ఎస్ఎస్‌బీఎన్ కళాశాలపై విచారణకు డిమాండ్

138
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గిరిజన విద్యార్ధి సంక్షేమ సంఘం (జీవీఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ నాయక్

అనంతపురం, డిసెంబర్ 7 (న్యూస్‌టైమ్): ఎస్ఎస్‌బీఎన్ కళాశాలలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి, పాలకమండలిని తక్షణమే రద్దుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గిరిజన విద్యార్ధి సంక్షేమ సంఘం (జీవీఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శివశంకర్ నాయక్ డిమాండ్ చేశారు. అనంతపురం నడిబొడ్డున గల ఎస్ఎస్‌బీఎన్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి పాలకమండలి వెంటనే రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.

శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011వ సంవత్సరం నుండి నేటి వరకు కళాశాలలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో దాదాపు 30 లక్షల భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడితే నిజాలు బయటపడతాయన్నారు. అలాగే ఈ ఎయిడెడ్ కళాశాల పట్టణంలోని కొంత మంది అగ్రవర్ణాల గుప్పెట్లో చిక్కుకుపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘రుసా’ నిధులు దాదాపుగా రెండు కోట్ల రూపాయలు మంజూరు అయితే, కళాశాల అభివృద్ధి పేరుతో తమ మనుషులకు కాంట్రాక్ట్ పనులు ఇచ్చి ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని, విద్యార్థులకు చదువు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాలలో మీరు చేసే అవినీతి అక్రమాలకు చూసి భవిష్యత్తులో విద్యార్థులు ఏ విధంగా తయారవుతారో భయంగా ఉందన్నారు.

ఈ నేపథ్యంలో తక్షణం కళాశాల అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయక్ హెచ్చరించారు. సమావేశంలో గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్, నాయకులు కృష్ణ నాయక్, మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.