నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితి

‘గోతుల విశాఖ’గా గుర్తింపు…

(* నేమాల హేమసుందరరావు)

‘గ్రేటర్ విశాఖ’కు బదులు ‘గోతుల విశాఖ’ అని తప్పుగా రాశారని అనుకుంటున్నారా? కాదండి.., మీరు చదువుతున్నది కరెక్టే. మహా విశాఖ నగరంలో గోతుల మయమైన రహదారులను చూస్తే ఎవరైనా ఇలాగే సెటైర్లు వేసుకుంటారు. ఇక్కడి పరిస్థితులు అలా ఉన్నాయి మరి. నగరంలోని రోడ్లను చూసిన వారికి దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేకపోయినా తెలియనివారిని మాత్రం ఆయా రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు జర జాగ్రత్తనే చెప్పాలి.

అడిగినవారికి అడగనివారికి కూడా వేలకు వేలు పంచుకుంటూపోతున్న అధికార పార్టీ నేతలకు మహా నగరంలోని రోడ్ల మరమ్మతుల విషయం గుర్తుకురాకపోవడం శోచనీయం. ఇక, మన పాలకులు ఈ నగరాన్ని విశాఖ అంటే అస్సలు ఒప్పుకోరు సుమీ. ‘గ్రేటర్ విశాఖ’ అని పిలవాలి. స్మార్ట్ సిటీ, మెట్రో సిటీ కూడాను. అంతే కాదు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి. విశాఖ, విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి. అన్నట్లు మరిచిపోయాం. విశాఖ క్యాపిటల్ సిటీ.., విశాఖ పరిపాలన రాజధాని, టూరిజం, ఎడ్యుకేషనల్, ఇండస్ట్రియల్, కల్చరల్ హబ్… ఇలా ఎన్నో రకాల మ(హ)బ్‌లండోయ్. దేశ, విదేశీ పర్యాటకులకు స్వర్గదామం విశాఖ జిల్లా.

అయితే, ఇవన్నీ కేవలం మాటలు, ప్రకటనల వరకే పరిమితం అన్నది వాస్తవ పరిస్థితిని చూస్తే ఇట్టే అర్ధంకాకమానదు. ఏమిటో నరకాన్ని తలపిస్తున్న నగర ప్రధాన రహదారులను చూస్తే విశాఖ అసలు రంగు కళ్లుముందు 70 ఎంఎం సినిమాను చూపిస్తుంది. ఇక, విశాఖ మన్యం, గ్రామీణ రహదారుల పరిస్థితి చెప్పనలవి కాదు. మోకాలి లోతు గోతులతో రహదారులు దర్శనమిస్తున్నాయి. వర్షం కురిస్తే రోడ్డు ఏదో, గొయ్యి ఏదో కనబడని పరిస్థితి. రాత్రి సమయంలో అయితే ఆ భగవంతునిపై భారం వేసి వాహనం నడపాల్సిందే.

‘‘విశాఖ రోడ్లు దేశంలోనే బెస్ట్‌’’ అంటూ బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ కితాబు ఇచ్చారంటూ అధికార పార్టీ పత్రిక ‘సాక్షి’ ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీ సంచికలో ఊదరగొట్టింది. పైగా, ఫ్లెమింగ్ బ్రిటన్ దంపతులు బ్రాత్‌ వెయిట్‌‌కు ట్విట్టర్‌లో సూచన చేసినట్లు మరీ గొప్పగా ప్రచారం చేసింది. అయితే, అండ్రూ ఫ్లెమింగ్ బీచ్ రోడ్డు మినహా ఏ రోడ్లు చూసి ముచ్చటపడ్డారో? చెప్పలేదు. ఒకసారి నగర వీధుల్లోని లింక్ రోడ్లను చూపిస్తే ఫ్లెమింగ్ ఏమంటారో రాస్తే బావుండేది. ‘‘అందాల నగరి విశాఖపట్నం అంటే.. ఇష్టపడని వారుండరు. అందుకే.. ఏపీ, తెలంగాణ బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ విశాఖ నగర అందానికి, ఇక్కడి రహదారులకు సలాం చేస్తున్నారు. అంతే కాదు.. విశాఖ వస్తున్న బ్రిటన్‌ దంపతులకు సైతం ఇదే విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్పారు. ‘ద ట్రాన్స్‌ ఇండియా ఛాలెంజ్‌’లో భాగంగా బ్రిటన్‌కు చెందిన అలన్‌ బ్రాత్‌వెయిట్, పాట్‌ బ్రాత్‌వెయిట్‌ దంపతులు క్వీన్‌బీ కారులో భారత యాత్ర చేపట్టారు. ముంబై నుంచి బయలుదేరి హైదరాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అహ్మదాబాద్, న్యూఢిల్లీ వంటి ప్రధాన నగరాల్ని చుట్టేస్తున్నారు. రెండు రోజుల్లో విశాఖ చేరుకోనున్న ఈ దంపతులకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ హై కమిషనర్‌ విశాఖ గొప్పదనానికి ఎవరైనా దాసోహం అనాల్సిందేనని కితాబిచ్చారు.’’ అంటూ ‘సాక్షి’ తన కథనంలో పేర్కొంది. (సాక్షి కథనం కోసం…)

ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. అంటూ కొనసాగింపుగా ‘‘రెండు రోజుల్లో క్వీన్‌ బీ విశాఖ బీచ్‌ రోడ్డులోకి ప్రవేశించనుంది. మీరు ట్రాన్స్‌ ఇండియా ఛాలెంజ్‌లో తిరుగుతున్న నగరాలన్నింటిలోనూ విశాఖ రోడ్లు ది బెస్ట్‌ అని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. మీరు నా మాటతో ఏకీభవిస్తారు. అంతటి అందమైన నగరంలో రెండు రోజుల్లో పర్యటించనున్న మీరు విశాఖ రోడ్ల గురించి నా మాటలతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మీ తీర్పు కోసం ఎదురు చూస్తుంటాను… అంటూ ట్వీట్‌ చేశారు. విశాఖ బీచ్‌ రోడ్డు ఫొటోతో పాటు బ్రాత్‌వెయిట్‌ దంపతుల ఫొటోను ట్వీట్‌లో పోస్ట్‌ చేశారు. ఫ్లెమింగ్‌ ట్వీట్‌కు విశేష స్పందన వస్తోంది. రీట్వీట్స్‌ చేస్తున్న చాలామంది.. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామంటూ మెసేజ్‌లు పెడుతున్నారు.’’ అని బీచ్ రోడ్డును చూసి మాత్రమే ఆయన ఈ మాట అన్నారని చెప్పకనే చెప్పింది. బీచ్ రోడ్డు ఫొటోతో సహా నగర వీధుల్లోని ఇంకొన్ని పాడైన రహదారుల ఫొటోలను కూడా తీసి ఆయన ట్వీట్‌కు రీ ట్వీట్ చేస్తే భలే ఉండేది.

జీవీఎంసీ పరిధిలో యూజీడీ సేవల కోసం దాదాపు అన్ని వీధులను మధ్యలో తవ్వేసి అసంపూర్తి ప్యాచ్ వర్క్‌లతో అసంపూర్ణంగా వదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆయా రహదారులు పూర్తిగా పాడై వాహనాల సంగతి దేవుడెరుగు కనీసం పాదచారులు నడవలేని పరిస్థితి ఎదురైంది. వీధుల్లో రహదారులను తవ్విన కాంట్రాక్టర్లే ఆయా రోడ్లను మరమ్మతులు చేసి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆ పని ఎందుకో గానీ, అన్ని ప్రాంతాలలో జరగలేదు. జీవీఎంసీ 5వ జోన్ పరిస్థిలోని దాదాపు అన్ని వార్డులు, వీధుల్లో తవ్వేసి అసంపూర్తిగా వదిలేసిన రహదారులే దర్శనమిస్తాయి. నాయకులు, ప్రజాప్రతినిధుల నివాసాలు, రాజకీయ పార్టీల, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న రోడ్లను సిమెంట్‌తో కప్పిన కాంట్రాక్టర్లు మిగిలిన రోడ్లను వదిలేస్తే జీవీఎంసీ అధికారులు చోద్యం చూడడం శోచనీయం. యూజీడీ తవ్వకాలు జరిగినప్పుడు ఆయా వీధుల్లో మురికి కాలువలు కూడా పాడయ్యాయి. సీసీ కాలువపై నుంచి భారీ వాహనాలు తిరగడం వల్ల అవి రిపేరయ్యాయి.

అధ్వాన్న స్థితికి చేరిన రహదారుల వలన తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క మహమ్మారి కరోనావైరస్, మరోపక్క మహా నగర రోడ్ల దుస్థితి ఎక్కడ ఏ సమయంలో ప్రాణాలను హరిస్తాయో అన్న భయంతో బతకాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పాపం ఎవరిది? పాలకులది కాదా? ఇదిలావుంటే.. గోతులు, రాళ్లు తేలిన రహదారుల వలన వాహనాలు పాడవుతున్నాయి. పర్యవసానంగా సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా టైర్లు, ట్యూట్లు, ఇతర స్పేర్ పార్టులు దెబ్బతిని వాహనదారుల జేబులకు చిల్లుపడుతోంది. ఆటోమొబైల్స్, స్పేర్ పార్టుల వ్యాపారుల గల్లా పెట్టెలు మాత్రం నిండుతున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం, నగదు పంపిణీల మాట ఎలా ఉన్నా, అభివృద్ధి, వార్డులు, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి, ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. నగదు పంపిణీ, పథకాల క్యాలెండర్ రూపొందించుకుని దాని ప్రకారం వర్చువల్ విధానాలలో సంక్షేమ పథకాల పేరిట పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేయడం జరుగుతోంది. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు లేని సంక్షేమం దేని కోసం? అన్న కోణంలో ప్రభుత్వ పెద్దలు గాని, నాయకమ్మన్యులు గానీ ఆలోచించడం లేదు.

మహా కవి గురజాడ అప్పారావు అన్నట్లు ‘పాలకులు వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టాలి.’ అధ్వాన్న స్థితికి చేరిన రహదారులను మెరుగుపరచాలి. లేదంటే జీవీఎంసీ పరిధిలో అధికార పార్టీకి స్థానిక ఎన్నికల్లో పరాభవం ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒక అనధికార అంచనా ప్రకారం, ఇప్పటికిప్పుడు జీవీఎంసీ ఎన్నికలు జరిగితే అధికార పార్టీ పరిస్థితి ప్రశ్నార్ధకమే.

(* రచయిత: సీనియర్ జర్నలిస్టు, +91 96031 41222, ‘నేషనల్ న్యూస్ ఎక్స్‌ప్రెస్’ తెలుగు దినపత్రిక సౌజన్యంతో…)