందుకు సాగవని, ఇంకా మూడు వందల టన్నుల చొప్పున గల గేట్లు బిగించాల్సి ఉందని, ఇవన్నీ అవ్వాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని అన్నారు. కొత్త ఆయకట్టు విషయంలో సర్వే జరగకపోవడం వింతగా ఉందన్నారు.

రిటైర్డ్ ఎస్ఈ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ ఎంతో నాణ్యతగా, సాంకేతికంగా, నిబద్దతతో పూర్తిచేయాల్సిన ఈ ప్రాజెక్ట్ విషయంలో టార్గెట్లు పెట్టడం తగదన్నారు. ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ పోలవరం విషయంలో గ్రాఫిక్స్ పిట్టలదొర మాదిరిగా చంద్రబాబు పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

ప్రాజెక్ట్ పూర్తికాకుండానే కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆర్టీసీ బస్సులో జనాన్ని తీసుకెళ్లి భోజనాలు పెట్టించి మభ్య పెట్టడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా తప్పదు ప్రకటనలతో మభ్య పెట్టినందుకు 420 కేసు పెట్టాలన్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ తీరు తెన్నులు, కాంట్రాక్టర్ల తీరుపై సీబీఐ విచారణ చేయాలన్నారు.