స్పీక‌ర్ గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు భంగం: వైసీపీ

143

గుంటూరు, నవంబర్ 11 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్ గౌరవ మర్యాదలను టీడీపీ నేతలు మంట గలుపుతున్నారని, చంద్ర‌బాబు నాయుడు, లోకేష్‌ సహా ఆ పార్టీ నాయకులపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతలు స్పీకర్‌ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలంటే చంద్రబాబు, లోకేష్‌కు ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. బీసీ వ్యక్తి స్పీకర్‌ స్థానంలో ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని నిప్పులు చెరిగారు.

టీడీపీ వెబ్‌సైట్‌ ఈ-పేపర్‌లో స్పీకర్‌ను కించపరుస్తూ వాడిన భాష సభ్య సమాజం తల దించుకొనేలా ఉందని రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్‌ స్పీకర్‌ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్‌ వ్యవస్థను కించపరిచిన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్పీకర్‌పై ఎందుకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారో కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ సమాధానం చెప్పాలని జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. సభాపతి తమ్మినేని సీతారాం అసెంబ్లీని హుందాగా నడుపుతున్నారని జోగి రమేష్‌ కొనిడారు.