సుందరదాసు బిరుదాంకితుడు!

0
24 వీక్షకులు

హైదరాబాద్, ఏప్రిల్ 20 (న్యూస్‌టైమ్): సుందరదాసు బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించినాడు). గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన సుందరకాండము (రామాయణంలోని ఒక భాగం) ఎమ్మెస్ రామారావు సుందరకాండగా సుప్రసిద్ధం. తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు.

ఈ రెండూ ఆయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య, మంగమ్మ సీతారామ భక్తులు. చిన్నతనం నుండే రామారావు పాటలు పాడుతుండేవారు. ఈయన విద్యాభ్యాసం నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో, గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. రామారావుకి 1942లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది.

వీరికి ఒక కుమార్తె (వెంకట సరోజిని), ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు) ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941లో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. జడ్జిలలో ఒకరైన అడివి బాపిరాజు చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను చాలా ప్రోత్సహించారు. 1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సి.హెచ్. నారాయణరావుకు ఇది గాత్రదానం.

తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. 1944 నుంచి 64 వరకు తెలుగు చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా మద్రాసులో నివసించిన ఆయన 5 సంవత్సరాల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. కొన్ని పాటలు రాసి గ్రామ్ ఫోన్ రికార్డులు ఇచ్చారు: నల్లపిల్ల, తాజ్‌మహల్, హంపి, కనీసం, హిమాలయాలకు రాలేనయ్యా, మొదలైనవి. నీరాజనం చిత్రంలో ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా పాటలో ఎమ్మెస్ గొంతు వినిపించింది. 1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి (రాజమహేంద్రవరం) చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1970లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌)లో పైలట్ ఆఫీసరుగా నియమితులయ్యారు. 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు.

దాంతో తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో చివరికి తాము నమ్మి ప్రార్ధించిన శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమయ్యాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ రాయడానికి అదే ప్రేరణగా చరిత్ర చుబుతోంది.

1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు. తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ సుందరకాండ గేయరచన చేశారు. 1975 నుంచి హైదరాబాదులోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన 1992 ఏప్రిల్ 20న హైదరాబాదులో సహజ కారణాల వల్ల మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here