వీడని ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ

151

కాకినాడ, మార్చి 26 (న్యూస్‌టైమ్): తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు బ్యాలెట్‌ పెట్టెలు నిక్షిప్తం చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో కలెక్టర్‌ తెరిచారు. భారీగా అభ్యర్థులు, అంతకు మించి లెక్కింపు ఏజెంట్లు, ఇతర ఎన్నికల అధికారులు హాజరుకావడంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతులకు ఇదే ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు, సుమారు 600 మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా పోలైన ఓట్ల కట్టలు కట్టడంతోనే రోజంతా గడిచిపోయింది.

తొలి రౌండ్‌ నుంచి లెక్కింపు ప్రారంభం కావాలంటే బుధవారం వరకు ఆగాల్సిందే. ఈ పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్న వారిలో ఉత్కంఠ రేపుతోంది. అంతా సవ్యంగా సాగి ఎవరో ఒక అభ్యర్థి కోటా ఓట్లు సాధించుకుంటే ఫలితం గురువారం ఉదయం నాటికి వెలువడే అవకాశం ఉంది. లేదంటే ఇంకాస్త సమయం పట్టనుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఫలితం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా వెలువడే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గ పరిధిలోని రెండు జిల్లాల్లో 2,93,794 మంది ఓట్లు నమోదు చేసుకోగా ఓటు హక్కును 1,92,137 మంది వినియోగించుకున్నారు.

ఈసారి ఎన్నికల బరిలో ముందెన్నడూ లేని విధంగా ఏకంగా 46 మంది అభ్యర్థులు ఉండడంతో బ్యాలెట్‌ పత్రం చాంతాడంత అయింది. దీంతో పత్రాలను విడదీయడం, 50 ఓట్ల చొప్పున కట్టలుగా కట్టడానికే ఎక్కువ సమయం తీసుకుంటోంది. 200 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో 600 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మంగళవారం రాత్రి మరికొంతమంది అదనపు సిబ్బందిని రప్పించారు. రెండు జిల్లాల సహాయ రిటర్నింగ్‌ అధికారులతో పాటు లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులు సేవలందిస్తున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ నిర్విరామంగా సాగుతోంది.

ఓటరు ప్రాధాన్యం ఆధారంగా సమయం పట్టే అవకాశం ఉంది. ఓటరు ఒకటి, రెండు, మూడు ప్రాధాన్యం ఓట్లు నమోదు చేసి వదిలేస్తే తక్కువ సమయంతో తేలిపోతుందని, పోటీలో ఉన్న 46 మంది అభ్యర్థుల పేర్ల ఎదుట అంకెలు వేసుకుంటూ పోతే లెక్కింపులో జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.