ఏపీలో కొవిడ్-19 కొత్త కేసులు 15

148
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా విజయవాడ నగరంలో క్రిమిసంహారిక మందులను పిచికారీ చేస్తున్న దృశ్యం

అమరావతి, ఏప్రిల్ 8 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కోవిడ్-19 పాజిటివ్ కేసులు కొత్తగా 15 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 329కి చేరింది. నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులను గుర్తించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక బులెటెన్‌లో వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి కార్యాలయం ద్వారా బుధవారం ఉదయం మీడియాకు విడుదల చేసిన బెలెటిన్ నెంబర్ 109లో కొవిడ్-19 తాజా లెక్కలను తెలిపింది. మరోవైపు, రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక/భౌతిక వ్యాప్తి మొదలైందని, అది ప్రాథమిక స్థాయిలో ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

విజయవాడ నగరంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రంతంలో జన సంచారాన్ని పూర్తిగా నిలిపివేసిన దృశ్యం

రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేసేందుకు ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక సర్వే ద్వారా కొవిడ్‌ లక్షణాలతో ఉన్న 5 వేల మందిని గుర్తించారు. వారిలో 1800-2000 మందికి పరీక్షలు అవసరమని భావిస్తున్నారు. ‘‘3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లను దిగుమతి చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేస్తాం. ప్రైవేటు ల్యాబ్‌లనూ సంప్రదిస్తున్నాం. టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయొచ్చని ఐసీఎంఆర్‌ చెప్పింది. 240 ట్రూనాట్‌ సెంటర్లున్నాయి. 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు సిద్ధం చేస్తున్నాం. 40లక్షల గ్లోవ్స్‌, 12 లక్షల సర్జికల్‌ మాస్క్‌లు ఉన్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్‌ 14 లక్షలు సిద్ధంగా ఉంచాం’’ అని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

  • జిల్లాల వారిగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల వివరాలు…

ఇదిలావుండగా, రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు 55 నిమిషాల్లోనే అందనున్నాయి. ఇందుకు అవసరమైన టెస్టింగ్‌ కిట్‌లను విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌ అందుబాటులోకి తెచ్చింది. ముందుగా 100 కిట్‌లను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిశీలనకు పంపింది. వాటి పనితీరును ఐసీఎంఆర్‌ పరిశీలించి, వినియోగానికి అనుమతించిందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏఎంటీజడ్‌లోని రెండు పరిశ్రమలు ఈ కిట్‌ల తయారీని ప్రారంభించాయి. ఐసీఎంఆర్‌ నుంచి అనుమతులు రావటంతో ఉత్పత్తిని పెంచనున్నాయి. కొద్దిరోజుల్లో సుమారు 500 టెస్టింగ్‌ కిట్‌లను సీఎం చేతులమీదుగా ప్రారంభించే అవకాశముంది. నెలరోజుల్లో 25వేల కిట్‌లను తయారుచేస్తారని పరిశ్రమల శాఖ అధికారి తెలిపారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌లో ఈ చివరి వారం ఎంతో కీలకం కానుంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను ‘నో మూమెంట్‌ జోన్‌’లగా ప్రకటించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు రావొద్దు, ఆయా ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోంది. విజయవాడ నగరంతో పాటు మచిలీపట్నం, నూజివీడు, చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల, జగ్గయ్యపేట ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. వీరు ఇబ్బందులు పడకుండా కూరగాయలు, నిత్యావసరాలను ఆటోల్లో తరలిస్తున్నారు.

రెడ్‌జోన్ ప్రకటన నేపథ్యంలో విజయవాడ నగర వీధుల్లో క్రిమిసంహారిక మందు పిచికారీ
రెడ్‌జోన్ ప్రకటన నేపథ్యంలో విజయవాడ నగర వీధుల్లో క్రిమిసంహారిక మందు పిచికారీ
రెడ్‌జోన్ ప్రకటన నేపథ్యంలో విజయవాడ నగర వీధుల్లో క్రిమిసంహారిక మందు పిచికారీ

జిల్లాలో ఇప్పటి వరకు కరోనా అనుమానిత లక్షణాలకు సంబంధించి 549 మంది నమూనాలను సేకరించారు. వీటిలో 29 మందికి పాజిటివ్‌ రాగా 245 మందికి నెగెటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ వచ్చినవారిలో నలుగురు విదేశాల నుంచి వచ్చినవారు కాగా మిగిలిన 25 మంది ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారున్నారు. సోమవారం 448 నమూనాలను తీసుకున్న అధికారులు మంగళవారం మరో 101 మంది దగ్గర నుంచి సేకరించారు. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు, ఢిల్లీ నుంచి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు, వారి కాంటాక్టులు ఉన్నారు. ఈ క్రమంలో కరోనాను మరింత కట్టడి చేసేందుకు.. జిల్లా యంత్రాంగం ఇంటింట సర్వే చేస్తున్నారు. మధుమేహం, బీపీ, ఊపిరితిత్తులు ఇతర వ్యాధులపై సమగ్ర వివరాలను గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు సేకరిస్తున్నారు. కరోనా అనుమనితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో మంగళవారం కొత్త కేసులేమీ నమోదు కాలేదు. వీటిలో విజయవాడ నగరంలోనే 18 ఉన్నాయి. దీంతో భవానీపురం, న్యూరాజరాజేశ్వరీపేట, సనత్‌నగర్‌, గాయత్రినగర్‌, రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వైద్యాధికారులతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. బాధితుల నివాస ప్రాంతాల నుంచి కిలోమీటరు మేర ఎలాంటి రాకపోకలకు వీల్లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.