అమరావతి, ఆగస్టు 5 (న్యూస్‌టైమ్): రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వం కక్షకట్టినట్లు కనిపిస్తోందని తెలుగుదేశం సీనియర్ నాయకురాలు, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ అనుమానం వ్యక్తంచేశారు. ఆన్‌లైన్ విధానంలో బుధవారం ఆమె తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను అవమానపరిచేలా ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు కోర్టు చీవాట్లు పెట్టిందో ప్రజలకు తెలియంది కాదని ఎద్దేవాచేసిన అనురాధ పీపీఎ, చంద్రబాబునాయుడు సెక్యూరీటీ, పోలవరం ప్రాజెక్టు, స్విస్‌ ఛాలెంజ్‌, బందరు పోర్టు భూములు, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలు, విశ్వవిద్యాలయాల నిర్ణయాలు, ఆలయాల బోర్టు రద్దు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు, సౌరపవన్‌ విద్యుత్తు బకాయిలు, ఆంగ్లమీడియం, జాస్తి కృష్ణకిషోర్‌, ఇలా అనేక విషయాలల్లో చీవాట్లు తిన్నారని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పులేదని విమర్శించారు.

ప్రభుత్వ తప్పులను విమర్శిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పతనం మొదలైందని జోస్యం చెప్పిన ఆమె ఆ పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ప్రతి విమర్శలు చేశారు. అమరావతిలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వైసీపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మరోవైపు, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

రాజధానిపై హైకోర్టులో స్టేటస్ కో రావడం హర్షణీయమని చెప్పారు. ఒకవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రికి అవేమి పట్టడం లేదన్నారు. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే పోలీసులతో వారిని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసమే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారని ఆరోపించారు. అయినా ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా? అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి వామపక్షాల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెదపరిమి, నీరుకొండ, తుళ్ళూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. రాష్ట్రాన్ని రక్షించాలని మోకాళ్లపై కూర్చొని రైతులు సీడ్‌ యాక్సెస్‌ రహదారిపై హైకోర్టుకు వెళ్లే న్యాయమూర్తులను వేడుకొన్నారు.

ఏకైక రాజధానిగా అమరావతిని సాధించే వరకు దీక్షలు విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఇదిలావుండగా, అయోధ్యలో శ్రీరాముని ఆలయానికి మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఇక రామరాజ్యం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా దేశం కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు మాత్రం కన్నీరు పెడుతున్నారు. బుధవారం రామాలయంలో రైతులు పూజలు చేశారు. ఇక రామరాజ్యం వస్తుందని.. తాము అన్యాయం అవకుండా రాముడు కాపాడుతాడని ఆశిస్తున్నారు. పెద్ద ఎత్తున సెలబ్రెటీలు కూడా ఇదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మాయితోపాటు సింగర్ స్మిత కూడా అదే అభిలాష వ్యక్తం చేశారు. ఆ రాముడే అమరావతి రైతులను ఆదుకోవాలని స్మిత సోషల్ మీడియా ద్వారా కోరారు.

ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సహా అనేక హిందూ సంఘాలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ఈ మేరకు స్పష్టమైన ప్రకటనలు కూడా చేశారు. ఆర్ఎస్ఎస్ నేతలు దక్షిణాది అయోధ్యగా అమరావతిని మారుస్తామని ప్రకటించారు. భారీ రామాలయం నిర్మిస్తామని కూడా ప్రకటించారు. ఈ తరుణంలో అమరావతి రైతులకు మద్ధతు పెరుగుతోంది. రూపాయి ఆశించకుండా అమరావతికి రైతులు భూములిచ్చారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం బాగుపడుతుందని, రాష్ట్రంతోపాటు తాముకూడా బాగుపడతామని ఆశించినవారికి కొత్త ప్రభుత్వం తీరుతో నిరాశే ఎదురవుతోంది. కాగా రైతులకు సెలబ్రెటిల నుంచి మద్దతు లభిస్తోంది. కాగా, రాజధాని అమరావతి విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతూ సీడ్ యాక్సిస్ రోడ్డు కిరువైపులా నిలబడి హైకోర్టు న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేసిన తమను కుక్కలతో పోలుస్తూ వైసీపీ సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయటంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల ఫొటోలను వరుసగా నిలబడిన కుక్కలతో పోల్చి మిక్స్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తీవ్ర ఆవేదనలో ఉన్న తమపై ఇటువంటి దుష్ఫ్రచారం చేయటం సమంజసమేనా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ తరహా తప్పుగా ప్రచారం చేయటం ఏంటని నిలదీస్తూ మహిళా రైతులు నిరసన తెలిపారు.