న్యూఢిల్లీ, నవంబర్ 7 (న్యూస్‌టైమ్): దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతి గృహానికి 2024 నాటికి కొళాయి కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో రూపొందించిన పథకాన్ని ఆధునిక పరిజ్ఞానంతో అమలు చేయడానికి జల్ జీవన్ మిషన్ సన్నాహాలు చేస్తున్నది. ప్రజలకు అవసరమైన పరిమాణంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రధుత్వం దీనికి ఆధునీకతను జోడించాలని నిర్ణయించింది. పథకం సక్రమంగా అమలు జరగడానికి ఇది అమలవుతున్న తీరుపై నిరంతర పర్యవేక్షణ అవసరముంటుంది. డిజిటలైసెషన్ మాత్రమే ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి పథకం అమలులోకి వచ్చిన తరువాత ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. అత్యంత ప్రధానమైన ఈ అంశాన్ని పరిష్కరించడానికి ఒక వ్యవస్థకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ప్రజలు, సంస్థల నుంచి నీటి సరఫరా యాజమాన్యం, పర్యవేక్షణకు వ్యవస్థను అందించాలని కోరుతూ ఒక పోటీని నిర్వహించారు. ఐసిటీ గ్రాండ్ ఛాలెంజ్ పేరిట ఎలక్ట్రానిక్సు అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలసి జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ జల్ జీవన్ మిషన్ ఈ పోటీకి దరఖాస్తులు ఆహ్వానించింది. జల్ జీవన్ మిషన్ ఈ పోటీలో తీసుకునే తుది నిర్ణయానికి బెంగుళూరుకి చెందిన సి-డాక్ సాంకేతిక సహకారాన్ని అందించి తుది పోటీదారులను ఎంపిక చేస్తుంది.

జల్ జీవన్ మిషన్ నిర్వహించిన ఈ పోటీకి దేశం నలుమూలల నుంచి స్పందన లభించింది. పోటీ పడడానికి అర్హతలు ఉన్న వ్యక్తులు, సంస్థలు దరఖాస్తులను పంపాయి. మొత్తం 218 దరఖాస్తులు అందాయి. 46 మంది వ్యక్తులు, 33 కంపెనీలు, 76 స్టార్ట్ అప్ సంస్థలు, 15 ఎల్ ఎల్ పి కంపెనీలు, 43 ఎంఎస్ఎంఈలు తమ ప్రతిపాదనలు అందించాయి. ప్రస్తుతం ఈ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వీటిని కుదించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది. తుది జాబితాలో 10 ప్రతిపాదనలు గుర్తించి తిరిగి పోటీని నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం ఎంపిక చేసిన వారు నిపుణులతో కూడిన ఎంపిక కమిటీ ఎదుట ప్రదర్శన ఇవ్వవలసి ఉంటుంది. తుది పోటీలో ముగ్గురిని ఎంపిక చేస్తారు. మొదటి స్థానం పొందిన వారికి 50 లక్షల రూపాయలను, మిగిలిన ఇద్దరికి చెరి 20 లక్షల రూపాయల చొప్పున బహుమతులను ప్రధానం చేస్తారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో నీటి ఎద్దడి లేకుండా చేయాలన్న లక్ష్యంతో స్వదేశీ పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ఈ పోటీలో పాల్గొన్నవారికి జల్ జీవన్ మిషన్ లక్ష్య సాధనలో పాల్గోడానికి అవకాశం కలుగుతుంది.