ఐదేళ్లు ప్రజాసేవకు అంకితం: జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి

107

చిత్తూరు, జూన్ 23 (న్యూస్‌టైమ్): గత ఐదేళ్లలో జిల్లా పరిషత్ నిధులతో జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందించామని జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పరిషత్ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించామని, పాత, కొత్త ప్రభుత్వాల కలయికలో చైర్మన్‌గా పని చేయడం సంతోషకరమని తెలిపారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నారాయణస్వామి పని చేయడం జిల్లా అదృష్టం అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీలకు అతీతంగా పని చేసే మంచి వ్యక్తి అని సౌమ్యుడు అని, జిల్లా అభివృద్ధిలో ఇక నుండి వీరిరువురు భాగస్వామ్యం ఎక్కువగా ఉండి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో తొలుత ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎం.పి రెడ్డప్ప, ఎం.ఎల్.సిలకు, కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులకు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పూర్ణకుంభతో ఘనస్వాగతం లభించింది. అనంతరం సమావేశంలో భాగంగా జిల్లాలోని తాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టాలని సభ్యులందరూ కోరారు.

తాగునీటి సమస్యపై అధికారులు సత్వరమే చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా చైర్మన్ ఉపముఖ్యమంత్రి, మంత్రిని, చిత్తూరు ఎం.పినీ శాలువాతో సన్మానించి కానుకలను అందజేశారు. అనంతరం జెడ్పిటిసిలు, ఎంపిటిసిల పదవీకాలం ముగియనుండడంతో ఛైర్మన్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.పి. వెంకట అప్పలనాయుడు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.