బడిపంతుల బెత్తం వద్దు…

0
5 వీక్షకులు
కుమార్ యాదవ్

బడిపంతుల బెత్తం వద్దు… పోలీస్ లాఠీయే మాకు ముద్దు. ఇపుడు జరుగుతున్న తంతు ఎలా ఉందంటే? తప్పుచేశాక, అన్యాయాలు జరిగాక పోలీసులు, సమాజమూ జీవశ్చవ శిక్ష వేసినా పర్లేదుగానీ బడిలో టీచర్ భవిష్యత్ మేలుకోరి, ఉన్నతమైన మార్పుకోరి, అభ్యున్పతిని కాంక్షించి సందర్భానుసారం వేసే చిన్న చిన్న శిక్షలు కూడా పిల్లలూ, తల్లితండ్రులూ, చట్టాలూ అన్నీ వ్యతిరేకిస్తున్నాయి.

అంటే పంతుల బెత్తం పడితే తర్వాత ఘటనలే ఉండవా అనడం కన్నా, వ్యక్తిలోని మానసిక ఆలోచనలో వారు సైకలాజికల్ గానూ, నీతికథలు, భవిష్యత్ వచనాలు, సమాజ పోకడలు మంచి, చెడులూ, ఆరోగ్యం, శ్రమపట్ల గౌరవం, కుటుంబ వ్యవస్థ, ఆప్యాయతలు, సమాజమూ పోకడలు నేరాలు, రక్షణలూ. ఇలా ఒకటేమిటి, అన్నింటినీ వంటబట్టించే వారు గురువులు. వీరి సాన్నిధ్యంలో చిన్న నాటినుండి కొనసాగే క్రమశిక్షణ ప్రభావం చాలా అత్యున్నతంగా ఉంటుందన్నది భావన. ఉపాధ్యాయులు బడిలో చిన్నపని చేయించినా, క్రమశిక్షణ కోరి దండించినా చాలు ఏమాత్రం ఓర్వలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది.

నేడు ఉపాధ్యాయుల పాత్రపై దుష్ఫ్రభావం చూపుతున్న అంశాలు ఎన్నో ఉంటున్నాయి. వీటిని ప్రభుత్వాలూ, తల్లితండ్రులూ, సమాజమూ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయనే మనోవ్యధ గురువులులో అంతర్లీనంగా వేధిస్తోంది. నేడు పాఠ్యాంశాలు మార్కులకోసం తప్ప, సమాజమార్పుకోసం, నైతిక విలువల పెంపుదల కోసం ఏమైనా ఉంటున్నాయా? అలా ఎందుకు లేవో సమాధానం చెప్పేదెవరు?

సరైన అవగాహన, క్రమశిక్షణ, తల్లితండ్రుల అదుపాజ్ఞలూ లేకుండా, నిర్లక్ష్యంగా పెంచబడి, మనసున నిండిన మూర్ఖత్వంతో, భవిష్యత్ పరిణామాలనే మైమరచే కావరంతో అత్యంత నేరాలూ,ఘోరాలకూ కారకులవుతూ పోలీసులు వేసే కఠిన శిక్షలకు మాత్రం చాలామంది జేజేలు పలుకుతుండడం విడ్డూరంగా లేదూ? నేటి ఘటనలకు ఎవరు బాధ్యత వహించగలరు? ఒకరిపై మరొకరు నెట్టేసుకోవడం తప్ప. మూలాలను అధ్యయనం చేస్తేగదా వినాశకాలకు అంకురార్పణ ఎక్కడ జరుగుతోందని? పిల్లల్ని కనడం పోషణ భారం మాత్రమే తల్లితండ్రులకు అవకాశముంది, పెంపకమంతా బడి, కుటుంబమూ పరిధి దాటిపోయి దూరప్రాంతాల్లో గొప్పచదువుల పేరిట హాస్టళ్ళు లో వేయడం బంధాలూ, అభిమానాలూ, సామాజిక స్పృహకు దూరంగా నాలుగ్గోడలే హద్దుగా నిద్రాహారాలకు, మానసిక స్వేచ్చకు, స్వీయ ఆలోచన, పరిశీలనలకు నోచుకోలేని బంధనాల్లో బాల్య, విద్యార్థిదశంతా గడిచిపోతుంటే భవిష్యత్ పరిణామాలకు బాధ్యత ఫలనావారేనని నిర్ధారించే కొలమానమేదుందో ఎవరో చెప్పండి చూద్దాం.

అదే అభంశుభం తెలియని వయసులోంచే ఇంట్లో తల్లితండ్రులూ, బడిలో గురువులతోనూ నైతిక విలువల తోనూ, క్రమశిక్షణతోనూ కాస్తంత కఠినత్వం, హెచ్చరికలతో కలగలిపిన పెంపకానికి అవకాశాలు ఎందుకు మూసివేయబడుతున్నాయో ఆలోచించండి. పుట్టుకతోనే నేరస్వభావులెవరూ కారు. సరైన పెంపకం, సమాజ స్పృహ, మంచి చెడులుపై, నీతి, విలువలు వంటివాటిని బాల్యదశలో నుండి వారికి నిరంతరంగా అందకపోవడం వలనే ఎక్కువగా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

అలాగే సమాజంలోని ఆంతర్యాలూ, నాగరికత, అధునాతన పరిజ్ఞానం వంటివి పరిమితులకు ఆస్కారం లేకుండా అందుబాటులోకి రావడం కూడా నేరస్వభావాలకు కారకాలౌతున్నాయి. పాలకుల వివక్షా విధానాలు రాజకీయాలకు, స్వార్థాలకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రజాహితం కోసం అభివృద్ధి కోసం ఇవ్వకపోవడం మూలానా కూడా పోలీస్ లాఠీలు, తుపాకీలకూ అవకాశాలిస్తున్నారు. ఈ అవకాశాలు ప్రజలపై ఏదో ఓ దశలో తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయన్నది అందరికీ ఎరుకే. అనుభవమే.

మరి ఇలా ఎన్నో అంతర్లీన దుష్ఫ్రభావ ప్రేరేపితాల అంతుచూడకుండా, కేవలం శిక్షలకే ఎందుకు పరిమితం కావడమో శిక్షించేవారు, సమర్థించేవారూ స్వీయమననం చేసుకోవద్దా? అలా అని తప్పులకు శిక్షను వేయకుండా ఉండాలనడాన్ని సమర్థించినట్టు కాదు. అంటే ప్రాణాలు జీవితాలూ నాశనమయాక స్పందించడమే న్యాయమా? అంతకన్నాముందు నివారణా చర్యలకు పూనుకుంటే ఆ దుర్ఘటనలలోనూ ఎంతోమందిని బలికాకుండా కాపాడితే అంతకన్నా ఏంకావాలి? అదేకదా సమాజహితమంటే? అదేకదా సుపరిపాలనంటే? ఈ విషయాలైనా ఆలోచించి మార్పకోసం కృషిచేద్దామనే వారెందరుంటారో?

(రచయిత: బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here