అమరావతి, మే 4 (న్యూస్‌టైమ్): జర్నలిస్టులను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలోని జర్నలిస్టులను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించండి. కరోనా వైపరీత్య పరిస్థితుల్లో జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతోధిక సేవలందిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేయలేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాయి.’’ అని పేర్కొన్నారు.

జర్నలిస్టులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేసే ఏర్పాటు చేయాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు.

మరోవైపు, గుంటూరు జిల్లాలో కరోనా బారిన పడిన పాత్రికేయుల కోసం కొత్తపేటలోని నారాయణ సూపర్ స్పెషాలిటీ, ప్రతిమ హాస్పిటల్‌లో 20 పడకలను కేటాయించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో గుంటూరు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక పడకలు కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. జర్నలిస్టులకు ప్రత్యేక పడకలు కేటాయించినందుకు ఆళ్ల నానికి, కలెక్టర్ యాదవ్‌కు, డీఎంఅండ్‌హెచ్ఓ, డీడీపీఆర్ఓకు ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు సూచించారు. కరోనా బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలని కోరారు. కాగా, శ్రీకాకుళంలో జర్నలిస్టుల కోసం జెమ్స్ హాస్పిటల్‌లో 15 పడకలను కేటాయించారు.