7 రోజులుగా మృతులు రోజుకు 300 లోపే…

న్యూఢిల్లీ, జనవరి 2 (న్యూస్‌టైమ్): భారతదేశంలో చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అది బాగా తగ్గుతూ ఈ రోజుకు 2.54 లక్షల స్థాయికి పడిపోయి 2,54,254గా నమోదైంది. ఇది గత 179 రోజులలో అతి తక్కువ స్థాయి. 2020 జులై 6న మొత్తం చికిత్సలో ఉన్నవారి సంఖ్య ఇదే స్థాయిలో 2,53,287గా ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న బాధితుల వాటా మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో 2.47 % మాత్రమే. ఇటీవలి కాలంలో రోజువారీ నమోదవుతున్న కొత్త కోవిడ్ కేసులు సుమారు 20,000 ఉంటున్నాయి. గడిచిన 24 గంటలలో నమోదైన కేసులు 20,035 కాగా కోలుకున్నవారి సంఖ్య 23,181గా నమోదైంది. కొత్త కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం గత 35 రోజులుగా కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 99 లక్షలకు దగ్గరవుతూ 98,83,461కు చేరింది. కోలుకున్నవారికీ, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 96 లక్షలు దాటి 96,29,207 అయింది. కొత్తగా వస్తున్న పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కోలుకుంటున్న శాతాన్ని మెరుగుపరుస్తూ ఈ రోజుకు 96.08%గా నమోదైంది. కొత్తగా కోలుకున్నవారిలో 77.61% మంది 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నమోదయ్యారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 5,376 మంది కోలుకోగా, మహారాష్ట్రలో 3,612 మంది, పశ్చిమ బెంగాల్‌లో 1,537 మంది కోలుకున్నారు.

కొత్తగా నిర్థారణ అయిన కోవిడ్ పాజిటివ్ కేసులలో 80.19% మంది 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పరిమితం కాగా కేరళలో అత్యధికంగా 5,215 కొత్త కేసులు నిన్న నమోదయ్యాయి. మహారాష్ట్ర 3,509 కేసులతో రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటలలో 256 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వాటిలో 80.47% మరణాలు 10 రాష్ట్రాలలోనే నమోదు కాగా మహారాష్టలో అత్యధికంగా 58 మంది, కేరళలో 30 మంది, పశ్చిమ బెంగాల్‌లో 29 మంది చనిపోయారు. గత వారం రోజులుగా రోజువారీ మృతులు 300 లోపే ఉంటున్నాయి. దీన్నిబట్టి ప్రస్తుతం మరణాలు మొత్తం కేసుల్లో 1.45 శాతానికే పరిమితమైనట్టు తెలుస్తున్నది. దేశంలో మొత్తం మృతులలో 63% వాటా మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలదే.