నాదోపాసన ద్వారా…

0
8 వీక్షకులు
త్యాగయ్య ఊహాచిత్రం
  • నేడు సంగీత త్యాగబ్రహ్మ జయంతి

శాస్త్రీయ, కర్ణాటక సంగీత ప్రియులకు త్యాగరాజును ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడిగా ప్రసిద్ధి చెందిన త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా సంగీత రాజ్యాన్ని ఏలాడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరామునిపై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. త్యాగరాజు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1759లో జన్మించాడు.

త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు. త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు కాకర్ల గ్రామం నుండి తమిళనాడుకు వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆద్వర్యంలో ఉండేవాడు. త్యాగరాజు తాత గిరిరాజ కవి. ఆయన గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో గిరిరాజసుతా తనయ అని తన తాతను స్తుతించారు.

త్యాగయ్య విద్యాభ్క్ష్యాసం కోసం రామబ్రహ్మం తిరువారూర్ నుంచి తిరువయ్యూర్‌కు వెళ్లాడు. త్యాగయ్య అక్కడ సంస్కృతాన్ని, వేదవేదాంగాలను అమూలాగ్రం పఠించాడు. సంగీతాభ్యసం కోసం త్యాగయ్యను శొంఠి వేంకటరమణయ్య వద్ద శిష్యరికానికి పెట్టారు. వేంకటరమణయ్య త్యాగయ్య చాకచక్యాన్ని, సంగీతంలో గల ప్రావీణ్యతను గమనించి తన వద్ద అతి శ్రద్ధతో సంగీతోపదేశం చేయం ప్రారంభించారు. త్యాగయ్య తండ్రి పిన్న వయస్సులోనే గతించడంతో అన్నదమ్ముల మధ్య అయిన భాగపరిష్కారాలలో త్యాగయ్య భాగంలో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహాలు వచ్చాయట. ఆ ప్రతిమలను అతి భక్తితో పూజించేవారని చరిత్ర. ఆయన ఉంఛవృత్తి నవలంబించి సర్వసామాన్యంగా జీవనం సాగిస్తుండేవారు. తక్కిన సమయంలో తన ఇష్టదైవమైన శ్రీరాములపై కృతులు రచించడంలో నిమగ్నమయ్యేవారు. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామాలు జపించి స్వామి దర్శనాన్ని పొందారన్నది ఇతిహాసం. ఆయన మంచి శారీరాన్ని కలిగి ఉండేవారు. 18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది.

తరువాత ఆయన పార్వతి సోదరి కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు జన్మించింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు ఖచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పాటుచేసిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేళ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు.

గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుకు చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడట. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాలా సుఖమా అనే కీర్తన.

సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళాలను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనంగా మాత్రమే చూసాడు. తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు.

శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయాలను, తీర్థాలను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు. త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, స్వరార్నవమనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సందర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన సాధించెనే అనీ చెపుతారు.

ఈ పుస్తకం వల్ల త్యాగయ్య సంగీతంలో అత్యుత్కృష్టమైన విషయాలను తెలుసుకున్నట్లు గతం చెబుతోంది. శంకరాభరణంలోని స్వరరాగ సుధారసం అనే కృతిలో ఈ గ్రంథాన్ని గురించి త్యాగయ్య పేర్కొన్నారు. త్యాగయ్య 24000 రచనల వరకు రచించారు. దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు అనే బృంద కీర్తనలు కూడా రచించారు. ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరిత్రం అనే సంగీత నాటకాలను కూడా ఆయన రచించారట.

అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటక సంగీతానికి మూలస్థంభంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్‌లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఆయన భక్తులు, సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు.

సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచినది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల, సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణం చేపట్టారు. త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిధిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశం చేసికొని పరిశుభ్రం చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది.

అక్టోబర్ 27, 1921లో పునాదిరాయిని నాటగా, జనవరి 7, 1925న గుడి కుంభాభిషేకం జరిగింది. స్థలాభావం వలన ఇంకా నేల కొని ఒక మంటపం, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణాలతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణ సందర్భంలో చిత్తూరు నాగయ్య నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య త్యాగరాజ నిలయం అనే సత్రాన్ని కట్టించారు. త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు.

వీటిలో చాలావరకు ఆయన మాతృభాష అయినటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించినవి ఉన్నాయి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలో కన్ననూ కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరితం అనే నాట్యరూపకాలను కూడా రచించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here