జవాన్ల మృతదేహాాలను తరలిస్తున్న భద్రతా బలగాలు

24కు చేరిన న‌క్స‌ల్స్ దాడి మృతులు!..

బీజాపూర్, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దుల్లోని అట‌వీ ప్రాంతంలో మావోయిస్టుల మ‌ధ్య కాల్పులు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది జవాన్లు మృతిచెందినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. శనివారం ప్రారంభమైన ఎదురుకాల్పులు ఆదివారం సాయంత్రం వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఎన్‌కౌంట్‌లో మ‌రో 43 మంది జవాన్లు స్వ‌ల్ప గాయాలతో బయటపడగా, ఇంకో 13 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల మ‌ధ్య భీక‌రపోరుతో ఛత్తీస్‌గఢ్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న‌ది. మొత్తం రెండు వేల మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొనగా, సుమారు వెయ్యి మందితో కూడిన‌ మావోయిస్టు గెరిల్లా ఆర్మీ గుట్టలపై నుంచి జవాన్లపై మెరుపు దాడి చేసినట్లు పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి.

ఈ దాడిలో మావోయిస్టులు మోటార్ లాంచ‌ర్‌ల‌ను కూడా వినియోగించిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో గల్లంతైన జవాన్ల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొన‌సాగుతున్నాయి. దాంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవకాశం ఉన్న‌ది. కాగా, ఈ ఘటనకు సంబంధించి అధికారిక వివరాలు వెల్ల‌డికావాల్సి ఉంది. నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో 19 మంది మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో 9 మంది కోబ్రా, 8 మంది డీఆర్జీ, 6 మంది ఎస్పీఎఫ్‌ సిబ్బందితో పాటు ఒక బస్తర్ బెటాలియన్‌ జవాన్‌ ఉన్నారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరికి బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం 21 మంది సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏడుగురు సీఆర్పీఎఫ్‌కు చెందిన వారున్నారు.

గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

మరోవైపు, గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోందని నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్స్‌ బృందం డైరెక్టర్ జనరల్ (డీజీ) అశోక్‌ జునేజా మీడియాకు వెల్లడించారు. బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ ఆదివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి తాజా పరిస్థితులపై ఆయన ఆరా తీస్తున్నారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన జవాన్లను బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రులకు తరలించినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. అమరులైన జవాన్లకు వీరు నివాళి అర్పించారు. అమిత్‌షా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు.

అంతేకాకుండా ఆ రాష్ట్రానికి వెళ్లి ఆపరేషన్‌కు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షించాలని సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ను ఆదేశించారు. మావోయిస్టులు మాటువేసి భద్రతా సిబ్బందిపై పంజా విసిరారు. అయితే, మావోయిస్టుల వైపూ ప్రాణనష్టం ఎక్కువగానే ఉండొచ్చని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. దండకారణ్యంలోని తరెం, జోనగూడ, సిల్గోర్‌ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేతకు సీఆర్పీఎఫ్‌, కోబ్రా, డీఆర్జీలకు చెందిన దాదాపు 2000 మంది భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఐదు ప్రాంతాల నుంచి ఒకేసారి దీనిని చేపట్టారు. ఈ క్రమంలో తరెం ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించి వస్తున్న 400 మంది బృందంపై మావోయిస్టు మిలిటరీ ప్లటూన్‌ దళాలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపగా ఓ మహిళా మావోయిస్టు సహా ఇద్దరు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో గత పది రోజుల్లో రెండో అతిపెద్ద ఘటన ఇది.

ఎదురుకాల్పుల్లో సంఘటన స్థలంలోని పరిస్తితి

ఒక బస్సును మావోయిస్టులు పేల్చివేసిన ఘటనలో మార్చి 23న ఐదుగురు డీఆర్‌జీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 3 గంటల పాటు ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, మావోయిస్టులకూ భారీ నష్టం వాటిల్లిందని ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డీఎం అవస్థి వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి జవాన్ల మృతదేహాలను, గాయాలపాలైన వారిని బయటకు తీసుకురావడానికి హెలికాప్టర్లను పంపినట్లు తెలిపారు. ఏడుగురిని రాయ్‌పుర్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా 23 మందిని బీజాపుర్‌లో చేర్పించారు. ఆచూకీ తెలియని జవాన్ల కోసం అన్వేషిస్తున్నారు. మావోయిస్టులకు పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లిందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. బీజాపూర్‌ జిల్లాలోని చర్పాల్‌-మోదీపారా అటవీ మార్గంలో మావోయిస్టులు అమర్చిన 8 కిలోల ఐఈడీ (ఇంప్రువైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌) బాంబులను బలగాలు నిర్వీర్యం చేశాయి.

అడవిలో నక్సల్స్ కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న దృశ్యం

దంతెవాడ జిల్లాలో మావోయిస్టు జన మిలీషియా కమాండర్‌ తెల్లం జోగా జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగిన ఆయనపై రూ.లక్ష రివార్డు ఉంది. అలాగే, తెలంగాణ రాష్ట్రం పరిధిలోని ములుగు జిల్లా మాన్‌సింగ్‌తండా పరిసరాల్లో పోలీసులు మావోయిస్టు డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులో 312 తూటాలు, 2 డిటోనేటర్లు, సీపీఐ మావోయిస్టు పార్టీ పత్రాలు లభ్యమయ్యాయి. ములుగు ఏఎస్పీ సాయిచైతన్య ఈ వివరాలు వెల్లడించారు.