న్యూఢిల్లీ, ఆగస్టు 5 (న్యూస్‌టైమ్): ఇండియాలో మున్నెన్న‌డూ లేని రీతిలో, గ‌త 24 గంట‌ల‌లో గ‌రిష్ఠస్థాయిలో పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు. 51,706 మంది కోవిడ్ పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో రిక‌వ‌రీ రేటు 67.19 శాతానికి చేరింది. ఇది రోజు రోజుకూ మెరుగుప‌డుతూ వ‌స్తున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం కోలుకున్న కేసులు 12, 82,215. యాక్టివ్ కేసుల కంటే ఇవి రెట్టింపు. కోవిడ్ -19 పేషెంట్లు పెద్ద సంఖ్య‌లో కోలుకుంటుండ‌డంతో, గ‌త 14 రోజుల‌లో కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 63.8 కి చేరింది. ఇది కేంద్రం అనుస‌రిస్తున్న టెస్ట్‌- ట్రాక్‌- ట్రీట్ వ్యూహం మంచి ఫ‌లితాలిస్తున్న‌ద‌ని సూచిస్తున్న‌ది. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగం స‌మ‌ష్టిగా ఆస్ప‌త్రుల మౌలిక స‌దుపాయాల‌ను పెంచ‌డం, పెద్ద ఎత్తున ప‌రీక్ష‌ల‌ నిర్వ‌హ‌ణ వంటి వాటి వ‌ల్ల రిక‌వ‌రీ రేటు పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డింది.

ఇది గ‌త 14 రోజుల‌లో 63 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. ఇలా క్ర‌మంగా కోవిడ్ నుంచి కొలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డంతో, కోలుకున్న పేషెంట్ల సంఖ్య‌కు, యాక్టివ్ పేషెంట్ల‌కు మ‌ధ్య గ‌ల అంత‌రం 7 ల‌క్ష‌ల‌కు చేరింది. రికార్డుస్థాయిలో పేషెంట్లు కోలుకోవ‌డం వ‌ల్ల యాక్టివ్ కేసులు 5,86,244కు పడిపోయాయి. (నిన్న 5,86,298 కేసులుండ‌గా ఇప్ప‌డు ఇంకా త‌గ్గాయి) వీరంతా వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్ విధానాన్ని కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్నందున సిఎఫ్ఆర్, అంత‌ర్జాతీయ ప‌రిస్థితితో పోలిస్తే త‌క్కువ‌గా ఉంది. ఇది మ‌రింత‌గా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. ఈరోజు కేస్ ఫాట‌లిటీ రేట్‌ (సిఎఫ్ఆర్) 2.09 శాతంగా ఉంది.

మరోవైపు, భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ మరణాలు కూడా రికార్డుస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 857 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 39,795కు చేరింది. రోజువారీగా చూస్తే, 24గంటల వ్యవధిలో ప్రపంచంలో అత్యధిక మరణాలు భారత్‌లోనే చోటుచేసుకున్నాయి. నిన్న ఒకేరోజు కొత్తగా మరో 52,509 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 50వేలకుపైగా కేసులు నమోదుకావడం ఇది వరుసగా ఏడోరోజు కావడం ఆందోళన కలిగించే విషయం. దీంతో బుధవారం నాటికి దేశంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 19,08,254గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 12లక్షల 82వేల మంది కోలుకోగా మరో 5లక్షల 86వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య పెరగడం ఊరట కలిగించే విషయం. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 51వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 67.19శాతానికి పెరిగింది. అయితే, మరణాల సంఖ్య మాత్రం కలవరపెడుతోంది. నిత్యం 800లకు పైగా కొవిడ్‌ రోగులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 2.09శాతంగా ఉంది. ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 16 వేలు దాటింది. నిత్యం అక్కడ దాదాపు 300మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమిళనాడు, దిల్లీ, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఇక ప్రపంచంలో అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ మూడోస్థానంలో ఉంది. మరణాల్లో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ మరణాల సంఖ్య 40వేలకు చేరువయ్యింది.