పత్రికల్లో ప్రచురితమైన తన వ్యాసాల సంకలనాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో దేవిప్రియతో మంగు రాజగోపాల్
(* మంగు రాజగోపాల్)

పుట్టి బుద్దెరిగి ఇంత దరిద్రగొట్టు సంవత్సరాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒకవైపు కరోనా మరణాలు గోరుచుట్టులాగా సలిపేస్తుంటే ఆపై రోకటిపోటులా కరోనా కాని మరణాలు గుండెని నలిపేస్తున్నాయి. నాకెంతో ఆత్మీయుడైన ప్రముఖ కవి దేవిప్రియ గారు ఈరోజు పొద్దున్నే తనువు చాలించారని వినగానే ముందు కరోనా అనుకున్నాను. అయితే ఆయన డయాబెటిస్ వ్యాధితో ఆస్పత్రిలో చేరారనీ, అది గాంగ్రీన్‌గా పరిణమించి చివరికి ఎడమ కాలు తొలగించాల్సి వచ్చిందనీ తెలిసి షాక్ తిన్నాను. ఇంతలో ఈ దుర్వార్త.

దేవిప్రియ గారి అర్ధాంగి రాజ్యలక్ష్మి కొన్నాళ్ళ కిందట కాలం చేశారు. ఆవిడ దేవిప్రియ గారికి అక్షరాలా అర్ధాంగి. అర్ధంతరంగా ఆవిడ వెళ్లి పోవడంతో దేవిప్రియ గారి దేహంలో సగభాగం చచ్చుబడిపోయినట్టు అప్పట్నించే బాగా డీలా పడిపోయారు. ఇప్పుడాయన తన అర్ధాంగి దగ్గరికి వెళ్లిపోయారు. పైగంబర కవులలో ఒకరిగా దేవిప్రియగారి పేరు అంతకుముందే విని ఉన్నా వ్యక్తిగా ఆయనతో పరిచయం 1977లో జరిగింది. అప్పుడాయన ప్రజాతంత్ర వారపత్రిక సంపాదకుడు. లెఫ్ట్ భావజాలం ఉన్న యువతని వరవర రావు గారి ‘సృజన’, దేవిప్రియ గారి ‘ప్రజాతంత్ర’ పత్రికలు ఒక ఊపు ఊపుతున్న రోజులవి. ఆ సందర్భంలోనే నాకు దేవిప్రియ గారితో పరిచయం కలిగింది.

ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ‘ప్రజాతంత్ర’ యజమాని రావు గారు అంతకుముందు వచ్చిన ‘యువ’, ‘జ్యోతి’ మంత్లీల మాదిరిగా ‘విజేత’ అనే సకుటుంబ మాస పత్రికని ప్రారంభించే సన్నాహాలు మొదలుపెట్టారు. దానికి కూడా దేవిప్రియ గారే సంపాదకుడు. అప్పటికే ‘ప్రజాతంత్ర’ వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్న దేవిప్రియ గారు ‘విజేత’ పత్రిక నిర్వహణలో సాయంగా రమ్మని తన మిత్రుడు నండూరి పార్థసారథి గారిని కోరారు. పార్థసారథి గారు అప్పటికే ‘ఆంధ్రప్రభ’లో చీఫ్ సబ్ ఎడిటర్ గా ఉన్నారు. ఉద్యోగం విడిచి వెళ్ళలేరు. ఏ సాయం చేసినా అనధికారికంగానే చెయ్యాలి.

నేను కూడా అప్పుడు ‘ఆంధ్రప్రభ’లోనే సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. నంపాసా గారు తనకి తోడుగా నన్ను కూడా ఆ పత్రికకి అనధికారికంగా పని చెయ్యమని కోరారు. సాహిత్యం మీద నాకు ఉన్న ఇంట్రస్టు కొద్దీ సరే అన్నాను. ‘ఆంధ్రప్రభ’లో నేను ఎక్కువగా నైట్ డ్యూటీలే చేసేవాణ్ణి. మధ్యాహ్నం నుంచీ ప్రజాతంత్ర/విజేత ఆఫీసుకి వెళ్లి దేవీప్రియ గారు, నంపాసా గారు ఏ పని చెపితే ఆ పని చేసేవాణ్ణి. ఓసారి దేవిప్రియ గారు నన్ను బంగారం మోజు, ధరల మీద ఒక ఆర్టికిల్ రాసి తెమ్మన్నారు. నేను చార్మినార్ దగ్గరున్న బంగారం షాపులకి వెళ్లి, ఆ యజమానులు, కస్టమర్లతో ఇంటర్ వ్యూలు చేసి, ఒక ఆర్టికిల్ రాసి దేవిప్రియ గారికి చూపించాను.

ఒక దిన పత్రిక జర్నలిస్టునైన నేను ఈ సబ్జెక్టుని ఆ ధోరణిలో కాకుండా ఒక మంత్లీ మేగజైన్‌కి ఒక రచయిత రాసినట్టు రాశాను. ఆ స్టయిల్ దేవిప్రియ గారికి బాగా నచ్చింది. దానికి ‘బంగారమే సింగారమా?’ అనే శీర్షికని ఆయనే పెట్టారు. దేవిప్రియ గారు, నంపాసా గారు తమకున్న పరిచయాలతో సాహితీ ప్రముఖుల చేత ‘విజేత’లో కథలు, కవితలు, వ్యాసాలూ రాయించేవారు. నేను రిపోర్టర్ మాదిరిగా ఇలా బయటికి వెళ్లి స్పెషల్ స్టోరీలు చెయ్యడంతో పాటు చిన్న చిన్న జోకులు కూడా కంట్రి బ్యూట్ చేసేవాణ్ణి. ఇద్దరూ ఉద్దండుల సంయుక్త సంపాదకత్వంలో కొద్దికాలమే నడిచినా అలనాటి ‘జ్యోతి’ మంత్లీని తలపింపచేసిన ‘విజేత’ మాస పత్రికలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యం.

అప్పట్లో ప్రజాతంత్ర/విజేత ఆఫీసు నాంపల్లి స్టేషన్ ఎదురుగా ఉండే పెద్ద షెడ్డులో ఉండేది. మేము అక్కడే పనిచేసే వాళ్లం. శివారెడ్డి, ఎన్.గోపి, చంద్ర, రాజారామ్మోహన రావు వంటి కవులు, రచయితలూ దేవిప్రియ గారి కోసం తరుచూ అక్కడికి వస్తుండేవారు. బయటికి చాయ్ కోసం అందరూ వెళ్లినప్పుడు దేవిప్రియ గారు నన్ను కూడా తీసుకెళ్ళేవారు. దేవిప్రియ గారి పుణ్యమా అని వీరందరి సాహితీ ముచ్చట్లు వినే భాగ్యం నాకు కలిగింది. దేవిప్రియ గారు ‘ఆంధ్రప్రభ’లో కొంతకాలం రన్నింగ్ కామెంటరీ శీర్షిక నడిపారు. ఆ సందర్భంగా మా ఆఫీసుకి వస్తుండేవారు. ఆ తర్వాత ‘ఉదయం’ పత్రిక కి ఏబీకే గారితోపాటే వెళ్లిపోయారు. మొట్ట మొదట ‘ఉదయం’ ఆఫీసు దోమలగూడాలోనే, ‘ఆంధ్రప్రభ’ ఆఫీసుకి నడక దూరంలో ఉండేది. వారి కోసం నేను ‘ఉదయం’ ఆఫీసుకి అప్పుడప్పుడు వెళ్తుండేవాణ్ణి.

నన్నుకూడా‘ఉదయం’లో చేరమని వారిద్దరూ పిలుస్తుండే వారు గాని నేనే ఆ కొత్త పేపరులో చేరడానికి సందేహించాను. ఆ తర్వాత, చాలాకాలానికి నేను హెచ్ఎంటీవీలో చేరడానికి వెళ్లినప్పుడు అక్కడ దేవిప్రియ గారు కనిపించారు. ఆయన అక్కడే పని చేస్తున్నారని తెలిసింది. చాలాకాలం తర్వాత ఇద్దరం కలిసి పని చేస్తున్నామనే సంతోషం కలిగింది. హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడు చాలాసార్లు ఆల్వాల్‌లో ఉన్న ఆయన అపార్ట్‌మెంట్‌కి వెళ్లి, ఆయన శ్రీమతి ఇచ్చిన తేనీటి ఆతిధ్యం పొందేను. దేవిప్రియ గారు హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడే ఆయన షష్టి పూర్తి సభ జరిగింది. ఆల్వాల్‌లో ఉన్న ఆయన అపార్ట్‌మెంట్ కింద సెల్లార్‌లోనే, ఆత్మీయుల సమక్షంలో ఎంతో వైభవంగా ఆ సభ జరిగింది. ఆ రోజుల్లోనే నేను నా ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ కాలమ్ ‘సరదాకి’ ఆర్టికిల్స్ అన్నీ పుస్తకంగా ప్రచురించాను.

ప్రెస్ క్లబ్‌లో 2012లో జరిగిన పుస్తకావిష్కరణ సభకి ఎందరో పాత్రికేయ ప్రముఖుల్ని ముఖ్య అతిధులుగా ఆహ్వానించాను. వారిలో దేవిప్రియ గారు కూడా ఒకరు. ఆయన నన్ను అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ చక్కని ప్రసంగం చేశారు. హెచ్ఎంటీవీ నుంచి తప్పుకున్నాక ఇద్దరం చాలా తక్కువ సందర్భాల్లో కలుసుకున్నాం. అప్పుడప్పుడు ఫోన్‌లోనే మాట్లాడుకునేవాళ్లం. చివరిగా ఆయన నాకు కరోనాకి ముందు ఫోన్ చేసి, తన పుస్తకావిష్కరణ సభకి రమ్మని ఆహ్వానించారు. అయితే, అప్పుడు ఏదో పని మీద నేను వైజాగ్‌లో ఉన్నందువల్ల వెళ్లలేకపోయాను. వచ్చాక కలుస్తానని చెప్పేను గాని కరోనా వల్ల కలవలేక పోయాను. అది తలుచుకుంటే ఇప్పుడు బాధగా ఉంది.

దేవిప్రియ గారు గొప్ప కవి మాత్రమే కాదు.. గొప్ప మానవతావాది, గొప్ప స్నేహశీలి కూడా. ఎంతోమంది ప్రముఖులతో పాటు దేవిప్రియ గారిని కూడా కర్కశంగా కబళించిన ఈ ఏడాదిని తలుచుకుంటే దుఃఖం గానూ ఉంది. కోపం గానూ ఉంది.

(* వ్యాసకర్త: సీనియిర్ జర్నలిస్టు)