భక్తి పారవశ్యం… తిరుమల సొంతం!

0
12 వీక్షకులు

వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం అణువణువునా కనిపించే భక్తి పారవశ్యం తిరుమల సొంతం. శ్రీమహావిష్ణువు చివరి అవతారమైన వేంకటేశ్వరుని అవతారంతో స్వామివారు తిరుమలలో కొలువుండడం ఈ పుణ్యక్షేత్రం ప్రత్యేకం. ఏడుకొండలవాడిగా, వడ్డికాసుల వాడిగా, భక్తుల కొంగుబంగారమైన మలయప్ప స్వామిగా పలు పేర్లతో పిలవబడే తిరుమలలోని స్వామివారి ఆలయం చరిత్ర ప్రసిద్ధం.

తిరుమల ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చరిత్ర పేర్కొంటోంది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఇలా అందరూ ఆ శ్రీవారి భక్తికి పాత్రులైనవారే. ఈ రాజులందరూ తమ తమ పాలనా కాలంలో స్వామి వారికి విలువైన కానుకలను సమర్పించుకోవడం ద్వారా ఆ కలియుగ దైవం పట్ల తమ భక్తిని చాటుకున్నారు. అయితే, పాతరోజులు సంగతి ఎలా ఉన్నా 19వ శతాబ్దం నుంచి తిరుమలకు కొత్త శోభ సంతరించుకోవడం ప్రారంభించింది.

అప్పటివరకు హాథీరాంజీ మఠం నీడలో ఉన్న తిరుమల ఆలయానికి 1870లో తిరుమలకు కాలిబాట స్థానంలో మెట్లు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పడడంతో తిరుమల సుప్రసిద్ధ ఆలయంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది.

ఈ సమయంలో తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మాణం పరిశీలనలోకి వచ్చింది. ఈ ప్రతిపాదన ఓ రూపు సంతరించుకుని 1944 నాటికి తిరుమలకు ఘాట్ రోడ్డు ఏర్పడింది. దీంతో గుర్రపుబండ్లు, ఎద్దుల బండ్లు ప్రయాణించే సౌకర్యం ఏర్పడడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ సమయంలో టీటీడీ తిరుమలకు బస్సులు సైతం ప్రారంభించడంతో భక్తుల రద్దీ తీవ్రమైంది.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 1974లో టీటీడీ రెండో ఘాట్ రోడ్‌ను ప్రారంభించింది. ఇదేతరుణంలో 1980లో టీటీడీ తిరుమలకు ఉన్న మెట్ల మార్గాన్ని మరింత పునరుద్ధరించి పైకప్పుతో పాటు కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఇలా క్రమంగా అభివృద్ధి చెందిన తిరుమల నేడు ప్రపంచంలోనే అత్యధిక రద్దీ, అత్యధిక రాబడి కలిగిన పుణ్యక్షేత్రంగా పేరుతెచ్చుకుంది. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు ఎలాంటి లోటు, ఇబ్బంది కలగకుండా తిరుమల పాలకమండలైన టీటీడీ అన్నిరకాల వసతి ఏర్పాట్లు చేసింది. ఉచిత దర్శనం, ఉచిత బస, ఉచిత భోజనం లాంటి వసతులతో సహా తిరుమలలో ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించింది.

తిరుమలలో ఉన్న వసతి సౌకర్యాలు విదేశీయులను సైతం ఆకట్టుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదేమో. తిరుమలకు విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా మరికొన్ని ఇతర పుణ్య క్షేత్రాలను, తీర్ధాలను దర్శించుకునే అవకాశం కూడా ఉంది. స్వామి గర్భగుడి (ఆనందనిలయం)కి సమీపంలో ఉన్న ధ్వజస్థంభం, వరదరాజస్వామి ఆలయం, వకుళమాత ఆలయం, యోగ నరసింహస్వామి ఆలయం, అన్నమయ్య భాండాగారం, వరాహా స్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం లాంటి వాటిని దర్శించుకోవచ్చు. అంతేకాకుండా తిరమలకు చుట్టుపక్కల ఉన్న తుంబుర తీర్థం, జాబిలి తీర్థం, చక్రతీర్థం, పాప వినాశం, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్, కపిలతీర్థం లాంటి ఇతర దర్శనీయ స్థలాలను సైతం దర్శించవచ్చు.

ఈ ప్రదేశాలను దర్శించడానికి టీటీడీ అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. తిరుమలకు రవాణా సౌకర్యం ఇంతటి విశిష్టత కలిగిన తిరుమల పుణ్యక్షేత్రాన్ని దేశంలోని ఏ ప్రాతం వారైనా సరే దర్శించడానికి అనువుగా విమాన, రైలు, బస్సు మార్గాలున్నాయి. తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని తిరుపతి ప్రధాన నగరం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రైలు ద్వారా తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడినుంటి నేరుగా తిరుమల చేరుకోవచ్చు. అలాగే బస్సులో వచ్చే ప్రయాణికులు సైతం తిరుపతి బస్ కేంద్రానికి చేరుకుని అక్కడినుంచి నేరుగా తిరుమల చేరుకోవచ్చు. వీటితోపాటు తిరుపతి కొద్దిదూరంలో ఉన్న రేణిగుంటలోని ఎయిర్‌పోర్ట్ నుంచి సైతం తిరుమలకు బస్సు, వాహన సౌకర్యం అందుబాటులో ఉంది.

వీటితోపాటు తిరుమలకు సంబంధించిన అన్ని విశేషాలు కలిగిన వెబ్‌సైట్ కూడా భక్తులకు అందుబాటులో ఉంది. దీని ద్వారా భక్తులు వసతి, స్వామివారి సేవలు, తిరుమల విశేషాలు లాంటి అన్ని సౌకర్యాలను ముందుగానే రిజర్వ్ చేసుకోచ్చు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో టీటీడీ తన కార్యాలయాలను భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచింది. ఈ కేంద్రాలకు సంబంధించిన సౌకర్యాలు సైతం టీటీడీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టీటీడీ ఎస్‌వీ భక్తి ఛానెల్ అనే శాటిలైట్ టీవీ ఛానెల్‌ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఛానెల్ ద్వారా తిరుమల్లో జరిగే భక్తి కార్యక్రమాలతో పాటు తిరుమలను గూర్చిన అన్ని విశేషాలను భక్తులకు అందించనుంది.