‘జస్టిస్ ఫర్ దిశ’ కేసులో నేరస్తులను కఠినంగా శిక్షించాలి

52
షాద్‌నగర్ జాతీయ రహదారిపై కాన్వాయి నిలిపి పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతున్న నారా చంద్రబాబు నాయుడు
  • మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్

రంగారెడ్డి, డిసెంబర్ 2 (న్యూస్‌టైమ్): శంషాబాద్‌లో ఇటీవల చోటు చేసుకున్న ‘జస్టిస్ ఫర్ దిశ’ వ్యవహారం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని, నేరస్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. శంషాబాద్‌లో జరిగిన దారుణంతో పాటు షాద్‌నగర్‌లో దిశ మృత దేహాన్ని దహనం చేసిన విషయాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు కాసేపు కాన్వాయిని రోడ్డుపై ఆపి అక్కడికి చేరుకున్న పార్టీ శ్రేణులతో ముచ్చటించారు. అక్కడ హాజరైన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శంషాబాద్ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

షాద్‌నగర్ జాతీయ రహదారిపై కాన్వాయి నిలిపి పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతున్న నారా చంద్రబాబు నాయుడు

నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో జరుగుతున్న లోటుపాట్లను గ్రహించి దోషులను త్వరగా శిక్ష పడే విధంగా చూడాలన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. దోషులను కఠినంగా శిక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులను పోలీసులు అరెస్టు చేయడం తగదన్నారు. ఈ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం ఆయన కర్నూలు పర్యటనకు బయలుదేరారు. చంద్రబాబు నాయుడు షాద్‌నగర్ బైపాస్ ప్రాంగణంలో చేరుకోవడంతో కార్యకర్తలు జై తెలుగుదేశం నినాదాలు చేశారు. తమ నాయకుడిని కళ్లారా చూసుకొని కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.