అన్ని రంగాల్లో సింహపురి అభివృద్ధి

364
  • మౌలిక వసతుల మెరుగుకు కృషి: సోమిరెడ్డి

నెల్లూరు, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): సింహపురి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథాన నిలపడమే తమ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం, పెద్దచెరుకూరులో గురువారం పర్యటించిన చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అబ్దుల్ అజీజ్, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మేకల రామ్మూర్తి తదితరులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెమోరియల్ జెడ్పీ హైస్కూలు ప్రహరీతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రహరీలకు ప్రారంభోత్సవం, శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థాన ప్రాంగణంలో కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన, పెద్దచెరుకూరులోని శ్రీరామమందిరం ప్రారంభోత్సవం చేశారు.

మంత్రి సోమిరెడ్డికి అల్లీపురం, పెద్దచెరుకూరు ప్రజలు ఘనస్వాగతం పలికారు. సొంతూరి ప్రజల బాగోగులు తెలుసుకుని మంత్రి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.18.13 కోట్లకు పైగా నిధులతో రెండో డివిజన్ పరిధిలో అభివృద్ధి జరిగిందన్నారు. అల్లీపురంలోని హైస్కూలును జూనియర్ కళాశాలగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లలో ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశామని, ఎవరెన్ని మాట్లాడినా చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సగటు వృద్ధి రేటు 10.5 శాతంతో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉందన్నారు.