న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (న్యూస్‌టైమ్): కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు సెంట్రల్ వేర్ ‌హౌస్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) ఆధునీకరణ ప్రణాళికను, సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా కేంద్ర మంత్రి గోయల్ మాట్లాడుతూ 2023 సంవత్సరం చివరి నాటికి సీడబ్ల్యూసీ తన గిడ్డంగి నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలని కోరారు. ప్రస్తుతం, సీడబ్ల్యూసీ గిడ్డంగి నిల్వ సామర్థ్యం 125 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. టారిఫ్ హేతుబద్ధీకరణ, కొత్త గిడ్డంగుల ఏర్పాటును, ఎటువంటి అధికారిక జోక్యం లేకుండా, సీడబ్ల్యూసీ స్వతంత్రంగా పనిచేయాలని, సూచించారు. కార్యకలాపాల కోసం నిర్ణయం తీసుకునే గరిష్ట అధికారాలను సీడబ్ల్యూసీకి అప్పగించాలని ఆయన అన్నారు.

ప్రాధాన్యత ప్రాతిపదికపై, దేశంలో శీతల గిడ్డంగులు, నిర్మించడంపై దృష్టి పెట్టాలని కూడా, ఆయన సీడబ్ల్యూసీని కోరారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, దోపిడీతో సహా, ఇతర ప్రమాదాల కోసం, అన్ని గోదాములలో, క్రమం తప్పకుండా, భద్రతా ఆడిట్ చేయాలని గోయల్ సీడబ్ల్యూసీని ఆదేశించారు. గోధుమలు, బియ్యం నిల్వ కోసం సి.డబ్ల్యు.సి. దేశవ్యాప్తంగా, ఆధునిక గిడ్డంగులు నిర్మించాలని, తద్వారా దేశంలో ఎక్కువ కాలం ధాన్యాలు నిల్వ చేయవచ్చునని గోయల్ అభిప్రాయపడ్డారు. నాఫెడ్‌‌తో సమన్వయంతో ఉల్లిపాయ, బంగాళాదుంప, టొమాటో నిల్వ కోసం సీడబ్ల్యూసీ మరింతగా, శీతల గిడ్డంగుల సౌకర్యాలను నిర్మించాలని గోయల్ సూచించారు.

సీడబ్ల్యూసీ తన మొత్తం 423 గిడ్డంగులను ఆధునీకరించి, అభివృద్ధి చేయడానికి వీలుగా ఒక బృహత్ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం, సీడబ్ల్యూసీ గిడ్డంగి, నిల్వ గ్యాప్ విశ్లేషణ చేయాలని, తదనుగుణంగా ఆర్కిటెక్టులు, నిపుణుల సహాయంతో ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. సిబ్బంది, ఖాతాదారులు, కార్మికులు, ట్రక్కు డ్రైవర్లు వంటి భాగస్వాముల అందరి సంరక్షణ కోసం సీడబ్ల్యూసీ యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని కూడా కేంద్ర మంత్రి చెప్పారు. అన్ని సీడబ్ల్యూసీ గిడ్డంగులలో పురుష కార్మికులు, మహిళా కార్మికులు, ఖాతాదారులు, డ్రైవర్లు, దివ్యాంగులకు మరుగుదొడ్లు, సరైన వేచి ఉండే గదులు, విశ్రాంతి గదులు, వర్కర్ షెడ్, తాగునీటి సౌకర్యాలు, చక్కటి, శుభ్రమైన వాతావరణంతో కూడిన ప్రాథమిక సౌకర్యాలు వంటి ఆధునిక, అనుకూలమైన సౌకర్యాలు తప్పకుండా ఉండాలని ఆయన సూచించారు.